iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నాడు-నేడు’ కార్యక్రమానికి తోడ్పాటు అందించేందుకు కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చాయి. కనెక్ట్ టు ఆంధ్రా కింద 5 కార్పొరేట్ సంస్థలు నాడు-నేడుకు తోడ్పాటు అందించనున్నాయి. విద్యాశాఖ గుర్తించిన 2,566 ప్రభుత్వ పాటశాలల్లో నాడు నేడు కింద ఈ 5 కార్పొరేట్ సంస్థలు అభివృద్ది కర్యక్రమాలు చేపట్టనున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నాయి.
402 ప్రభుత్వ పాఠశాలల్లో హెటిరో సంస్థ నాడు – నేడు చేపట్టనుంది. వైఎస్సార్ కడపలో చక్రాయపేట, జమ్మలమడుగు, లింగాల, పులివెందుల, సింహాద్రిపురం, తొండూరు, వేంపల్లి, వేముల మండలాల్లో పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ఆ సంస్థ రూ. 20 కోట్లకు పైగా ఖర్చుచేయనుంది.
428 ప్రభుత్వ పాఠశాలల్లో వసుధ ఫార్మా నాడు – నేడు చేపట్టనుంది. పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, పాలకోడేరు, పోడూరు, వీరవాసరం మండలాల్లో పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ఆ సంస్థ దాదాపు రూ. 21 కోట్లు ఖర్చు చేయనుంది.
రెయిన్ కార్బన్ సంస్థ 66 ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనుంది. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలంలో పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ఆ సంస్థ రూ. 1.65 కోట్లు ఖర్చు చేయనుంది.
ఆదిలీల ఫౌండేషన్ 281 ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ది చేయనుంది. శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి, పాతపట్నం, సారవకోట మండలాల్లో పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ఆ సంస్థ రూ. 25 కోట్లు ఖర్చుచేయనుంది.
గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 359 ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు లారస్ ల్యాబ్స్ రూ. 18 కోట్లు ఖర్చు చేయనుంది. కంచికచర్ల, వేలేరుపాడు, పెదకూరపాడు, తెనాలి, దుగ్గిరాల, ప్రత్తిపాడు మండలాల్లో పాఠశాలల్లో ఆ సంస్థ నాడు-నేడు చేపట్టనుంది.