iDreamPost
android-app
ios-app

కేసీఆర్ లో దుబ్బాక, జీహెచ్ఎంసీ తెచ్చిన మార్పు

  • Published Dec 03, 2020 | 12:03 PM Updated Updated Dec 03, 2020 | 12:03 PM
కేసీఆర్ లో దుబ్బాక, జీహెచ్ఎంసీ తెచ్చిన మార్పు

 కేసీఆర్ గుణపాఠం నేర్చుకున్నట్టే కనిపిస్తోంది. తొలుత దుబ్బాకలో ఎదురుదెబ్బ కారణంగా ఆయన తేరుకున్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో బహిరంగసభ నిర్వహించి ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. తాజాగా మరోసారి నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు అనివార్యం అయిన తరుణంలో ఇప్పటి నుంచే పావులు కదిపేందుకు సిద్దమవుతున్నారు. వ్యూహాలకు పదును పెడుతున్నారు. తన మార్క్ రాజకీయాలకు తెరలేపుతున్నారు. తమ సిట్టింగ్ సీటు మరోసారి చేజారిపోకుండా ఇప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

కేసీఆర్ సీఎం అయిన తర్వాత ప్రజలకు దూరంగా ఉండడం అలవాటుగా మార్చుకున్నారు. చివరకు సెక్రటేరియేట్ లో కూడా వేళ్ల మీద లెక్కబెట్టగలిగనన్ని సార్లు మాత్రమే ఆయన అడుగుపెట్టారు. ఎక్కువ సమయం ఫామ్ హౌస్ కే పరిమితమవుతూ వచ్చారు. ఆయన మీద ఫామ్ హౌస్ సీఎం అంటూ జాతీయ స్థాయి నేతలు సైతం విమర్శలు ఎక్కుపెట్టినా ఖాతరు చేయలేదు. కానీ తాజాగా తెలంగాణా ప్రజల్లో తన పట్టు జారుతూ, కమలం గట్టి పట్టు బిగించే ప్రయత్నాల్లో ఉన్న తరుణంలో ఆయన అప్రమత్తమయ్యారు. పరిస్థితిని చక్కదిద్ది, మళ్లీ తమ హవా కొనసాగించాలనే లక్ష్యానికి వచ్చారు

సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కేసీఆర్ తన ప్రస్థానంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. కష్టాల నుంచి కూడా కారు పార్టీని గట్టెక్కించి వరుసగా రెండు ఎన్నికల్లో విజయతీరాలకు చేర్చారు. అంతేగాకుండా ప్రత్యర్థులను కోలుకోకుండా దెబ్బకొట్టారు. కానీ ప్రస్తుతం బీజేపీ ఎదురుదాడి వ్యూహంతో కేసీఆర్ కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బండి సంజయ్, ధర్మపురి అరవింద్ వంటి నేటితరం కమలనాథులు గతానికి భిన్నంగా సాగుతున్నారు. బండారు దత్తాత్రేయ కిషన్ రెడ్డి, లక్ష్మణ్ వంటి వారు నడిపిన రాజకీయాలకు విభిన్న తరహాలో దూకుడు మంత్రం పటిస్తున్నారు. దాంతో కేసీఆర్ దానికి సమాధానం సిద్దం చేసుకోవాల్సి వస్తోంది.

వరుస అనుభవాలతో కేసీఆర్ తన రూటు మార్చి ప్రజల్లోకి వెళ్ళాలనే నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తోంది. తన పట్టు చేజారిపోకుండా చూసుకోవడానికి అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా నిజామాబాద్ పర్యటనకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు, వాస్తవానికి రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత జిల్లాల పర్యటనలు చాలా నామమాత్రం పూర్తిగా కేటీఆర్ మాత్రమే వివిధ జిల్లాలకు వెళ్లి వస్తున్నారు. కానీ ప్రస్తుతం కేసీఆర్ స్వయంగా రంగంలో దిగుతున్నారు. అందుకు అనుగుణంగానే నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య మృతదేహానికి స్వయంగా ఆయనే వెళ్లి నివాళులర్పించారు. త్వరలో ఉప ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ప్రత్యర్థులకు విమర్శించే అవకాశం ఇవ్వకూడదనే నిర్ణయానికి ఆయన వచ్చినట్టు ఈ పరిణామాలు చాటుతున్నాయి.

టీఆర్ఎస్ నేతల్లో కేసీఆర్ రాక ఉత్సాహాన్నిస్తుందనే చెప్పవచ్చు. కాంగ్రెస్ ని దాదాపుగా కుదేలు చేసేసిన నేపథ్యంలో కమల నాథుల మీద గురిపెట్టిన కారు పార్టీ అధినేత ప్రజాక్షేత్రంలో మరింత సమయం కేటాయించడానికి సిద్ధమవుతున్న వేళ ఈ పర్యటనలు ఆసక్తికరమే.