iDreamPost
android-app
ios-app

అయ్యప్ప మాల ధరించిన చర్చ్ ఫాదర్! శబరిమల దర్శనం కోసం కష్టాలు!

అయ్యప్ప మాల ధరించిన చర్చ్ ఫాదర్! శబరిమల దర్శనం కోసం కష్టాలు!

కేరళ అనగానే కొబ్బరి చెట్లు, అందమైన అమ్మాయిలే కాదూ ప్రకృతిలో ఎంతో రమణీయత ఉంటుంది. ఏపుగా ఎదిగిన చెట్లు, చెరువులు, సరస్సులు, అందమైన సముద్ర తీర ప్రాంతంతో పర్యాటకులను అలరిస్తూ ఉంటుంది. ‘ దైవ భూమి’గా పేరు గాంచిన కేరళలో ఆధ్యాత్మికత కూడా ఎక్కువే. శబరిమల అయ్యప్పస్వామి దేవాలయం కొలువై ఉన్నది ఈ రాష్ట్రంలోనే. ప్రతి ఏటా అనేక మంది భక్తులు.. అయ్యప్ప దీక్ష చేపట్టి.. స్వామి మాలలు ధరించి.. ఈ గుడిని దర్శిస్తుంటారు. సంక్రాంతి సమయంలో జ్యోతిని చూసేందుకు లక్షలాది మంది తరలివస్తుంటారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చర్చిలు కూడా అధిక సంఖ్యలో ఉంటాయి. ఇక్కడ ప్రజలు సర్వమత సమ్మేళనంతో బతుకుతుంటారు. అయితే ఇప్పుడు ఓ చర్చి ఫాదర్ అనూహ్య నిర్ణయం తీసుకుని వార్తల్లో నిలిచారు. ఇంతకు అదేంటంటే.. అయ్యప్ప మాలను ధరించడమే కాకుండా.. గుడిని దర్శించుకునేందుకు.. చర్చి ఫాదర్ పదవిని వదులుకున్నారు.

కేరళలోని తిరువనంతపురంలోని ఆంగ్లీకన్ చర్చి ఆఫ్ ఇండియాకు ఫాదర్‌గా వ్యవహరిస్తున్నారు కేజీ మనోజ్. రెవరండమ్‌గా మారడానికి ముందు ఆయన సాఫ్ట్ వేర్ ఉద్యోగి. అయితే క్రైస్తవ మతంపై మక్కువతో ఫాదర్‌గా మారారు. క్రీస్తు బోధనలు చేసేవారు. అయితే ఇదే క్రమంలో ఆయనకు అయ్యప్పపై నమ్మకం ఏర్పడింది. ఒక్కసారైనా శబరిమల వెళ్లి అయ్యప్పస్వామిని దర్శించుకోవాలన్న కోరిక ఉంది. దీంతో 41 రోజుల దీక్ష చేపట్టారు. మండల దీక్ష తీసుకోవడంతో.. వివాదాస్పదమైంది. అయితే ఇది సరైన పద్ధతి కాదని చర్చి పెద్దలు, క్రైస్తవ నిబంధనలకు ఇది విరుద్దమని పేర్కొంటూ అతడిని వివరణ కోరాయి. అయితే దీనికి సమాధానంగా అతడు ఫాదర్ పదవినే వద్దు అనుకున్నాడు. తన ఐడీ కార్ట్, మతాధికారిగా ఇచ్చిన లైసెన్సును తిరిగి ఇచ్చేశారు. చర్చి సేవల నుండి తప్పుకుంటున్నట్లు చెప్పకనే చెప్పేశారు.

అయితే తనపై వస్తున్న విమర్శలపై ఫేస్ బుక్ వీడియో ద్వారా స్పందించారు మనోజ్. తాను మత సిద్ధాంతాల కంటే దేవుడే అన్న భావనకే అధిక ప్రాధాన్యతనిస్తానని తెలిపారు. మతాచారాలకు అతీతమైన హిందూయిజంపై అవగాహన పెంపొందించుకోవడమే తన ఉద్దేశమని తెలిపారు. కుల, మతాలకు అతీతంగా అందర్నీ ప్రేమించమని దేవుడు చెబుతున్నారని, ఇతరులను ప్రేమించడం అనేది వారు చేసే పనులను బట్టి ఉంటుందని అన్నారు. కాబట్టి చర్చి సిద్ధాంతాన్ని అనుసరించాలనుకుంటున్నారా? లేదా దేవుని సిద్ధాంతాన్ని అనుసరించాలనుకుంటున్నారా? అనేది పూర్తిగా మీ నిర్ణయమనేది పేర్కొన్నారు. ప్రస్తుతం మండల దీక్షలో ఉన్న ఆయన ఈ 20న తన చిరకాల కోరికను తీర్చుకోబోతున్నారు. శబరిమల పుణ్యక్షేత్రాన్ని సందర్శించబోతున్నారు.