iDreamPost
iDreamPost
అసలు స్టార్ హీరో హీరోయిన్ లేకుండా ఒక కామెడీ సినిమా కోసం జనాన్ని థియేటర్లకు రప్పించగలమా. ఈ ప్రశ్నకు సమాధానం జంధ్యాల వంటి ఉద్దండులు సూపర్ హిట్ల రూపంలో బదులిచ్చారు కానీ 90 దశకం నుంచి అందులోనూ కమర్షియల్ చిత్రాల ఆధిపత్యం మొదలయ్యాక ఎవరూ ఈ జానర్ జోలికి వెళ్లేందుకు సాహసించే వారు కాదు. రాజేంద్రప్రసాద్, నరేష్ లు అందరికీ దొరికే వారు కాదు కాబట్టి ఎందుకొచ్చిన రిస్క్ లెమ్మని అయితే ఫ్యామిలీ డ్రామా లేదా రివెంజ్ స్టోరీలకు దర్శక రచయితలు ఎక్కువ మొగ్గు చూపేవారు. కానీ ఈ ట్రెండ్ కు ఎదురీది పెద్దగా పేరు లేని ఆర్టిస్టులతో, అతి తక్కువ బడ్జెట్ తో, ఇంగ్లీష్ టైటిల్ మనీని సినిమా పేరుగా పెట్టి ఎవరూ ఊహించని బ్లాక్ బస్టర్ సాధించడమంటే మాటలా. ఆ అద్భుతం చేసి చూపించారు శివనాగేశ్వరరావు గారు…
దశాబ్దాలు గడుస్తున్నా వన్నెతరగని ఇలాంటి సినిమాలు అందించిన ఈ ట్రెండీ డైరెక్టర్ గతంలోకి ఓసారి వెళదాం
శివనాగేశ్వరరావు గారిది గుంటూరుకి దగ్గరలో ఉప్పలపాడు స్వగ్రామం. తోడబుట్టిన అక్కయ్య, ఇద్దరు చెల్లెళ్ళ మధ్య గారాబంగా పెరిగిన ఒకే ఒక్క మగసంతానం. తండ్రి నరసింహారావు రైతు కాగా తల్లి గృహిణి. చిన్నప్పటి నుంచే శివనాగేశ్వరరావుకు విపరీతమైన నాటకాల పిచ్చి. ఎంతగా అంటే స్కూల్ లో క్లాస్ మేట్స్ తో కలిసి నాటకం వేస్తున్నప్పుడు స్క్రిప్ట్ పేపర్ మీద హెడ్డింగ్ లో ఎర్ర సిరాతో దర్శకుడు అని తన పేరు వేసుకునేంత. గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్ మీడియట్ చేరాక ఇది తగ్గలేదు సరికదా ముదిరింది. బిడ్డ డాక్టర్ కావాలన్న లక్ష్యంతో బైపిసిలో చేరిస్తే ఫలితం దక్కలేదు. దీంతో చదువు మానేసి తండ్రికి సహాయంగా ఉంటూ దూరవిద్యలో బికామ్ చేయడం మొదలుపెట్టారు. ఏది చేస్తున్నా సినిమా మీద ధ్యాస తగ్గేది కాదు, ఆ తపన పోయేది కాదు.
కొన్ని వ్యాపారాలు ప్రయత్నిస్తే అవి దెబ్బ తీశాయి. ఇలా కాదనుకుని కంచికి చేరని కథ సినిమాను పంపిణి చేయడానికి ఓ స్నేహితుడితో కలిసి 15 వేల రూపాయలు పెట్టుబడి పెడితే అది కాస్తా ఫ్లాపై మొత్తం ఊడ్చేసింది. ఆ రోజుల్లో అది పెద్ద మొత్తం. అదే సమయంలో ఆ ఊరి కుర్రాడొకరు మదరాసులో దాసరి నారాయణరావుగారి అసిస్టెంట్ అని చెబుతూ అప్పుడప్పుడు వచ్చి తన దర్పం చూపించేవాడు. ఇతన్ని పట్టుకుంటే పరిశ్రమలోకి వెళ్లొచ్చని భావించిన శివనాగేశ్వరరావు చెప్పాపెట్టకుండా జేబులో 60 రూపాయలు పెట్టుకుని లారీ పట్టుకుని మదరాసులో సినీతారలు ఉండే కోడంబాకం చేరుకున్నారు. అక్కడికి వెళ్ళాక తెలిసింది ఫ్రెండ్ చేస్తోంది దాసరి దగ్గర కాదని ఆఫీస్ బాయ్ గా బయట పనిచేస్తున్నాడని. ఇలా అయితే లాభం లేదని స్వంతంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ముందు నటుడిగా ఎక్స్ ట్రా వేషాలు దక్కాయి. బుర్రిపాలెం బుల్లోడు, సన్నాయి అప్పన్నలో అసలు ఉన్నారో లేదో అనిపించేలా అలా మాయం అయ్యేవారు. మూడు రోజుల పనికి ఇచ్చే వంద రూపాయలు ఏ మూలకూ చాలేవి కాదు. ఒక ప్రొడక్షన్ ఆఫీస్ లో అకౌంటెంట్ కం మేనేజర్ పోస్టు దొరికింది. తిండి పెట్టేవారు కానీ జీతం అడిగితే చులకన చేయడంతో బయటికి వచ్చేశారు. అప్పుడు పరిచయమైన వ్యక్తి త్రిపురనేని మహారథి గారి అబ్బాయి చిట్టి. దేవుడి దయ, ఆయన సహాయం వల్ల కృష్ణగారి అమ్మాయికి మొగుడు అత్థకు యముడు సినిమాకు అసిస్టెంట్ గా పని దొరికింది. విజయనిర్మల గారి వద్ద భోగి మంటలు, అంతం కాదిది ఆరంభం, డాక్టర్ సినీ యాక్టర్ లకు దర్శకత్వ మెళకువలు నేర్చుకున్నారు. ఆ తర్వాత వి మధుసూదన్ రావు, సిఎస్ రావు, లెనిన్ బాబు, ఎస్ఎ చంద్రశేఖర్ గార్ల వద్ద సహాయకుడిగా పనితనాన్ని మెరుగుపర్చుకున్నారు. క్రాంతికుమార్ గారితో స్వాతితో మొదలైన ప్రయాణం ఆరేళ్ళు కొనసాగింది
అప్పుడు జరిగింది జీవితాన్ని మలుపు తిప్పిన ఒక సంఘటన. రావుగారిల్లు సినిమాకు శివనాగేశ్వరరావు పని చేస్తున్నప్పుడు రామ్ గోపాల్ వర్మ ఈయనతో పాటు డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో ఉన్నారు. తన కన్నా చాలా ఆలస్యంగా వచ్చిన వర్మ శివ రూపంలో గొప్ప అవకాశం దక్కించుకున్నప్పుడు ఎలాంటి ఈగోలకు పోకుండా దానికి అసిస్టెంట్ గా చేరారు శివనాగేశ్వరరావు. క్షణక్షణం జరుగుతున్న టైంలో స్వంతంగా కథ ఉంటే నేనే నిర్మిస్తానని వర్మ హామీ ఇచ్చాడు. దాంతో హాలీవుడ్ మూవీ రూత్ లెస్ పీపుల్ ని ఆధారంగా చేసుకుని తెలుగు ఆడియన్స్ టేస్ట్ కి అనుగుణంగా ఉండేలా మనీని సిద్ధం చేశారు శివనాగేశ్వరరావు. అందరికీ నచ్చేసింది వర్మతో సహా. ముందు దాసరి, ఎస్పి బాలుతో అనుకున్న పాత్ర ఫైనల్ గా పరేష్ రావల్ తో వేయించారు. జయసుధ, జెడి చక్రవర్తి,సురభి మంచి క్యాస్టింగ్ దొరికింది
అయితే అన్నీ అనుకూలంగా జరగలేదు. మనీ షూటింగ్ మధ్యలో ముంబై వెళ్తున్న పరేష్ రావల్ కు యాక్సిడెంట్ అయ్యింది. నాలుగు నెలలు బ్రేక్. మూడేళ్ళ పాటు మనీ పడ్డ అవస్థలు అన్ని ఇన్ని కావు. వర్మ మరోపక్క రాత్రి, అంతం, హిందీ ద్రోహి పూర్తి చేసినా కూడా ఇది ఒక కొలిక్కి రావడం లేదు. ఆరు నెలలు ఫస్ట్ కాపీ ల్యాబ్ లోనే ఉండిపోయింది. చూసిన డిస్ట్రిబ్యూటర్లు కూడా సినిమాలో ఉన్న గోల్డెన్ కంటెంట్ ని అర్థం చేసుకోలేకపోయారు. చివరికి వర్మనే కొన్ని ఆర్థిక వనరులు సమకూర్చి సురేష్ డిస్ట్రిబ్యూటర్స్ అండతో మనీని 1993లో థియేటర్లకు వచ్చేలా చేశారు. ఆ తర్వాత జరిగింది ఎంత పెద్ద చరిత్రో అందరికీ తెలిసిందే.
చాలా తక్కువ రిలీజ్ దక్కింది. మొదటి రెండు మూడు రోజులు పెద్దగా జనం లేరు. టాక్ మెల్లగా వస్తోంది. జనం నవ్వుకుంటూ బయటికి రావడం చూసి మీడియా సైతం ఇది సృష్టించబోయే ప్రభంజనాన్ని గుర్తించింది. అంతే కలెక్షన్లు అమాంతం పెరిగిపోయాయి. హౌస్ ఫుల్ బోర్డులు చూసి స్టార్ హీరోలు షాక్ అయ్యారు. శివలో నటించిన జెడి, చిన్నాలు మనీలో పంచిన కామెడీకి యూత్ పరవశించిపోయింది. జయసుధ, పరేష్ రావల్ పాత్రలు ఫ్యామిలీస్ కి కనెక్ట్ అయ్యాయి. శ్రీమూర్తి పాటలు వైరల్ కావడమంటే ఏంటో చూపించాయి. ఎక్కడ విన్నా భద్రం బీ కేర్ఫుల్ బెదరూ, వారేవా ఏమి ఫెసు పాటలే. ముఖ్యంగా ఖాన్ దాదాగా బ్రహ్మానందం విశ్వరూపానికి థియేటర్లు ఘొల్లుమన్నాయి. హీరో రేంజ్ లో ఆయనకిచ్చిన ఎలివేషన్లు ఇప్పటికీ సోషల్ మీడియా మీమ్స్ లో వాడుతూనే ఉన్నారు. తొలి చిత్రానికే శివనాగేశ్వరరావు అత్యుత్తమ నంది పురస్కారం అందుకోవడం ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప జ్ఞాపకం. కమెడియన్ గా బ్రహ్మానందం మొదటి నంది అవార్డు అందుకుంది మనీతోనే. సుప్రసిద్ధ సంగీత దర్శకులు చక్రవర్తి గారు పరేష్ రావల్ పాత్రకు డబ్బింగ్ చెప్పడం మరో విశేషం. నిజంగానే పరేషే చెప్పారన్నంత సహజంగా వచ్చింది. ఛాయాగ్రహణం బాధ్యతలు నిర్వర్తించిన టెక్నీషియన్ తేజ తర్వాతి కాలంలో అగ్ర దర్శకుడిగా (చిత్రం-జయం-నువ్వు నేను) ఎదగడం అదో కొత్త మలుపు.
అక్కడితో మొదలు హాయిగా నవ్వించే వినోదం ఇవ్వడం తప్ప మరో లక్ష్యం లేకుండా సినిమాలు తీశారు శివనాగేశ్వరరావు. జెడి చక్రవర్తి – శ్రీకాంత్ కాంబోలో తీసిన వన్ బై టూ ఆయన మీద ప్రేక్షకుల అంచనాలను వమ్ము చేయలేదు. రాజేంద్రుడితో లక్కీ ఛాన్స్ హాస్యంతో పాటు దురాశ వద్దనే చక్కని సందేశమూ ఇచ్చింది. మనీ మనీ మొదటి భాగం స్థాయిలో కాకపోయినా థియేటర్ కు వచ్చిన జనాన్ని నిరాశపరచలేదు. ఇప్పటి యూత్ సెన్సేషన్ అక్కినేని అఖిల్ ని రెండేళ్ల వయసులోనే తెరకు పరిచయం చేస్తూ హాలీవుడ్ స్థాయిలో సిసింద్రీని తీయడం ఎప్పటికీ అంతు చిక్కని ఒక అద్భుతం. వన్స్ మోర్, పట్టుకోండి చూద్దాం, ఓ పనైపోతుంది బాబూ బయ్యర్లను ఆనందంలో ముంచెత్తుతూ లాభాలు ఇచ్చినవి.
హ్యాండ్స్ అప్ ఆశించిన ఫలితం అందుకోలేకపోయినా స్పెషల్ క్యామియోలో మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం దక్కడం శివనాగేశ్వరరావుకి దక్కిన మరో అదృష్టం. రమణ ఫెయిలై కొన్ని పాఠాలు నేర్పించగా హేరాఫేరీ రీమేక్ ధనలక్ష్మి ఐ లవ్ యుని అందంగా రూపొందించారు. మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి లాంటి సెన్సిబుల్ లవ్ స్టోరీని, ఫోటో లాంటి థ్రిల్లర్ ని హ్యాండిల్ చేసి తాను అన్ని జానర్లను డీల్ చేయగలనని నిరూపించారు. భూకైలాస్, నిన్ను కలిశాక ఓ మోస్తరుగా ఆడినా ఆ తర్వాత బ్రేక్ తీసుకున్న శివ నాగేశ్వరరావు గారు మళ్ళీ ఇంత గ్యాప్ తర్వాత దోచేవారెవరురాతో మరోసారి కొత్త జెనరేషన్ కి తన నవ్వులా నజరానా ఇవ్వబోతున్నారు. బిత్తిరి సత్తి, అజయ్ ఘోష్ లతో ట్రేడ్ మార్క్ కామెడీని ఇంకోసారి రుచి చూపించబోతున్నారు.