Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రభుత్వ పథకాలు ఎలా అమలవుతున్నాయి..? వాటిని మరింత మెరుగుపరిచేందుకు ఏం చర్యలు తీసుకోవాలో ప్రజల నుంచే సూచనలు, సలహాలు తీసుకునేందుకు క్షేత్రస్థాయిలోకి వస్తున్నారు. వచ్చే నెల నుంచి రచ్చబండ తరహా కార్యక్రమం చేపట్టాలని వైఎస్ జగన్ నిర్ణయించినట్లు సమాచారం.
ప్రజా సంకల్ప పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుని, వారికి ఏమి కావాలో ఓ నిర్ణయానికి వచ్చిన సీఎం జగన్ ఆ మేరకు నవరత్నాల పథకాలను మెరుగుపరిచారు. ఆ మేరకు అధికారంలోకి వచ్చినప్పటి నుంచే నవరత్నాలతోపాటు మెనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ మేరకు పలు పథకాలను అమలు చేస్తున్నారు.
ప్రజా సంకల్ప పాదయాత్ర సభల్లోనూ, ఎన్నికల సభల్లోనూ ప్రభుత్వ పథకాలను పార్టీలకు, కులాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ అందిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఆయా పథకాలను ప్రజలకు అందించేందుకు గ్రామ, వార్డు సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ నెల 30వ తేదీతో వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టి ఎనిమిది నెలలు కావస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పథకాలు ఎలా అమలవుతున్నాయి..? గ్రామాల్లో సమస్యలు, ప్రజలకు కావాల్సిన పనులు తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని వైఎస్ జగన్ చేపట్టబోతున్నారు.