iDreamPost
android-app
ios-app

వజ్రం కోసం చోర్ బజార్ వేట

  • Published Jun 09, 2022 | 4:12 PM Updated Updated Jun 09, 2022 | 4:12 PM
వజ్రం కోసం చోర్ బజార్ వేట

దర్శకుడిగా పూరి జగన్నాధ్ కు ఎంత గొప్ప పేరున్నా వారసుడు ఆకాష్ పూరి మాత్రం ఇంకా హీరోగా నిలదొక్కుకోవడానికి పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఆ మధ్య రొమాంటిక్ ని గట్టిగానే హడావిడి చేశారు కానీ ఫైనల్ గా ఫ్లాప్ ముద్రతోనే బయటపడింది. అంతకు ముందు తండ్రే స్వయంగా డైరెక్ట్ చేసిన మెహబూబా మరీ దారుణంగా డిజాస్టర్ కావడం ఫ్యాన్స్ మర్చిపోలేరు. ఈ నేపథ్యంలో వస్తున్న మరో కొత్త మూవీ చోర్ బజార్. జార్జ్ రెడ్డితో పేరు తెచ్చుకున్న జీవన్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ క్రైమ్ డ్రామా షూటింగ్ ఎప్పుడో పూర్తయినప్పటికీ కరోనా వల్ల వాయిదా పర్వంలో పడింది. ఇందాకే బాల‌య్య‌ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

హైదరాబాద్ పాతబస్తీ ఛార్మినార్ దగ్గరుండే బచ్చన్ సాబ్(ఆకాష్ పూరి)మెకానిక్ పనితో అన్ని రకాల వ్యవహారాలు చక్కబెడుతూ ఉంటాడు. ప్రేమించిన మూగమ్మాయి(గెహెనా సిప్పి)కోసం ఎలాగైనా సరే గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించాలని ట్రై చేస్తుంటాడు. ఇదిలా ఉండగా కోట్ల రూపాయలు విలువ చేసే ఖరీదైన వజ్రం ఒకటి స్టేట్ మ్యూజియం నుంచి మాయమవుతుంది. దాని కోసం రాష్ట్ర మంత్రితో మొదలుపెట్టి లోకల్ డాన్ ల దాకా అందరూ వెతుకుతూ ఉంటారు. అది చోర్ బజార్ గ్యాంగ్ దగ్గరకు వచ్చి పడుతుంది. దీంతో బచ్చన్ సాబ్ రంగంలోకి దిగుతాడు. తవ్వే కొద్దీ కొత్త నిజాలు బయట పడతాయి.ఆ తర్వాత జరిగేది థియేటర్లలోనే చూడాలి.

ట్రైలర్ ఆసక్తికరంగానే ఉంది. కాకపోతే ఆకాష్ పూరి వయసుకు మించి బిల్డప్ షాట్స్ డైలాగులు ఎందుకు పెడుతున్నారో అర్థం కాదు. గొంతులో బేస్ ఉన్నప్పటికీ ఏజ్ తాలూకు లేతదనం ఇంకా మొహంలో ఉంది. మాస్ హీరోగా సెటిలవ్వడానికి తొందరపడితే ఎలా. హీరోయిన్ గెహెనా మరీ గొప్పగా అనిపించలేదు. సునీల్, సంపూర్ణేష్ బాబు, సునీల్, సుబ్బరాజు క్యాస్టింగ్ ని గట్టిగానే సెట్ చేసుకున్నారు. సురేష్ బొబ్బిలి పాటలు సమకూర్చగా ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్ నేపధ్య సంగీతం, జగదీశ్ చీకటి ఛాయాగ్రహణం అందించారు. బడ్జెట్ బాగానే ఖర్చు పెట్టినట్టు కనిపిస్తోంది. కమింగ్ సూన్ అన్నారు తప్ప విడుదల తేదీ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు.