iDreamPost
android-app
ios-app

కేంద్రంతో కుస్తీ. సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు

  • Published Jul 27, 2022 | 7:36 PM Updated Updated Jul 27, 2022 | 7:37 PM
కేంద్రంతో కుస్తీ. సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు

ముంపు బాధితులకు అండగా ఉంటామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసానిచ్చారు. ఏలూరు జిల్లా తిరుమలాపురం, నార్లవరం వరద బాధితులను ఆయన బుధవారం పరామర్శించారు. బాధితుల‌తో మాట్లాడారు. స‌హాయ కార్య‌క్ర‌మాలు ఎలా జ‌రుగుతున్నాయో తెలుసుకున్నారు. వరద బాధిత ప్రాంతాల్లో అధికారులు బాగా పనిచేశారని ప్రశంసించారు. వరద బాధితులందరికీ రేషన్‌ సరుకులు, కుటుంబానికి రూ.2 వేల సాయం వెంటనే అధికారులు పంపిణీ చేశారు. దీనికి కూడా వారిని అభినందిస్తున్నా. గోదావరి మొదటి ప్రమాద హెచ్చరికను ఉపంసంహరించిన నేపథ్యంలో ఇప్పుడు ఎన్యూమరేషన్‌ ప్రారంభిస్తామ‌ని చెప్పారు.

ఇళ్లు కోల్పోయిన వారికి రూ.10వేల ఆర్థిక సాయం ఇవ్వాలని ఆదేశించామని సీఎం తెలిపారు. వరదలతో నష్టపోయిన ప్రతిఒక్కరినీ ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు. ఏ సీజన్‌లో నష్టం జరిగితే అదే సీజన్‌లో సాయం అందిస్తామన్నారు. సాధ్యమైనంత త్వరగా ముంపు బాధితులకు పరిహారం అందిస్తామని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

‘‘పున‌రావాస ప్యాకేజీ కోసం కేంద్రంతో కుస్తీ పడుతున్నాం. ఈ ప్యాకేజీకి రూ.20 వేల కోట్లు కావాలి. కేంద్రంతో యుద్ధం చేస్తూనే ఉన్నాం. కేంద్రం తప్పనిసరిగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. తక్కువ మొత్తం అయితే, కేంద్రం ఇవ్వకున్నా, మేం ఇచ్చేవాళ్లం. కాని, రూ.20 వేల కోట్లు అంటే, ఏమీ చేయలేకపోతున్నాం. ప్రధానిని ఇప్పటివరకు మూడుసార్లు కలిశా. కేంద్ర మంత్రులను మన మంత్రులు కలుస్తూనే ఉన్నారు. అయినా, కేంద్రం నుంచి అనుకున్న స్థాయిలో కదలిక లేదు. ప్రధాని మోదీని కలిసి వరద న‌ష్టం ఏ స్థాయిలో ఉందో వివ‌రంగా చెబుతా. వీలైనంత త్వరగా, ఆర్థిక సాయం అందించాలని ప్రధానిని కోరతామని’’ సీఎం జగన్‌ అన్నారు

పోలవరం ప్రాజెక్టు పూర్తయినా మనం పూర్తిగా నీళ్లు నింపం. డ్యామ్‌ భద్రతను దృష్టిలో పెట్టుకుని ఒకేసారి నీళ్లు నింపకూడదని, కేంద్ర జలవనరుల సంఘం చెబుతోంది. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత తొలి సంవత్సరం కొంత నీటిని నింపుతాం, అలా దఫాలుగా మూడేళ్లలో డ్యామ్‌ను నింపుతాం.

రిజర్వాయరును పూర్తిగా నీటితో నింపే నాటికి, ఏ ఒక్కరికీ నష్టం జరగకుండా, ప్రతి ఒక్కరికీ మంచి జరిగేలా చూస్తాం. ఆలోపు కేంద్రం నుంచి డబ్బులు వచ్చేలా ఒత్తిడి తీసుకువస్తాం. కేంద్రం నుంచి ఆ స్థాయిలో డబ్బులు రాకపోతే .. రిజర్వాయరులో నీటిని నింపడం అయినా అపుతాము లేదా మీకు పరిహారం చెల్లించిన తర్వాతే నీటి పూర్తిగా నింపే కార్యక్రమం చేస్తాం. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయినా పరిహారం చెల్లించే కార్యక్రమం చేస్తామ‌ని సీఎం భ‌రోసానిచ్చారు.