Idream media
Idream media
రాజధాని అమరావతి ప్రాంతమైన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు శెభాష్ అని కొనియాడుతున్నారు. రాష్ట్ర ప్రజల మనస్సులను గెలిచేలా ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజధానిపై ఈ రోజు మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రజల ఆకాంక్షను ఎమ్మెల్యే ఆళ్ల వెలిబుచ్చారు.
రాజధానిగా కేవలం అమరావతి మాత్రమే ఉండాలంటున్న అమరావతిలోని కొన్ని గ్రామాల ప్రజలు, చంద్రబాబు, కొంత మంది టీడీపీ నేతల చెంప చెల్లుమనింపించేలా రాష్ట్ర ప్రజల పరిస్థితిని ఆళ్ల విడమర్చి చెప్పారు. ఆయన మాటలు విన్న వారు ఎవరైనా సరే మూడురాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకించబోరు. కేవలం తమ ప్రాంతమే రాజధానిగా ఉండాలని, మాకు రాజధాని కావాలంటూ, మూడు రాజధానులు వద్దంటూ ఆందోళనలు, నిరసనలు చేస్తున్న అమరావతిలోని కొంత మంది రైతులకు కూడా ఆళ్ల మాటలు వింటే వారి మనస్సు తప్పక మార్చుకుంటారనడంలో సందేహం లేదు.
ఉత్తరాంధ్ర, సీమ ప్రజలు ఎప్పుడూ విని ఉండరు..
రాజధానిగా అమరావతిని ప్రకటించక ముందు రాజధాని గ్రామాల్లో ఎకరం భూమి 25 లక్షల రూపాయలు ఉందన్న ఆళ్ల ఆ తర్వాత ఎకరం రెండు, మూడు కోట్లకు పెరిగిందన్నారు. మూడు రాజధానుల వల్ల తన, తన బినామీల భూములు విలువ తగ్గుతుందని చంద్రబాబు ఆడిస్తున్న నాటకమిదని ఎండగట్టారు. రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం, ఉత్తరాంధ్ర జిల్లాలోని రైతులు తమ ఎకరం భూమి విలువ రెండు, మూడు కోట్లు కాదు కదా కనీసం 25 లక్షలు అనే మాట కూడా ఎప్పుడూ విని ఉండరని ఆళ్ల రాష్ట్రలోని భూముల విలువ పరిస్థితిని కళ్లకుగట్టారు.
సీమ వాళ్లు గుంటూరుకు.. గుంటూరు వాళ్లు విదేశాలకు వలస..
శ్రీకాకుళం జిల్లా ప్రజలు కూలి పనుల కోసం హైదరాబాద్‌కు, అనంతపురం జిల్లా ప్రజలు బెంగూరుకు ఏళ్ల తరబడి వెళుతున్నారని ఆళ్ల ఆయా జిల్లాల ప్రజలు తమ జీవనానికి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో చాటి చెప్పారు. గుంటూరు జిల్లాలో మిర్చి పంటల కోత సమయంలో కర్నూలు నుంచి వచ్చే ప్రజలు తమ పిల్లలతోపాటు వేసవి కాలంలో మిర్చి పంటను కోస్తున్నారంటూ.. వారి దయనీయ బతుకు చిత్రాన్ని ఆళ్ల ఆవిష్కరించారు. కృష్షా, గుంటూరు జిల్లాల నుంచి కూడా ఏళ్లతరబడి వలసలు వెళుతున్నారని, అయితే ఆ వలసలు విదేశాల్లో నెలకు నాలుగైదు లక్షలు సంపాధించేందుకంటూ మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న వారికి కర్రు కాల్చి వాత పెట్టినట్లు ఆళ్ల చెప్పారు.
దశాబ్ధాల క్రితమే గుంటూరు, కృష్ణా అభివృద్ధి..
కృష్ణా, గుంటూరు జిల్లాలు దశాబ్దాల క్రితమే అభివృద్ధి చెందాయని, అన్ని రంగాల్లో ముందున్నాయని, మరో వైపు రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలు ఉపాధి కోసం ఇంకా వసలు వెళ్లే స్థితిలోనే ఉన్నాయంటూ అభివృద్ధిలో రాష్ట్రంలోని ప్రాంతాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుంటూరు జిల్లా వాసి అయిన ఎమ్మెల్యే ఆళ్ల తెలియజేసి ప్రజల మన్ననలు పొందుతున్నారు.
సీమ, ఉత్తరాంధ్ర ప్రజల బతుకులు అలానే ఉండాలా..?
రాజధాని ఎక్కడికీ పోవడంలేదని, మూడు రాజధానుల వల్ల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలన్నదే సీఎం జగన్ ఉద్దేశమని ఆళ్ల మరో మారు స్పష్టం చేశారు. మన లాగే రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదా..? అంటూ మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న వారిని సూటిగా ప్రశ్నించి, వారి నోళ్లు మూతబడేలా చేశారు. వలస కూలీలుగా దశాబ్దాల తరబడి బతుకుతున్న సీమ, ఉత్తరాంధ్ర ప్రజల జీవితాలను మార్చేందుకు సీఎం జగన్‌మోహన్ రెడ్డి సారధ్యంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందంటూ మూడు రాజధానుల ఏర్పాటను బలపర్చినట్లుగా ఎమ్మెల్యే ఆళ్ల ప్రెస్‌మీట్ సాగింది.
ఇకనైనా మారతారా..?
గుంటూరు జిల్లా వాసి, పైగా రాజధాని ప్రాంతమైన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మూడు రాజధానులు ఏర్పాటుకు మద్దతుగా మాట్లాడిన తర్వాతనైనా రాజధానిగా అమరావతి ఒక్కటే ఉండాలంటూ చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతున్న సీమ, ప్రకాశం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లా టీడీపీ ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధుల మనస్సు మార్చుకుంటారా..? లేక చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతారా..? వేచి చూడాలి.