iDreamPost
iDreamPost
తెలుగు మీడియాకు కొత్త తలనొప్పి మొదలయ్యింది. ఓవైపు ఆర్థిక మాంధ్యపు ఛాయలతో ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న మీడియా సంస్థలకు ఇప్పుడు కరోనా కారణంగా లాక్ డౌన్ కావడంతో కకావికలం కావాల్సి వస్తోంది. బడా మీడియా సంస్థలు కూడా పీకల్లోతు కష్టాలతో దివాళా దిశగా సాగుతున్నాయి. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటుగా డిజిటల్ మీడియాకు కూడా ఇలాంటి సమస్యలు తప్పవనే సంకేతాలు వస్తున్నాయి. దాంతో 2005 తర్వాత అనూహ్యంగా పెరిగిన మీడియా రంగం పదిహేనేళ్ళ తర్వాత ఇప్పుడు అత్యంత గడ్డుస్థితిని ఎదుర్కొంటోంది.
ప్రింట్ మీడియాలో మొదలయిన ప్రకంపనలు
తెలుగు మీడియా సంస్థల్లో ఇప్పటికే ప్రకంపనలు మొదలయ్యాయి. ఆర్థిక పరిస్థితి దిగజారుతున్న తరుణంలో మీడియా ముందుకు సాగడం కష్టమనే సంకేతాలు అంతా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఆంధ్రభూమి పత్రిక మూతపడింది. వాస్తవానికి డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ ఒకనాడు బడా సంస్థ. ఆ తర్వాత ఆ గ్రూపులో తలెత్తిన పరిణామాలతో రానురాను తలకిందులయ్యే దశకు చేరింది. చివరకు ఇప్పుడు పత్రిక మూతపడే స్థానానికి వచ్చింది.
ఆంధ్రభూమితో పాటుగా ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి సహా అన్ని పత్రికలు కూడా అదే దారిలో ఉన్నాయి. ఇప్పటికే ఆంధ్రజ్యోతి వివిధ సెక్షన్లలో సగం మంది సిబ్బందిని ఇంటికి పంపించాలని నిర్ణయించింది. అందులో యాడ్స్, స్కానింగ్, ప్రింటింగ్ విభాగాల్లో సిబ్బందికి సమాచారం ఇచ్చేసింది. వారికితోడుగా డెస్కుల్లో పనిచేస్తున్న వారిని 30 శాతానికి కుదించాలని నిర్ణయించారు. జిల్లా టాబ్లాయిడ్ పేజీలు తొలగించి మెయిన్ ఎడిషన్ తో కలిపి అందిస్తున్న నేపథ్యంలో ఆయా జిల్లా ఎడిషన్లలో పనిచేస్తున్న అత్యధికులకు తొలగించవలసిన పరిస్థితి దాపురిస్తోందని చెబుతున్నారు. అదే పరంపరలో సాక్షి , ఈనాడు కూడా తొలగించాల్సిన సిబ్బంది జాబితా సిద్దం చేసినట్టు మీడియా వర్గాల్లో ప్రచారం సాగుతోంది. దాంతో ఈ ప్రచారం వాస్తవ రూపం దాలిస్తే పత్రికా రంగంలో ఉన్న మూడోవంతు పాత్రికేయులకు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఖాయంగా ఉంది.
ఎలక్ట్రానిక్ మీడియా
ప్రింట్ మీడియాతో పాటుగా ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఇలాంటి సమస్యలనే ఎదుర్కొంటోంది. కార్పోరేట్ రంగం కుదేలవుతున్న తరుణంలో ఇప్పటికే ఆదాయ మార్గాలు మూసుకుపోతున్నాయి. గత కొన్ని వారాలుగా ఎలక్ట్రానిక్ మీడియా కు యాడ్స్ దాదాపుగా నిలిచిపోయాయి. దాంతో ఒక్క మార్చి నెలలోనే తెలుగులో ముందంజలో ఉన్న ప్రధాన చానెళ్లలో ఒక్కొక్కరికీ కనీసంగా 40 లక్షల నుంచి 80లక్షల వరకూ ఆదాయం నిలిచిపోయినట్టు సమాచారం. ఏప్రిల్ లో అది కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. దాంతో సిబ్బంది వేతనాలకు, ఇతర ఖర్చులకు కూడా సరిపడా ఆదాయం రాకపోవడంతో ప్రధాన మీడియా సంస్థలు కూడా ఇప్పుడు పునరాలోచనలో పడినట్టుగా తెలుస్తోంది.
ఒకే గ్రూప్ నుంచి రెండు మూడు చానెళ్లు నిర్వహిస్తున్న వారు వాటిని కుదించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అందుకు తోడుగా ఇప్పటికే సతమతం అవుతున్న చానెళ్లను పూర్తిగా నిలిపివేసే ఆలోచన సాగుతున్నట్టు సంకేతాలు వస్తున్నాయి. దాంతో ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా జర్నలిస్టులకు, నాన్ జర్నలిస్ట్ సిబ్బందికి కూడా పెద్ద స్థాయిలో ఉద్యోగాలు కోల్పోవాల్సి ఉంటుందని భావిస్తున్నారు.
డిజిటల్ మీడియాకి కూడా అదే పరిస్థితి
మారుతున్న ప్రపంచ ఆర్థిక పరిణామాల ప్రభావం డిజిటల్ మీడియా మీద కూడా పడుతోంది. ఇప్పటికే పాపులర్ చానెళ్లుగా ఉన్నవారికి కూడా నిర్వహణ భారంగా మారబోతోంది. ఆదాయం తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. గూగుల్, యూ ట్యూబ్ ద్వారా లభించే ఆదాయంలో కోత తప్పదనే అంచనాలున్నాయి. ఇప్పటికే అలాంటి సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో రాబోయే రెండేళ్ల కాలం మీడియాకు అత్యంత క్లిష్ట సమయంగా మారబోతోంది. వివిధ ప్లాట్ ఫారంల మీద పనిచేస్తున్న మీడియా ప్రతినిధులకు దినదినగండంగా గడపాల్సిన పరిస్థితి తప్పదనే వాదన కూడా ఉంది. కరోనా సృష్టిస్తున్న విలయం కారణంగా మీడియా మీద తీవ్రంగా ఉండడం మాత్రం ఖాయం. అలాంటి ఉత్పాతాన్ని ఎదుర్కొని ఎవరు ముందుకు సాగుతారన్నది చూడాల్సి ఉంది.