మండలిలో గందరగోళం

ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలిలో గందరగోళం కొనసాగుతోంది. బిల్లులు ప్రవేశపెట్టే క్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు పంతాలకు పోతుండడంతో సభలో కార్యకలాపాలు ముందుకు సాగడంలేదు. పలుమార్లు సభ వాయిదా పడినా మార్పు రాలేదని తెలుస్తోంది. నిబంధనల ప్రకారం ద్రవ్య వినిమయ బిల్లును ముందు సభలో ప్రవేశపెట్టాలని అధికార వైసీపీ పట్టుబడుతుండగా. ముందు సీఆర్‌డీఏ రద్దు, రాజధాని వికేంద్రీకరణ బిల్లులు ప్రవేశపెట్టాలని ప్రతిపక్ష టీడీపీ డిమాండ్‌ చేస్తోంది. ఈ క్రమంలో ఇరు పార్టీల మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి.

మండలిలో ఇరు పార్టీల సభ్యుల మధ్య వాదనలు.. వ్యక్తిగత విమర్శలకు దారి తీస్తున్నాయి. బొత్స సత్యనారాయణ, అనిల్‌కుమార్‌ యాదవ్‌ తో సహా పలువురు మంత్రులు మండలి సమావేశాలకు హాజరయ్యారు. శాసన సభ కూడా వాయిదా పడడంతో మరికొంత మంది మంత్రులు వెళ్లారు. గడ్డం ఉన్న వాళ్లు రౌడీలుగా ప్రవర్తిస్తున్నారంటూ టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌ రెడ్డి పరోక్షంగా మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్, కొడాలి నానిలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో దీపక్‌ రెడ్డి వ్యాఖ్యలకు ధీటుగా బదులిచ్చిన అనిల్‌కుమార్‌.. చంద్రబాబుకు, మండలి చైర్మన్‌ షరీఫ్‌కు కూడా గడ్డం ఉందని, వారు కూడా రౌడీలేనా అని కౌంటర్‌ ఇచ్చారు.

ఫిబ్రవరిలో జరిగిన మండలి సమావేశాల్లోనూ ఇదే తీరున ఇరు పార్టీలు సభలో వ్యవహరించాయి. బిల్లులు అడ్డుకునే లక్ష్యంతో మండలిలో బలం ఉన్న టీడీపీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో అనేక బిల్లులను తిప్పి పంపింది. అసెంబ్లీలో వాటిని రెండో దఫా ప్రవేశపెట్టాల్సి వచ్చింది. సీఆర్‌డీఏ రద్దు, రాజధాని వికేంద్రీకరణ బిల్లుల కేంద్రంగా గత సమావేశాల నుంచి ఇరు పార్టీల మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి.

Show comments