iDreamPost
iDreamPost
సీఎం రమేష్. తెలుగుదేశం ప్రభుత్వంలో వెలిగిపోయిన నేతల్లో ఒకరు. ఏపీలో అధికారాన్ని ఉపయోగించుకుని ఆయన ఓవైపు కాంట్రాక్టులు, మరోవైపు రాజకీయ వ్యవహారాలతో ఫుల్ బిజీగా సాగిపోయారు. ఎవరైనా టీడీపీని గానీ, తనను గానీ విమర్శిస్తే చెలరేగిపోయేవారు. ఆయన దాటికి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు వంటి వారు బలయ్యారు. అంతేగాకుండా ఐటీ అధికారులతో కూడా సీఎం రమేష్ వర్గీయులు వ్యవహరించిన తీరు ఆసక్తిగా మారింది.
అదంతా గతం. ఇక వర్తమానంలోకి వస్తే సీఎం రమేష్ సంపూర్ణంగా మారిన మనిషి అయిపోయారు. నిజమా..అంటే ప్రస్తుతానికి అలానే కనిపిస్తోంది. ఇటీవల బీజేపీ కండువా కప్పుకున్న సీఎం రమేష్ కమలం గూటిలో ఉన్నప్పటికీ అంత సఖ్యంగా కనిపించడం లేదని సమాచారం. ఆయన సహచరుడు బీజేపీ కండువాతో చెలరేగిపోతున్నా సీఎం రమేష్ మాత్రం దానికి భిన్నంగా స్పందిస్తున్నారు. ఇటీవల తనయుడు వివాహం అంగరంగవైభవంగా నిర్వహించిన సీఎం రమేష్ ఆ తర్వాత మారిన మనిషిలా వ్యవహారిస్తున్నారు.
జగన్ పుట్టిన రోజు సందర్భంగా సీఎం రమేష్ ట్వీట్ ఆసక్తిగా మారింది. దానికి కారణం కూడా లేకపోలేదు. టీడీపీలో ఉన్నంత కాలం ఆపార్టీకి చెందిన సీఎం రమేష్ కడప రాజకీయాల్లో అంతా తానై అన్నట్టుగా వ్యవహరించాలని ఆశించారు. చివరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకానందరెడ్డికి వ్యతిరేకంగా పావులు కదపడంలోనూ, జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డిని వైసీపీ నుంచి టీడీపీలోకి చేర్చడంలోనూ సీఎం రమేష్ ది ప్రధాన పాత్ర.
హంద్రీనీవాలో రిత్విక్ కంపెనీకి దక్కిన కాంట్రాక్టులతో భారీగా మొబైజేషన్ అడ్వాన్సుల ద్వారా సీఎం రమేష్ అవినీతికి పాల్పడ్డారని అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఐటీ సోదాల్లో భారీగా అక్రమాస్తులు పట్టుబడినట్టు ప్రచారం సాగింది. ఆతర్వాత సొంత పార్టీ టీడీపీ మొన్నటి సాధారణ ఎన్నికల్లో ఓటమి పాలయిన తర్వాత కాషాయ గూటికి చేరిన సీఎం రమేష్ ఇటీవల జగన్ తో స్నేహం కోసం ఆరాటపడుతున్న తీరు ఆసక్తిగా మారుతోంది.
జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయకుండా జాగ్రత్తలు పడుతున్న సీఎం రమేష్, అదే సమయంలో జగన్ ని ప్రసన్నం చేసుకునే అవకాశాలను మాత్రం వదులుకోవడం లేదు. అందులో భాగంగానే తాజాగా కడప జిల్లా పర్యటనలో నేరుగా సీఎంని కలిసి, శాలూవా కూడా కప్పేశారు. దాంతో ఈ వ్యవహారం ఆసక్తిగా మారుతోంది. సీఎం రమేష్ సీన్ మారుతున్న నేపథ్యంలో సీఎం స్పందన ఎలా ఉంటుందన్నదే చర్చనీయాంశం అవుతోంది.