iDreamPost
android-app
ios-app

తన ప్రాధాన్యతను చెప్పకనే చెప్పిన జగన్‌

తన ప్రాధాన్యతను చెప్పకనే చెప్పిన జగన్‌

పరిపాలనలో తన ప్రాధాన్యత ఏమిటో సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మరోసారి నూతన మంత్రివర్గం కొలువుతీరిన వెంటనే చాటి చెప్పారు. సోమవారం మంత్రివర్గం కొలువుతీరగా.. ఆ మరుసటి రోజు నుంచే విద్య, వైద్య శాఖలపై సమీక్ష చేపట్టారు. ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం.. ప్రభుత్వ రంగంలోనే అందించాలనే లక్ష్యంతో ఉన్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆ దిశగా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు.

మంత్రివర్గం కొలువుతీరిన మరుసటి రోజు మంగళవారం నాడు వైద్యశాఖపై సంబంధిత మంత్రి విడదల రజనీ, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్‌.. వైద్య శాఖలో జరుగుతున్న పనులు,పోస్టుల భర్తీ,నూతన మెడికల్‌ కాలేజీల నిర్మాణం, కొత్త కాలేజీల అనుమతులు, ఆస్పత్రుల్లో జరుగుతున్న నాడు–నేడు పనుల పురోగతి, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌ సహా పలు అంశాలపై సుదీర్ఘంగా సమీక్ష చేశారు. తద్వారా నూతన మంత్రి విడదల రజనీకి ప్రభుత్వ ప్రాధాన్యత ఏమిటో అవగాహన కల్పించారు.

తాజాగా బుధవారం విద్యాశాఖపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బొత్స సత్యానారాయణ, ఉన్నతాధికారులతో విద్యాశాఖకు సంబంధించిన అన్ని అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. పాఠశాలల ఆధునికీకరణలో భాగంగా జరుగుతున్న నాడు – నేడు పనులు, ఇంగ్లీష్‌ మీడియం, ఈ ఏడాది నుంచి 8వ తరగతి పిల్లలకు ఇంగ్లీష్‌ మీడియం అమలు చేయడం, ప్రతి మండలానికి రెండు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు ఉండేలా చేయడం, విద్యా కానుక, అదనపు తరగతి గదుల నిర్మాణం సహా పలు అంశాలపై సీఎం వైఎస్‌ జగన్‌ సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఆయా అంశాలపై తగిన ఆదేశాలు జారీ చేశారు.