Idream media
Idream media
హైదరాబాదు నగరంలో కరోనా వైరస్ సోకి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడి నివాసం ఉన్న ప్రాంతంలోని పాఠశాలలపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. అతని నివాస ప్రాంతానికి చుట్టుపక్కల 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలను మంగళవారం అధికారులు గుర్తించారు. బుధవారం ఎంపిక చేసిన 61 బడులలో చదువుతున్న విద్యార్థులకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
మరోవైపు కోఠి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న ఐదుగురు విద్యార్థులు కొన్ని రోజులుగా తరగతులకు గైర్హాజరవుతున్నారు.తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఈ విద్యార్థులను ఉపాధ్యాయులు నిలోఫర్ ఆసుపత్రిలో చేర్పించారు.ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు నీలోఫర్ వైద్యులు తెలియజేశారు.
కరోనా వైరస్ పై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న విద్యాశాఖ
రాజధాని నగరంలో కరోనా వైరస్ (కొవిడ్ -19) కేసు బయటపడడంతో తెలంగాణా విద్యాశాఖ కూడా అప్రమత్తమైంది.విద్యార్థులలో వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని హైదరాబాద్ జిల్లాలోని అన్ని పాఠశాలలకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.కరోనా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలను బుధవారం నుంచి పాఠశాల ప్రార్థన సమయంలో విద్యార్థులకు ఉపాధ్యాయులు వివరిస్తున్నారు.ఆహారం తినడానికి ముందు తర్వాత సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవడం,మరుగు దొడ్లకు వెళ్లి వచ్చినప్పుడు కాళ్లు, చేతులు శుభ్రపరుచుకోవడం వంటి విషయాలను వివరిస్తున్నారు.ఈ ఆరోగ్యకరమైన అంశాలను పాటిస్తామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయిస్తున్నారు.