iDreamPost
iDreamPost
ఒకే బ్యాక్ డ్రాప్ లో సినిమాలు రూపొందటం కొత్తేమి కాదు కానీ ఒక ఊరికి సంబంధించి ఒకే టైంలో నిర్మాణం చేసుకుని ఒకే సంవత్సరం ఒకే నెలలో విడుదల కావడం మాత్రం విశేషమే. అందులోనూ ఒకటి చిన్న హీరోది మరొకటి మెగాస్టార్ ది అయితే అసలు దాన్ని పోటీ అని అనుకుంటారా. కానీ విచిత్రంగా ఫలితం రివర్స్ కావడమే ఇక్కడ ట్విస్ట్. 1991లో జనవరి 3న ‘స్టువర్టుపురం దొంగలు’ రిలీజయింది. భానుచందర్ హీరోగా సాగర్ దర్శకత్వంలో సినిమా స్కోప్ లో భారీగానే నిర్మించారు. సత్యమూర్తి సంభాషణలు, రాజ్ కోటి సంగీతం ఇలా టెక్నీషియన్స్ పరంగానూ మంచి టీమ్ ని సెట్ చేసుకున్నారు.
ప్రొడక్షన్ లో ఉన్నప్పుడే చిరంజీవి సినిమాకి పోటీగా తీస్తున్నారా అనే కామెంట్స్ వచ్చాయి. ఆ తర్వాత వారం తిరక్కుండానే జనవరి 9న చిరు హీరోగా క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ మీద యండమూరి వీరేంద్రనాథ్ డైరెక్షన్ లో రూపొందిన ‘స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్’ విడుదలైంది. పరుచూరి బ్రదర్స్ స్క్రీన్ ప్లే, హరనాధరావు డైలాగ్స్, ఇళయరాజా సంగీతం, విజయశాంతి నిరోషాల గ్లామర్ ఇలాంటి ఆకర్షణలు పుష్కలంగా ఉన్నాయి. కట్ చేస్తే స్టువర్ట్ పురం దొంగలు హిట్ కాగా స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ మాత్రం దారుణంగా దెబ్బ తింది. నిజానికిది పోటీ వల్ల జరిగింది కాదు. యండమూరి సినిమాలో విషయం తక్కువైపోయింది. హంగులకు ఇచ్చిన ప్రాధాన్యం కథనానికి ఇవ్వకపోవడంతో డిజాస్టర్ తప్పలేదు. మరోవైపు ఇదే బ్యాక్ గ్రౌండ్ లో తీసిన స్టువర్ట్ పురం దొంగలు మాత్రం డీసెంట్ హిట్ కొట్టేసి యాభై రోజులు కూడా పూర్తి చేసుకుంది.
నిజానికి అప్పటి ట్రేడ్ ఊహించింది రివర్స్ ఫలితం. కానీ కంటెంట్ కి పట్టం గట్టే ప్రేక్షకులు తమ తీర్పు స్పష్టంగా ఇచ్చారు. చిరు సినిమాలో పాటలు మాత్రమే పేరు తెచ్చుకోవడం కొంత ఊరట. ఒకప్పుడు దొంగలకు ప్రసిద్ధ చెందిన స్టువర్ట్ పురం అనే ఊరిని నేపథ్యంగా తీసుకోవడం రెండు సినిమాల మీద అంచనాలు బాగా పెంచింది. అక్కడ కేవలం దొంగలు మాత్రమే ఉంటారనే ప్రచారం జోరుగా జరిగేది. యండమూరి ఆ ప్లాట్ నే తీసుకుని నవల రాస్తే అది హిట్టయ్యింది కాని సినిమా పోయింది. కాని స్వంతంగా సబ్జెక్టు రాసుకున్న స్టువర్ట్ పురం దొంగలు సక్సెస్ అయ్యింది. ఇందులోనే దగ్గుబాటి రాజా, లిజి, నాజర్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఒకే తరహా టైటిల్స్ తో ఇలా ఒకే సమయంలో రెండు సినిమాలు రిలీజ్ కావడం అరుదుగా జరుగుతుంది.