iDreamPost
iDreamPost
మూడు నెలలకు పైగా గ్యాప్ తర్వాత తెరుచుకున్న థియేటర్లకు రెండో శుక్రవారం వచ్చేసింది. లాస్ట్ వీక్ చెప్పుకోదగ్గ స్థాయిలో తిమ్మరుసు మాత్రమే పర్వాలేదనిపించేలా వసూళ్లు తేగా ఇష్క్ మాత్రం ఫ్లాప్ ముద్ర నుంచి తప్పించుకోలేకపోయింది. రేపు ఏకంగా ఆరు సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. అందులో ఎక్కువగా ఆకర్షిస్తున్న చిత్రం ‘ఎస్ఆర్ కల్యాణమండపం’. కేవలం ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉన్న కిరణ్ అబ్బవరం హీరోగా నూతన దర్శకుడు శ్రీధర్ గాదె రూపొందించిన ఈ లవ్ ఎంటర్ టైనర్ పై యూత్ లో మంచి అంచనాలు ఉన్నాయి. రెండు పాటలు, ట్రైలర్లు కావాల్సినంత హైప్ ని తీసుకొచ్చాయి.
అడ్వాన్ బుకింగ్స్ పరంగా దీనికి మాత్రమే పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తోంది. ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ అనే మరో సినిమా కూడా యువతనే టార్గెట్ చేసుకుని వస్తోంది. హిందూ మనోభావాలు దెబ్బతీశారంటూ ట్రైలర్ మీద వివాదం వచ్చాక జనం దృష్టి దీనివైపుకు వెళ్ళింది. పూర్తిగా టాక్ మీదే ఆధారపడ్డ ఈ మూవీకి ఓపెనింగ్స్ కన్నా పబ్లిక్ రెస్పాన్స్ చాలా కీలకంగా మారనుంది. కమెడియన్లు హీరోలుగా నటించిన ‘ముగ్గురు మొనగాళ్లు’ కూడా రేపే బరిలో దిగనుంది. ఇప్పటికైతే బజ్ పెద్దగా లేదు. క్షీర సాగర మధనం, మెరిసే మెరిసే, మ్యాడ్ అనే మరో మూడు చిన్న సినిమాలు కూడా రేస్ లో ఉన్నాయి. ఈ పేర్లు సామాన్య ప్రేక్షకులకు సైతం అవగాహన లేదు
రేపు వచ్చే సినిమాల కలెక్షన్లు ఎలా ఉండబోతున్నాయనే దాని మీద ట్రేడ్ తో పాటు ఇండస్ట్రీ సైతం సునిశితంగా విశ్లేషించబోతోంది. రాబోయే 13కి ఏవో చిన్న చిన్న చిత్రాలు తప్ప కనీసం మీడియం రేంజ్ రిలీజ్ ఒక్కటి కూడా షెడ్యూల్ చేయలేదు. ఇది డిస్ట్రిబ్యూటర్లలో ఆందోళన రేకెత్తిస్తోంది. జనంలో పెద్దగా ఆసక్తి లేని సినిమాలు ఎన్ని స్క్రీన్లు వేసినా లాభం లేదని, ఇమేజ్ ఉన్న హీరోల నిర్మాతలు ఇలా ఇంకా వెయిటింగ్ గేమ్ ఆడటం బాగాలేదని అంటున్నారు. ఈ నెలలో ఇంకా మూడు శుక్రవారాలు పెండింగ్ లో ఉన్నాయి. వాటికి అనుగుణంగా కాస్త పెద్ద సినిమాలు వస్తే థియేటర్లకు కళ వస్తుంది. లేదంటే పరిస్థితి మళ్ళీ మొదటికే వచ్చే ప్రమాదం లేకపోలేదు
Also Read : నాని సినిమా విడుదల – నిజంగా జరగనుందా ?