iDreamPost
iDreamPost
కమ్యూనిస్టు సిద్దాంతంలో అతి ముఖ్యమైనది పెట్టుబడిదారుల దోపిడికి వ్యతిరేకంగా బడుగు వర్గానికి అండగా ఉంటూ వారి ఆస్తులు దోపిడికి గురి కాకుండా వారి పక్షాన నిలబడి పోరాటం చేయడం. ఇలా సంపద మరియు శక్తిని నిలుపుకున్న భూస్వాములకు వ్యతిరేకంగా మొదలైన కమ్యూనిస్టు సిద్దాంతం ఆంధ్రప్రదేశ్ లో మాత్రం గాడి తప్పి పెట్టుబడిదారీ వ్యవస్థకే మద్దతుపలుకుతూ వారి పక్షాన నిలబడి పోరాడటం ఈ మధ్య కనిపిస్తూ ఉంది. కమ్యూనిస్టుల సైద్దాంతిక నినాదం పక్కదారిపట్టడం వెనక కారణం ఎంటి? ఎవరి ప్రేరణతో ఈ భిన్నమైన విధానాన్ని కామ్రేడ్స్ మోస్తున్నారు?
రాజధాని పేరిట పెట్టుబడిదారుల బొక్కసాలు నింపేందుకు గత తెలుగుదేశం ప్రభుత్వం చేసిన ప్రయత్నం వలన ఆ ప్రాంత రైతాంగం, వ్యవసాయ కార్మికులు, గ్రామీణ ప్రజానీకం జీవన ప్రమాణాలు ప్రమాదంలో పడిన సంగతి తెలిసినదే. ఒక్క శాతం ఉన్న కార్పొరేటర్లు 99శాతం ఉన్న సామాన్యుల ఆస్తులను కొల్లగొట్టే ప్రయత్నం అమరావతిలో రాజధాని పేరిట జరిగితే విధానపరమైన సిఫార్సులు చేయకపోగా కమ్యూనిస్టులు ఒక్క శాతం కార్పొరేటర్లకి అండగా పోటీపడి ప్రకటనలు చేయడం ఆంధ్రప్రదేశ్ లో మొదలైన కమ్యూనిస్టు నయా సిద్దాంతం. మార్క్స్ అంటాడు ప్రపంచానికి కావల్సింది ఆర్ధిక అసమానతలు కూలదోసే సామ్యవాదం కానీ వర్గదోపిడి కి ఆవకాశం ఉన్న పెట్టుబడిదారీ విధానం కాదు అని.. కానీ మన రాష్ట్రంలో మాత్రం మార్క్స్ వాదులం అని చెప్పుకు తిరిగే కమ్యూనిస్టులు ఇలా బహిరంగంగా దోపిడి వర్గానికి కొమ్ముకాసే విధంగా తయారవడం శోచనీయం.
2014 ఎన్నికల్లో గెలిచి, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తరువాత తెలుగుదేశం పార్టీ పెద్దలు వారి బినామీలు, రైతాంగాన్ని మోసగించి భూములు ఆక్రమించుకున్న వైనం కనిపిస్తూనే ఉంది. మరోపక్క భూములు ఇవ్వని రైతులని భయపెట్టి చట్టాలు పేరిట బెదించి భూములు లాక్కుని సింగపూర్ కంపెనీలతో వ్యాపారం చెచేయబోయిన సంగతి తెలిసిందే. ఈ విధానంలో పూర్తిగా మోసపోయింది, నష్టపొయింది రైతాంగమే. ఎన్నికల ముందు వరకు ఇదే కామ్రేడ్స్ అదే అమరావతిలో అంతులేని అవినీతి జరిగిందని ధర్నాలు చేశారు. ప్రభుత్వ విధానాల వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు అని మైకులు ముందు గట్టిగా అరచి మరీ చెప్పారు. వందేళ్ల రికార్డులు సాకుగా చూపి దేవాదయ భూములని కూడా వదలకుండా అప్పటి పాలక పక్షం పెద్దలకు కట్టబెట్టారని బహిరంగ లేఖలు రాసారు. ఫ్లాట్ల కేటాయింపులో లాటరీ అంటూనే లోపాయకారీగా అనునాయులకి అత్యధిక విలువ వచ్చే ఫ్లాట్లు కట్టబెట్టారు అన్నారు. దళితులకి సంబంధించిన లంక భూములకి ప్యాకేజీ అందించే విషయంలో అవకతవకలు జరిగాయి అన్నారు. రాజధాని పేరిట కేంద్రం 1800 కోట్లు విడుదల చెస్తే 1000 కోట్లు విజయవాడ గుంటూరుకి వెచ్చించి 800 కోట్లు మిగతా రాష్ట్రానికి ఇస్తే వెరే ప్రాంతాలు ఎలా అభివృద్ది చెందుతాయి ఇది ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. కానీ ఎన్నికలు అయిపొయాక కామ్రేడ్స్ స్వరం మారిపోయింది.
కొత్తగా వచ్చిన జగన్ ప్రభుత్వం లక్షల కోట్లు రాజధానికి ఖర్చు పెట్టి మిగతా ప్రాంతాలను చిన్న చూపు చూస్తే రాష్ట్రంలో అసమానతలు పెరుగుతాయని భావించి అభివృద్ది వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారు. అమరావతితో పాటు వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు కూడా సమాంతరంగా అభివృద్ది పదంలో నడవాలనే ఆలోచనతో విశాఖపట్నం, కర్నూలు ప్రాంతాలని ఎంపిక చేసుకున్నారు. అమరావతిలో ఫ్లాట్లు ఇచ్చిన రైతులకు తగిన న్యాయం చేస్తాం అని స్పష్టమైన హామీ కూడా ప్రభుత్వం నుండి ఇస్తున్నారు. కాని కామ్రేడ్స్ కి మాత్రం ఈ విధానం రుచించటంలేదు. దాస్ క్యాపిటల్ సిద్దాంతానికి వ్యతిరేకంగా అభివృద్ది వికేంద్రికరణ జరగకుండా పాలన అంతా కేంద్రీకృతం అవ్వాలని ధర్నాలు చేస్తున్నారు. అత్యంత భారీ స్కాం జరిగిన అమరావతిలో సమగ్ర విచారణకి డిమాండ్ చేయాల్సింది పోయి రైతుల పేరు చెప్పి విచారణ జరగటానికి వీలులేని పరిస్థితులని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకీ ఆరాటం ఎవరి కోసమీ పొరాటం కామ్రేడ్స్ కి?
మహోన్నత చరిత్ర కలిగిన కమ్యూనిస్టు సిద్దాంతాలని తుంగలో తొక్కికమ్యూనిజం పేరుతో సొంత అజెండాని ఎత్తుకుని ఎవరిని ఉద్దరిద్దామని, ఎవరిని బాగు చేద్దామని నయా కమ్యూనిస్టుల ఆరాటం. ఇప్పటికే తప్పుడు నిర్ణయాలతొ దేశానికే ఉజ్వల భవిష్యత్తు గా మారాల్సిన కమ్యూనిజాన్ని యువతకు దూరం చేశారు. సొంత అజెండాతో మూల సిద్దాంతాలకి మగళం పాడారు. ఇవి చాలవన్నట్టు ఇప్పుడు వ్యవసాయ భూములు నాశనం చేసిన కబ్జా కోరులకి మేలు చేసే విధంగా వారి రియలేస్టేటు వ్యాపారానికి కొమ్ముకాసే విధంగా ఎర్రజెండాతో వాళ్ళకి నీడనిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చివరికి కామ్రేడ్స్ అనే పదానికి అర్ధమే మార్చేసి పతనం అయ్యే పయనంలో మరొక అడుగు కిందకు వేశారు.