iDreamPost
android-app
ios-app

‘‘చిత్రపురి’’లో ఆరోపణల వేడి..!

‘‘చిత్రపురి’’లో ఆరోపణల వేడి..!

చిత్ర పరిశ్రమలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. చిత్ర పరిశ్రమ కార్మికుల కోసం ఏర్పాటైన చిత్రపురి కాలనీ సొసైటీ ఎన్నికల వేళ ఘాటు విమర్శలు, కోట్లాది రూపాయల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల్లో ఢీ కొంటున్న రెండు ప్యానళ్ల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయం వేడెక్కింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. డిసెంబర్‌ 10న జరుగుతున్న సోసైటీ ఎన్నికల్లో గెలిచేందుకు రెండు వర్గాల ప్యానళ్ల సభ్యులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఎన్నికలకు ఒక్కరోజు సమయం మాత్రమే మిగిలి ఉండటంతో సోసైటీ సభ్యులను ఆకర్షించేలా ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పటికే రెండు ప్యానళ్లు పోటాపోటీగా మేనిఫెస్టోలు విడుదల చేయడంతో పాటు తమకు అనుకూలంగా ఉన్న సీనియర్‌ నటులు, డైరెక్టర్ల మద్దతుకోరుతూ ప్రచారం సాగిస్తున్నారు. లక్షల్లో ఖర్చుచేసి సొసైటీ ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్థులు పోటీపడుతున్నారనే ప్రచారం జరుగుతోంది.

రూ.300 కోట్ల స్కాం..

సినీ కార్మికుల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం కేటాయించిన 67 ఏకరాల స్థలంలో ఏర్పాటు చేసిన చిత్రపురికాలనీలో కొంతమంది సభ్యులు కార్మికులకు అన్యాయం చేసి రూ.300 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని సీనియర్‌ నటుడు ఓ. కళ్యాణ్‌ ఆరోపించారు. బంజారాహిల్స్‌లో మంగళవారం కళ్యాణ్‌ తన ప్యానల్‌ సభ్యులతో విలేకరుల సమావేశం నిర్వహించారు. కళ్యాణ్‌ మాట్లాడుతూ ప్రభుత్వం సినీ పరిశ్రమకు కేటాయించిన 65 ఎకరాల్లో గత ఇరువైఏళ్లుగా అవినీతి జరుగుతుందని ఆరోపించారు. 20 ఏళ్లుగా చిత్రపురి హౌసింగ్‌లో సినీ కార్మికుల సొమ్ము కమిటీలోని 11 మంది సభ్యులు దోచుకుంటున్నారని విమర్శించారు. చిత్రపురికాలనీకి చెందిన 25 ఎకరాల పోలం తాకట్టు పెట్టి స్టేట్‌బ్యాంక్‌ నుంచి రూ.35 కోట్లు లోన్‌ తీసుకున్నారని, అది చెల్లించకపోవడంతో ఆ స్థలం యాక్షన్‌కు వెళ్లిపోయిందన్నారు. కార్యక్రమంలో మన్యవాసి వై.వి శ్రీనివాస కూనపరెడ్డి, పసునూరి శ్రీనివాసులు, కస్తూరి శ్రీనివాస్‌, ఈశ్వర వరప్రసాద్‌ మీసాల, అనిల్‌కుమార్‌ కాపూరి, ఆత్మకూరు అనురాధ, మల్లిక, మధు జాతోట్‌లు పాల్గొన్నారు.

దొంగలను తరిమేస్తాం…

‘దొంగలను తరిమేసేందుకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. ఎవరయితే అక్రమాలకు పాల్పడ్డారో వారికి జైలుశిక్ష తప్పదు. అవినీతిపై పోరాటం ఆగదు’. కష్టంలో ఉన్న సినీ కార్మికులకు ఎప్పుడు అడ్డంగా ఉంటాం’ అని సి.కళ్యాణ్‌ అంటున్నారు. సొసైటీ సభ్యుల డబ్బులను తిరిగి ఎన్నికల్లో గెలిచేందుకు తిరిగి వారికే పంచుతున్నారని వారిని తీసుకొని సమర్థులకే ఓటు వేయాలన్నారు. దొంగ ఓట్లు వేయాలనుకునే వారిపై మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కొంతమంతి చేస్తున్న అనవసర ఆరోపణలపై స్పందించాల్సిర అవసరం లేదని భరద్వాజ్‌ అంటున్నారు. ఆరోపణలు చేస్తున్న వారిని అక్రమాలకు పాల్పడుతున్నారని ఫెడరేషన్‌ 10-12 ఏళ్ల క్రితమే సస్పెండ్‌ చేసిందని ప్రత్యారోపణలు చేస్తున్నారు. కమిటీలో నేను సభ్యుడిగా లేనప్పుడు ఆరోపణలు ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇలా సొసైటీ ఎన్నికల వేళ చిత్రపురి కాలనీలో ఆరోపణల సెగ పెరుగుతోంది.