Arjun Suravaram
Arjun Suravaram
ప్రస్తుత సమాజం సాంకేతికంగా ఎంతో దూసుకెళ్తోంది. ఇదే సమయంలో ఆన్‌లైన్, సాంకేతికతను ఆధారంగా చేసుకొని సైబర్ కేటుగాళ్లు పెట్రేగిపోతున్నారు. అమాయకులు, మహిళలు, సాంకేతికతపై అవగాహన లేని వారిని, డబ్బు అవసరం ఉన్న వారిని టార్గెట్‌గా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. కేవలం నిరక్ష్యరాస్యులే కాకుండా విద్యావంతులు సైతం ఈ మోసాలకు బలవుతున్నారు. పోలీస్‌స్టేషన్లలో సైబర్ నేరాలకు సంబంధించిన కేసులే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇంకా దారుణం ఏమిటంటే.. సినీ, రాజకీయ రంగాలకు చెందిన కొందరు ప్రముఖలు సైతం ఈ సైబర్ కేటుగాళ్లకు మోసాలకు బలవుతున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావుకి కేటుగాళ్లు ఫోన్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌కు సైబర్ కేటుగాళ్లు వల వేశారు. హరిరామజోగయ్య పేరిట వీహెచ్ ను బురిడీ కొట్టించే ప్రయత్నం చేశారు. గుర్తు తెలియని నెంబర్ నుంచి హరిరామజోగయ్య పేరుతో వి.హనుమంతురావుకి ఓ కేటుగాడు కాల్ చేశాడు. ఆపదలో ఉన్నా.. అత్యవసరంగా డబ్బులు పంపాలని వీహెచ్ ను కోరాడు. కాల్ చేసిన నెంబర్ కాకుండా మరో కొత్త ఫోన్ నెంబర్ పంపి దానికి గూగుల్ పే చేయాలని విజ్ఞప్తి చేశాడు. అయితే.. తనకు వచ్చిన ఆ మొబైల్ నెంబర్ హరిరామజోగయ్యదని వీహెచ్ గుర్తించారు. దీంతో తన వ్యక్తిని నేరుగా హరిరామజోగయ్య ఇంటికి పంపి విచారణ చేశారు.
దీంతో అది ఫేక్ కాల్ అని తేలడంతో పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీకి వీహెచ్ ఫిర్యాదు చేశారు. ఖమ్మం నుంచి ఫోన్ వచ్చినట్టు పశ్చిమ గోదావరి ఎస్పీ చెప్పడంతో.. ఖమ్మం ఎస్పీ, సైబరాబాద్ పోలీస్‌లకు కూడా వీహెచ్ ఫిర్యాదు చేశారు. గతంలో కూడా జానారెడ్డి, సృజనా చౌదరి పేరుతో తనకు ఇలాంటి ఫేక్ కాల్స్ వచ్చాయని, ప్రభుత్వం సైబర్ నేరాల ప్రత్యేక దృష్టి సారించాలని వీహెచ్ కోరారు. మరి.. ఇలాంటి సైబర్ నేరాలను అరికట్టేందుకు మీ సలహాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.