టిడిపిపై కరోనా దెబ్బ … నిరుత్సాహంలో తమ్ముళ్ళు

తెలుగుదేశంపార్టీపై ‘కరోనా వైరస్ దెబ్బ బాగానే పడింది. ఆదివారం పార్టీ ఆవిర్భావ దినోత్సవం అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇంతటి ముఖ్యమైన దినోత్సవాన్ని నేతలు నలుగురు ఒకచోట చేరి జరుపుకునే అవకాశం లేకుండా చేసేసింది ‘కరోనా వైరస్. మామూలుగా అయితే పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకుంటారు. అదే సమయంలో జిల్లాల్లో కూడా ఎక్కడికక్కడ సీనియర్ల ఆధ్వర్యంలో ఉత్సవ వాతావరణంలోనే కార్యక్రమాలు జరుగుతాయి.

కానీ ఇపుడు అటువంటి అవకాశమే లేకుండా చేసేసింది ‘కరోనా. చంద్రబాబుతో సహా నేతలు, శ్రేణులు అందరూ ఎవరిళ్ళకు వాళ్ళే పరిమితమైపోవటం ఒక విధంగా వాళ్ళని నిరుత్సాహానికి గురిచేసేదే అనటంలో సందేహం లేదు. అసలే మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయింది. దాంతో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీలోనే కాదు చాలామంది నేతల్లో ఒకరకమైన నైరాశ్యం స్పష్టంగా కనబడుతోంది.

కాబట్టి ఇటువంటి సమయంలో పార్టీ పండగను ఘనంగా జరుపుకునే అవకాశం వస్తే చంద్రబాబు వదులుకునే ఛాన్సేలేదు. ఎందుకంటే నేతలందరినీ ఒకచోట చేర్చి వాళ్ళల్లో ఆత్మస్ధైర్యాన్ని నింపే అవకాశం వచ్చినపుడు చంద్రబాబు ఎలా వదులుకుంటాడు ? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలతో విరుచుకుపడేందుకు అవకాశం ఎప్పుడెప్పుడు వస్తుందా అని చంద్రబాబుతో సహా తమ్ముళ్ళందరూ ఎదురు చూస్తుంటాడన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంలో వచ్చిన ఆవిర్భావం దినోత్సవం జరుపుకునేందుకు లేకుండా ‘కరోనా చేసేయటం నిజంగా నిరుత్సాహపరిచేదనటంలో సందేహం లేదు.

Show comments