iDreamPost
android-app
ios-app

అమ్మ ఒడి రెండో విడతకు శ్రీకారం.. పిల్లల చదువులపై సరికొత్త నిర్ణయం వెల్లడించిన సీఎం జగన్‌..

అమ్మ ఒడి రెండో విడతకు శ్రీకారం.. పిల్లల చదువులపై సరికొత్త నిర్ణయం వెల్లడించిన సీఎం జగన్‌..

అమ్మ ఒడి పథకం రెండో విడతకు సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారు. కొద్దిసేపటి క్రితం నెల్లూరు కేంద్రంగా ఆయన ఈ పథకం రెండో విడతను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. పుట్టే ప్రతి బిడ్డకు అమ్మ ఒడి పథకం శ్రీరామ రక్ష అని సీఎం జగన్‌ అభివర్ణించారు. ఇకపై విద్యార్థి హాజరుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతుందని వెల్లడించారు. సీఎం జగన్‌ ప్రసంగ సారాంశం..

‘‘ ఈ రోజు పిల్లల భవిష్యత్‌ గురించి ఓ నిర్ణయం చెప్పబోతున్నారు. ఇక నుంచి పిల్లలు ఒక్క రోజైనా బడికి రానట్లైయితే.. తల్లిదండ్రులకు ఫోన్‌లో మెసేజ్‌ వస్తుంది. రెండు రోజులు వరుసగా బడికి రాకపోతే.. మూడో రోజు వలంటీర్‌ పిల్లల ఇంటికి వస్తారు. పిల్లల యోగక్షేమాలు అడుగుతారు. పిల్లలను బడికి పంపే బాధ్యత తల్లిదండ్రులదైతే.. వారు సక్రమంగా వచ్చేలా పని చేసే బాధ్యతను గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్లు, పాఠశాల విద్యా కమిటీలపైన పెడుతున్నాం. రాబోయే మూడేళ్లలో చదువుకునే వయస్సు ఉన్న ప్రతి పిల్లాడు బడికి వెళ్లేలా కార్యక్రమం చేయబోతున్నాం.

రాష్ట్రంలోని ప్రతి పేదవాని పిల్లలు చదువుకోవాలి. వారి తలరాత మారాలి. ఈ 19 నెలల పాలన ఆ దిశగా సాగింది. పిల్లలను చదివించుకోలేక, ఫీజులు కట్టుకోలేక వారిని పనులకు పంపిస్తున్న సంఘటనలను నా పాదయాత్రలో చూశాను. ఇలాంటి పరిస్థితులు మార్చేందుకే అమ్మ ఒడి పథకం ప్రారంభించాం. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే ఈ పథకం అమలు చేశాం. ఈ రోజు రెండో విడతగా పథకం అమలు చేస్తున్నాం. గత ఏడాది 6,400 కోట్లు అమ్మ ఒడి ద్వారా తల్లులకు అందించాం. ఈ ఏడాది 6,773 కోట్ల రూపాయలు అందిస్తున్నాం.

గత ఏడాది 38 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ బడులకు ఉండగా.. ఈ ఏడాది 42 లక్షల మంది పిల్లలు వెళుతున్నారు. ప్రైవేటు నుంచి ప్రభుత్వ బడులకు పిల్లలు మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. నాడు నేడు, విద్యా కానుక, గోరు ముద్ద పథకం, అమ్మ ఒడి పథకాల కారణంగా.. కోవిడ్‌ సమయంలో కూడా తమ బిడ్డలను మేనమామ జగన్‌ చూసుకుంటాడనే నమ్మకం తల్లులలో కలిగింది. అందుకే ప్రభుత్వ బడుల్లో సంఖ్య పెరుగుతోంది.

గత ప్రభుత్వ హయాంలో ఓ పద్ధతి ప్రకారం ప్రభుత్వ పాఠశాలలను నిర్విర్యం చేసేవారు. పుస్తకాలు సకాంలో ఇచ్చేవారు కాదు. మధ్యాహ్నం భోజనం నాణ్యత లేకుండా ఉంటుంది. సరుకులు బిల్లులు, ఆయాల గౌరవ వేతనం నెలల తరబడి పెడింగ్‌లో పెట్టేవారు. ఇంగ్లీష్‌ మీడియం కేవలం ప్రైవేటు స్కూళ్లలోనే ఉండేది. బాత్‌రూంలు ఎలా ఉన్నాయో కూడా పట్టించుకోలేదు. బడులు శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రభుత్వ బడులను నిర్వీర్యం చేస్తూ.. మరో వైపు ప్రైవేటు బడుల్లో ఫీజులు పెంచుకునేలా చర్యలున్నాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు… ఆర్థికంగా, సామాజికంగా అన్ని వర్గాల్లోని పేదలకు మంచి జరిగేలా పాలన చేస్తున్నాం.

పాఠశాలలు, కాలేజీలలో విద్యార్థుల సంఖ్యను బట్టీ మూత్రశాలు నిర్మాణం, నిర్వహణ చేపట్టబోతున్నాం. ఇందు కోసం అమ్మ ఒడి పథకంలో వెయి రూపాయలు మినహాయించబోతున్నాం. .’’ అని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు.