Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యేల వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. పరిధికి మించి సభలో వ్యవహరిస్తున్న తీరుతో తరచూ సస్పెండ్ అవుతున్నారు. ముఖ్యంగా పాలకొల్లు ఎమ్మెల్యే, టీడీపీ ఉప నేత నిమ్మల రామానాయుడు వ్యవహరిస్తున్న తీరు అత్యంత వివాదాస్పదం అవుతోంది. మొదటి మూడు రోజుల పాటు సభ నుంచి సస్పెండ్ అయిన నిమ్మల రామానాయుడు.. నాలుగో రోజు కూడా తన తీరును ఏ మాత్రం మార్చుకోలేదు.
ఈ రోజు సభలో సంక్షేమ బిల్లులపై చర్చ జరిగింది. సామాజిక పింఛన్లు సంఖ్య. ఇచ్చే మొత్తంపై నిమ్మల రామానాయుడు మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదనేలా.. అంతా టీడీపీ ప్రభుత్వంలోనే చేశామనేలా రామానాయుడు మాట్లాడడంపై సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. నిమ్మల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్యాలు చెబుతూ సభను పక్కదోవపట్టిస్తున్నారని మండిపడ్డారు. పింఛన్ల వివరాలను సీఎం వైఎస్ జగన్ సభలో వెల్లడించారు.
టీడీపీ ప్రభుత్వం ఆఖరు రెండు నెలలో పింఛను మొత్తాన్ని వెయి రూపాయల నుంచి రెండు వేలకు పెంచిందన్న విషయం అందరికీ తెలుసని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వంలో పింఛన్ ఎంత ఇచ్చారని అడిగితే.. ఎవరైనా వెయి రూపాయలని చెబుతారని సీఎం జగన్ అన్నారు. తాము నవరత్నాల పేరుతో పింఛన్ నగదు పెంపుపై ప్రకటన చేసిన తర్వాత ఎన్నికలకు రెండు నెలల ముందు వెయి రూపాయల పింఛను రెండు వేలు చేశారని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాతనే పింఛను మొత్తాన్ని 2250 పెంచి ఇస్తున్నామని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు 44 లక్షలు మాత్రమేనని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 61.94 లక్షల మందికి ఫించన్లు ఇస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.
పింఛన్ల గణాంకాలు ఇలా ఉంటే.. నిమ్మల రామానాయుడు సభను పక్కదోవ పట్టించేలా అసత్యాలు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం వైఎస్ జగన్.. ఆయనపై సభా హక్కుల ఉల్లంగణ కింద తీర్మానం ప్రవేశపెట్టాలని కోరారు. ఈ అంశంపై స్పందించిన స్పీకర్ తమ్మినేని సీతారం సభానాయకుడి సూచన మేరకు టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడుపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.