విద్యారంగానికి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి పెద్ద పీటవేస్తున్నారు. అందులో భాగంగానే ప్రభుత్వ బడులను ఆధునీకరించి, ప్రపంచ స్థాయి విద్యార్థులుగా తీర్చిదిద్దుతున్నారు. అందుకోసం పలు పథకాలను తీసుకొచ్చారు ఏపీ సీఎం జగన్. ఇలాంటి పథకాలలో జగనన్నన అమ్మ ఒడి పథకం ఒకటి. ఇక పది రోజులపాటు పండుగలా జగనన్న అమ్మ ఒడి నిర్వహిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో నిర్వహించిన జగనన్న అమ్మ ఒడి నిధుల విడుదల కార్యక్రమ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
“ప్రపంచాన్ని ఆంధ్రప్రదేశ్ పిల్లలు ఏలే స్థితికి రావాలి అన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఇక నన్ను గుండెల్లో పెట్టుకున్న ప్రతీ ఒక్కరికి నా ధన్యవాదాలు. మేం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో విద్యారంగంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాం. తల్లులు తమ పిల్లలను బడికి పంపేందుకు భారం కాకుండా అమ్మ ఒడి పథకం తీసుకొచ్చాం. గతంలో క్లాసుల్లో టీచర్లు లేని పరిస్థితులు కానొచ్చాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. మన పిల్లలని ప్రపంచ స్థాయి స్టూడెంట్స్ గా తయ్యారు చేయడమే నా లక్ష్యం” అని పార్వతీపురంలో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
ఇక మూడో క్లాస్ నుంచే అన్ని సబ్జెక్ట్స్ కు టీచర్లు ఉండేలా.. ఆరో తరగతి నుంచి తరగతులను డిజిటలైజేషన్ చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. గడిచిన నాలుగేళ్లలో విద్యారంగంపై రూ.66,722 కోట్లు ఖర్చు చేశామని ఆయన పేర్కొన్నారు. అలాగే స్టూడెంట్స్ కు తొలిసారి బైలింగువల్ పుస్తకాలు అందజేస్తున్నట్లు వెల్లడించారు. ఇక దేశంలో ఏ రాష్ర్టంలో లేని విధంగా అమ్మ ఒడి పథకం ఏపీలో అమలు అవుతోందని చెప్పుకొచ్చారు. ఈ పథకం కింద ఇప్పటివరకు రూ.26,067.28 కోట్లు అందజేశామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వాలలో పెత్తందార్లకే అందుబాటులో ఉన్న ఉన్నత విద్యను.. ఇప్పుడు పేదలకు అందజేస్తున్నమన్నారు. ప్రస్తుతం చదువుల్లో అంటరాని తనాన్ని రూపుమాపాం. అలాగే ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దామని ఈ సందర్భంగా వివరించారు. ఇక విదేశాల్లో సీటు వస్తే.. రూ. కోటి 25 లక్షలు అందజేస్తున్నమని తెలియజేశారు సీఎం జగన్.