Idream media
Idream media
కరోనా ప్రమాద ఘంటిక మోగిస్తోంది. తెలంగాణలో తొలిసారి స్వదేశియుడికి కరోనా సోకింది. ఈ రోజు వరకూ తెలంగాణలో 21 మందికి కరోనా పాజిటివ్ రాగా వారందరూ విదేశాల నుంచి వచ్చిన వారేనని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. సీఎం కేసీఆర్ ఈ విషయం ప్రకటించిన మరు క్షణమే.. లోకల్ వ్యక్తికి కరోనా సోకినట్లు హైదరాబాద్ వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ప్రకటించారు.
ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి కరోనా సోకితే.. దాన్ని మొదటి దశగా పిలుస్తున్నారు. వారి నుంచి స్వదేశంలో ఉన్న వారికి వైరస్ సోకితే దాన్ని రెండో దశగా భావిస్తున్నారు. తాజాగా నమోదైన 22వ పాజిటివ్ కేసుతో తెలంగాణ రాష్ట్రం కరోనా రెండో దవకు చేరుకున్నట్లుగా చెప్పవచ్చు.
కరోనా నియంత్రణకు జనతా కర్ఫ్యూను తెలంగాణలో 24 గంటల పాటు పాటించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ 24 గంటల పాటు రాష్ట్ర సరిహద్దులు కూడా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఎట్టి పరిస్థితిల్లోనూ కరోనా వైరస్ వ్యాప్తి కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుటోంది. అయితే ఈ ప్రక్రియలో ప్రజల బాధ్యతే ఎక్కువగా ఉంది. ఎవరికి వారు సామాజిక దూరం పాటించి, పరిశుభ్రంగా ఉండాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. భవిష్యత్‌లో రాష్ట్రం షట్‌డౌన్ చేయాల్సి వస్తే అవసరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు.