iDreamPost
iDreamPost
ఏ దేశమేగినా ఎందుకాలెడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలపరా నీ జాతి నిండుగౌరవము.. అంటూ రాయప్రోలు సుబ్బారావు రాసిన ప్రతి వాక్కును మరోసారి మననం చేసుకోవాల్సిన సమయమిది. ‘మార్కెట్’ మీడియా ప్రభావంతో ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అన్న అంచనాను సామాన్య జనం బేరీజు వేసుకోలేకపోతున్న పరిస్థితులు నేడు సమాజంలో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో అగ్ర రాజ్యమంటే అమెరికానే అన్న దృక్ఫథం ప్రతి ఒక్కరి బుర్రల్లోకి ఎక్కించేసారు. అదే నిజమనుకుని నమ్మి పుస్తకం పట్టుకున్న ప్రతి ఒక్కడు అమెరికాయే వెళ్ళిపోవాలన్న డాలర్ కలలకు శ్రీకారం చుట్టుకున్నారు. అయితే ప్రపంచంలోని 206 దేశాలను ఇప్పటి వరకు చుట్టేస్తున్న కరోనా వైరస్ కారణంగా ఈ అగ్రరాజ్య భావనలను మన బుర్రలనుంచి తొలగించుకునేందుకు సదవకాశం లభించినట్లయింది.
దేశం ఏదో విపత్తు వచ్చి మునిగిపోతోందేమోనన్న సందేహం వచ్చిన వెంటనే అమెరికా తదితర యూరప్‌దేశాల్లో షాపులు, ఇతర వస్తువులు అమ్మే మాల్స్‌ను దోచుకుపోవడం ప్రారంభమైంది. ఆఖరికి పోలీస్‌లు తమ తుపాకులకు పనిచెబితే తప్ప అక్కడి జనం శాంతించలేదు. అందుకు భిన్నంగా విపత్తు వచ్చిందని, దాని వల్ల అనేక మంది ఇబ్బందులు పడడం ఖాయం అని తెలియగానే భారతీయుల్లో తోటివారికి సాయపడాలన్న దృక్ఫథం వ్యక్తమైంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల క్షేమ సమాచారాలు తెలుసుకోవడంతోనే సరిపెట్టేయకుండా అన్నార్తుల పరిస్థితి ఏంటన్న ఆలోచన మొదలైంది. ఇతర ప్రాంతాల నుంచి పొట్టచేత్తో పట్టుకుని ఇక్కడికి వచ్చిన వాళ్ళేమైపోతున్నారోనన్న ఆదుర్దా కన్పించింది.
దీంతో ఎవరికి తోచిన విధంగావారు, వారికి ఆహారం, నీళ్ళు, ఉండేదుకు చోటు సర్ధుబాటు చేయడంలో తలమునకలైపోయారు. ఇది ఎంతలా అంటే లాక్‌డౌన్ నిబంధనల కారణంగా ఉదయం 11 గంటల్లోపు తిరిగి ఇళ్ళచేరుకునే విధంగా తమతమ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అంటే తెల్లవారు జామునే లేచి అన్నం, కూర, సాంబారు, వాటర్ ప్యాకెట్‌లతో కూడిన పార్శిల్స్ సిద్ధం చేసుకుని ఎక్కడెక్కడ ఎవరున్నారని చూసుకుంటూ ఉదయం 7 నుంచి 11 లోపే పంపిణీ పూర్తిచేస్తున్నారు.
మునిగిపోతున్నాము అంటే పక్కనున్నవాడ్ని దోచుకుందామన్న ఆలోచనతో ఉన్న ఇతర దేశస్తులెక్కడ, ప్రమాదంరా అంటున్నా.. వెరవకుండా పక్కవాడి ఆకలిగురించి ఆలోచించేంత ఉన్నతమైన భారతీయుల స్థాయి ఎక్కడ. అందుకే మళ్ళీమళ్ళీ గుర్తు చేసుకుంటున్నాను ‘పొగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలపరా నీజాతి నిండుగౌరవము.’