ఇచ్చిన మాట కోసం సాహసోపేత నిర్ణయాలు .. జగన్‌ లక్ష్యం అదే..!

అవినీతి రహిత పాలన అందిస్తానని ఎన్నికల ప్రచార సభల్లో అశేషజనవాహని సాక్షిగా ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో వచ్చే అడ్డంకులను దాటుకుంటూ అవినీతి రహిత పాలన దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రజలకు ప్రత్యక్ష సంబంధాలు ఉండే ప్రభుత్వ విభాగాల్లో అవినీతి అధికంగా ఉంటుందని అందరికీ తెలిసిందే. రెవెన్యూ, మున్సిపల్, సబ్‌రిజిస్ట్రార్, పోలీసుల శాఖతోపాటు.. అభివృద్ధి పనులు సాగించే పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్‌అండ్‌బీ విభాగాల్లోనూ ప్రభుత్వ పనుల్లో పర్సెంటేజ్‌లు షరామామూలుగా సాగిపోతున్నాయి. వీటిని కట్టడి చేసేందుకు సీఎం జగన్‌ వరుసగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

రెవెన్యూలో అవినీతికి అడ్డుకట్ట ఇలా…

రెవెన్యూ శాఖలో అవినీతిని అరికట్టేందుకు గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశారు. ఫలితంగా వీఆర్‌వోలు గ్రామాలకు వెళ్లి పని చేస్తున్నారు. స్థాన బలం కారణంగా ప్రజలు తమ సమస్యలు, పనులపై వీఆర్‌వోలను గట్టిగా నిలదీసి చేయించుకుంటున్నారు. అదే సమయంలో వారిని లంచాలు అడిగేందుకు వీఆర్‌వోలు సాహసం చేయలేకపోతున్నారు. తహసీల్దార్ల నుంచి ఒత్తిడి వస్తున్నా.. ఎక్కడ లంచాలు అడిగితే/తీసుకుంటే.. స్థానికుల ఆగ్రహం బహిరంగంగా చవిచూడాల్సి వస్తుందోనని వీఆర్‌వోలు మన్నుతిన్న పాముల్లా పని చేస్తున్నారు.

మున్సిపల్‌ శాఖకు మూకుతాడు ఇలా..

మున్సిపల్‌ శాఖలో అవినీతికి వార్డు సచివాలయాలు అడ్డుకట్ట వేశాయి. టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ, పబ్లిక్‌ హెల్త్‌.. ఇలా మున్సిపల్‌లో ఏ విభాగంలో చూసుకున్నా లంచం లేనిదే పని జరిగేది కాదు. ప్రస్తుతం ప్రతి నాలుగు వేల మందికి ఒక వార్డు సచివాలయం ఏర్పాటు చేయడంతో ప్రజలకు తమ ప్రాంతంలోనే ప్రభుత్వ సేవలు అందుతున్నాయి. నూతన సిబ్బంది కావడంతో అవినీతి రహితంగా ప్రజలకు ప్రభుత్వ సేవలు అందిస్తున్నారు. మున్సిపల్, కార్పొరేషన్‌ కార్యాలయాలకు, ప్రజలకు మధ్య లింక్‌ కట్‌ కావడంతో అవినీతిక ఆస్కారం లేకుండా పోయింది. లంచాలకు అలవాటుపడిన మున్సిపల్‌ చేపలు ప్రస్తుతం ఇబ్బంది పడుతున్నా.. రోజులు గడిచే కొద్దీ నిజాయతీగా పని చేసేందుకు అలవాటు పడతాయనడంలో సందేహం లేదు.

రిజిస్ట్రేషన్‌ శాఖలో చెక్‌ పెట్టారిలా..

ఆస్తుల క్రయ విక్రయాలకు సంబంధించి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఎప్పటి నుంచో అవినీతి వ్యవస్థీకృతమైంది. ప్రభుత్వానికి కట్టే పన్నుతో కలిపి కార్యాలయాలనికి కట్టే లంచం కూడా కలిపి డాక్యుమెంట్‌ రైటర్లు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వానికి కట్టే స్టాప్‌ డ్యూటీ 7.5 శాతం అయితే.. 8.5 శాతం వసూలు చేస్తున్నారు. ఈ శాఖపై దృష్టిపెట్టిన జగన్‌.. ముఖ్యమైన కార్యాలయాల్లో యంగ్‌ ఆఫీషర్లను నియమించారు. అంతేకాదు.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్యాలయాల్లో అవినీతిని నిర్మూలించేందుకు రిజిస్ట్రేషన్లు.. గ్రామ సచివాలయాల్లోనే చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అమలు చేయడమే ఇక మిగిలింది.

ఖద్దర్‌ అవినీతికి అడ్డుకట్టతో ఖాకీల అవినీతికి ఫుల్‌స్టాఫ్‌

పోలీస్‌ శాఖలో నూతన ఐపీఎస్‌ అధికారులను, మంచి ట్రాక్‌ రికార్డు ఉన్న సీనియర్లను ఎస్పీలుగా నియమించారు. బదిలీలు, ఎస్‌ఐ, సీఐ పోస్టింగుల్లో రాజకీయ అవినీతికి అడ్డుకట్టే వేశారు. గతంలో సీఐ పోస్టు కావాలంటే స్థానిక ఎమ్మెల్యే సిఫార్సు తప్పనిసరి. ఆ లెటర్‌ పట్టుకుని వెళితే తప్పా ఐజీ..పోస్టింగ్‌ ఇచ్చేవారు కాదంటే అతిశయోక్తికాదు. అ సమయంలో పై అధికారులకు ఎంతో కొంత ముట్టజెప్పాల్సిందే. ఖద్దర్‌కు, ఉన్నతాధికారులకు ఇచ్చిన సొమ్ములను వడ్డీతో సహా మళ్లీ బదిలీ జరిగే రెండేళ్లలో వడ్దీతో సహా స్టేషన్‌ పరిధిలో వసూలు చేసేవారు. దీని కోసం ఎస్‌ఐలకు టార్గెట్‌లు విధించేవారు. ప్రతి కేసులో సెటిల్‌మెంట్, అనధికారిక పనులు, అసాంఘిక కార్యక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచేవారు. అయితే జగన్‌ వచ్చిన మొదటి ఏడాదిలోనే బదిలీల్లో అవినీతికి చెక్‌పెట్టారు. ఫలితంగా క్షేత్రస్థాయిలో అధికారులు నిజాయతీగా పని చేస్తున్నారు.

పంచాయతీ రాజ్‌లో ఎం బుక్‌తో చెక్‌ పెట్టారిలా..

తాజాగా సీఎం జగన్‌ మరో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. గ్రామాల్లో జరిగే ప్రతి అభివృద్ధి పని పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలో జరుగుతుంది. అభివృద్ధి పనుల్లో పర్సంటేజీలు నిత్యకృత్యం. ప్రస్తుతం కూడా పనుల్లో పర్సంటేజీల వ్యవహారం యథేచ్ఛగా సాగిపోతోంది. రాష్ట్రంలో ప్రాంతాలను బట్టీ ఒక్కొక్క చోట ఒక్కోలా ఈ పర్సంటేజీలు ఉన్నాయి. పని మొత్తంలో కనీష్టంగా 12 శాతం గరీష్టంగా 20 శాతం అధికారులకు కాంట్రాక్టర్లు లేదా ఆ పని చేసిన గ్రామ స్థాయి నేతలు.. ముడుపులు చెల్లించుకోవాల్సిందే. లేదంటే బిల్లులు నెలలతరబడి జాప్యం అవుతాయి. వర్క్‌ ఇన్స్‌పెక్టర్‌ నుంచి ఏఈ, డీఈ, ఈఈ, ఎస్‌ఈ, సీఈ వరకూ.. వాటాలు పంచుకుంటారు. క్యాడర్‌ పరిధి పెరుగుతుంది కాబట్టి.. పర్సంటేజ్‌ తగ్గుతూ పోతుంది. ఏఈకి అధికంగా దక్కుతుంది. ఫలితంగా అభివృద్ధి పనులలో నాణ్యత నేతిబీరకాయ చందంలా తయారైంది. రోడ్డు వేసిన ఏడాదికై మళ్లీ పాడవడం నిత్యం చూస్తూనే ఉన్నాం.

పంచాయతీ రాజ్‌లో వ్యవస్థీకృతమైన ఈ అవినీతిని రూపుమాపేందుకు గ్రామ సచివాలయాల్లోని ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లకు ఎం బుక్‌ నిర్వహణను ప్రభుత్వం అప్పజెప్పింది. ఇకపై పనుల పర్యవేక్షణ, నమోదు అంతా సచివాలయ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు చేయనున్నారు. ఇప్పటి వరకూ పంచాయతీరాజ్‌తోపాటు ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్ల్యూఎస్‌ తదితర అన్ని విభాగాల్లో ఎం బుక్‌.. అధికారులకు అక్షయపాత్రగా ఉపయోగపడింది. ఇప్పుడు ఆ ఎం బుక్‌ను తీసి సచివాలయ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌కు ఇవ్వడంతో ఏఈ ఆ పై అధికారులు గిలగిలలాడిపోతున్నారు. ఎం బుక్‌ తమకు చట్ట ప్రకారం వచ్చిందని, దాన్ని సచివాలయ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌కు ఇవ్వడం సరికాదంటూ పంచాయతీరాజ్‌ ఉద్యోగులు వాపోతున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సంఘాల్లో తీర్మానాలు చేస్తున్నారు. అయినా లెక్కచేయని వైసీపీ ప్రభుత్వం అవినీతి నిర్మూలనలో ముందుకు సాగుతోంది.

త్వరలో ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్ల్యూఎస్‌ తదితర విభాగాల్లోనూ సంస్కరణలు వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సీఎం జగన్‌ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల మరికొద్దేళ్లలో పూర్తి స్థాయిలో అవినీతి లేని పాలన, అభివృద్ధి ప్రజలు చూడడం ఖాయంగా కనిపిస్తోంది.

Show comments