నేడు ప్రతిష్టాత్మక ‘జగనన్న విద్యా దీవెన’ పథకాన్ని ప్రారంభించనున్న సీఎం వైయస్ జగన్
‘నేను విన్నాను, నేను ఉన్నాను’ అంటూ పాదయాత్రలో ఇచ్చిన ప్రతీ హామీని వరుసపెట్టి నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ తాజాగా జగనన్న విద్యా దీవెనకు శ్రీకారం చుట్టారు. పాద యాత్రలో ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లింస్తుందని ప్రజలకు ఇచ్చిన హామీని నేటినుండి ముఖ్యమంత్రి జగన్ అమలుచేయనున్నారు.
జగనన్న విద్యా దీవెనలో భాగంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా కళాశాలలో చదివే విద్యార్థులకు మొత్తం ఫీజు రీయింబర్స్ లభించనుంది. గత టీడీపీ ప్రభుత్వం బకాయి పెట్టిపోయిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను చెల్లించడంతో పాటు, 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించిన నిధులనూ ప్రభుత్వం విడుదల చేసింది.
2018–19 విద్యా సంవత్సరానికి చెల్లించాల్సిన రూ.1,880 కోట్లను గత టీడీపీ ప్రభుత్వం చెల్లించలేదు. ఆ బకాయిలను వైయస్ జగన్ ప్రభుత్వం కాలేజీలకు విడుదల చేసింది. అలాగే, 2019–20 విద్యా సంవత్సరానికి చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కూడా విడుదల చేసింది. ఈ రెండేళ్లకు సంబంధించి ప్రభుత్వం మొత్తం రూ.4వేల కోట్లను జగన్ ప్రభుత్వం విడుదల చేసింది.
కాగా రానున్న విద్యా సంవత్సరం 2020–21లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కాలేజీలకు కాకుండా నేరుగా తల్లుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేయనుంది. దాదాపు 14 లక్షల మంది తల్లుల ఖాతాల్లో నాలుగు దఫాలుగా (నాలుగు త్రైమాసికాలకు)డబ్బు జమ చేయనున్నారు. తల్లిదండ్రులు కాలేజీలకు వెళ్లి ఫీజును చెల్లించాల్సి ఉంది.
2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లిదండ్రులు కాలేజీలకు ఇప్పటికే ఫీజులు చెల్లించి ఉంటే, ఏప్రిల్ నెలాఖరులోగా తిరిగి చెల్లించిన ఫీజులను రాబట్టుకోవడానికి కాలేజీ యాజమాన్యాలను సంప్రదించాలని విద్యాశాఖ సూచించింది. 2018–19, 2019–20లో రూ.35 వేలు ఫీజు ఉన్న కాలేజీలకు ఇప్పటికే ఏమైనా ఫీజులు తల్లిదండ్రులు కట్టి ఉంటే ఆ సొమ్మును కూడా తిరిగి రాబట్టుకోవాలని విద్యాశాఖ వెల్లడించింది.