iDreamPost
android-app
ios-app

ఓర్వకల్లు విమానాశ్రయానికి స్వాతంత్ర సమరయోధుని పేరు పెట్టిన సీఎం జగన్

ఓర్వకల్లు విమానాశ్రయానికి స్వాతంత్ర సమరయోధుని పేరు పెట్టిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్‌లో ఆరవ, రాయలసీమలో మూడో విమానాశ్రయాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. కర్నూలు నగరానికి సమీపంలోని నిర్మించిన ఓర్వకల్లు విమానాశ్రయాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్‌ జగన్‌.. జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడారు. విమానాశ్రయం నిర్మాణానికి చేసిన కృషిని విమరించిన సీఎం జగన్‌.. ఎయిర్‌పోర్టుకు పేరును కూడా పెట్టారు.

స్థానికుడు, స్వాతంత్ర సమరయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ఘననివాళులు అర్పిస్తూ, ఆయన గౌరవార్థం ఓర్వకల్లు ఎయిర్‌ పోర్టుకు.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంగా నామకరణం చేస్తున్నట్లు ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టే ముందు.. ఆయన్ను సీఎం వైఎస్‌ జగన్‌ గుర్తు చేసుకున్నారు. గాంధీజీకి ముందు, స్వాతంత్రం రావడానికి దాదాపు వందేళ్ల క్రితం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటీషువారిపై తిరుగుబాటు చేశారని గుర్తు చేశారు. ప్రప్రథమ స్వాతంత్ర సమరంగా పిలుచుకునే 1857 సిపాయిల తిరుగుబాటు కన్నా ముందే.. 1847లో కర్నూలు గడ్డపై ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటీషువారిపై దండెత్తారని సీఎం వైఎస్‌ జగన్‌ కొనియాడారు. ఉయ్యాలవాడ నరిసింహారెడ్డికి నివాళులర్పిస్తూ.. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు ఆయన పేరు పెడుతున్నట్లు సీఎం వైఎస్‌ జగన్‌ వివరించారు.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయాన్ని రాష్ట్ర ప్రభుత్వం 153 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించింది. ఇందు కోసం 1008 ఎకరాల భూమిని సేకరించింది. తొలిదశలో బెంగుళూరు, చెన్నై, విశాఖపట్నం నగరాలకు విమానాలను నడుపుతున్నట్లు సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు.

Also Read : కర్నూలు విమానాశ్రయం నేడే ప్రారంభం