iDreamPost
android-app
ios-app

మీ నాయకుడునే పంపుతారు…! లేదు.. మీ నాయకుడే వెళతాడు..!!

మీ నాయకుడునే పంపుతారు…! లేదు.. మీ నాయకుడే వెళతాడు..!!

ఒకరు ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన నేత.. మరొకరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పార్టీలో చేరిన నేత.. వారిద్దరి మధ్య ఆధిపత్య పోరుతో ఆ నియోజకవర్గంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి విభేదాలు నెలకొన్నాయి. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం ఈ ఆధిపత్య రాజకీయానికి వేదికగా నిలిచింది.

చీరాలలో అధికార వైసీపీలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరామకృష్ణమూర్తి మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. కరణం బలరాం తన కుమారుడు వెంకటేష్‌తో కలసి పార్టీలో చేరిన తర్వాత చీరాల నియోజకవర్గ రాజకీయం రసవత్తరంగా మారింది. శనివారం కరణం బలరాం జన్మదిన వేడుకల సందర్భంగా వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో కరణం వర్గంలోని ఓ వ్యక్తి గాయపడడం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.

కరణం బలరాం కుమారుడు వెంకటేష్‌ను పార్టీలోకి చేర్చుకునే సమయంలోనే చీరాల నుంచి ఆమంచి లేదా కరణం వెంకటేష్‌లలో ఒకరిని పక్కనే ఉన్న పర్చూరు నియోజకవర్గానికి పంపుతారనే చర్చ సాగింది. ఈ చర్చకు కొనసాగింపుగా కరణం, ఆమంచి వర్గాలు ఎవరి ప్రచారం వారు చేసుకుంటున్నారు. ఆమంచి కృష్ణమహన్‌ను పర్చూరుకు పంపుతారని కరణం బలరాం వర్గీయులు, కరణం వెంకటేషే పర్చూరుకు వెళతారని ఆమంచి వర్గీయులు ప్రచారం చేసుకుంటున్నారు. ఇరువురు నేతలు చీరాలపైనే మక్కువ చూపుతున్నారు.

ప్రకాశం జిల్లాలో సీనియర్‌ నేత అయిన కరణం బలరాం కృష్ణమూర్తి దశాబ్ధం తర్వాత మళ్లీ అధికారం దక్కింది. 2004లో చివరి సారిగా అద్దంకి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కరణం.. ఆ తర్వాత 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్‌ చేతిలో ఓటమిపాలయ్యారు. 2014లో తాను తప్పుకుని తన కుమారుడు కరణం వెంకటేష్‌ను బరిలోకి దింపారు. ఈ సారి కూడా కరణంకు అదృష్టం కలిసి రాలేదు. వైసీపీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్‌ చేతిలో కరణం వెంకటేష్‌ ఓటమి చవిచూశారు. 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో.. వైసీపీ ఎమ్మెల్యే అయిన రవి కుమార్‌ టీడీపీలోకి ఫిరాయించారు. అప్పటి నుంచి అద్దంకిలో గొట్టిపాటి, కరణం మధ్య ఆధిపత్య పోరు నడిచింది.

2019లో టీడీపీలో సీట్ల సర్దుబాటులో భాగంగా కరణం చీరాలకు వెళ్లారు. ఈ సారి తానే పోటీ చేశారు. 2009లో కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్‌.. 2014లో నవోదయం పార్టీ తరఫున వైసీపీ, టీడీపీ అభ్యర్థులను మట్టికరిపించారు. దీంతో వైసీపీ ఆమంచిని 2019 ఎన్నికల్లో తన అభ్యర్థిగా బరిలోకి దింపింది. అయితే కరణం చేతిలో ఆమంచి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత కరణం కూడా వైసీపీలో చేరడంతో చీరాలలో ఆధిపత్యపోరు మొదలైంది.

కరణం, ఆమంచిలలో ఎవరు పర్చూరుకు వెళతారనే ప్రశ్నకు ఇప్పుడు జవాబు కనిపెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ప్రశ్నకు సమాధానం లభిస్తే.. చీరాలలో ఉద్రిక్త పరిస్థితులకు చెక్‌పడుతుంది. సొంత నియోజకవర్గం అయిన చీరాలను వదిలితే రాజకీయ భవిష్యత్‌ ఉండదనే భావనలో ఆమంచి ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో పదేళ్ల తర్వాత మళ్లీ అధికారం ఇచ్చిన చీరాలను వదిలి పర్చూరుకు వెళితే.. పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన కరణం వర్గంలో ఉంది. 2024 ఎన్నికల్లో కరణం బలరాం తన కుమారుడును ఖచ్చితంగా అసెంబ్లీకి పంపాలనే లక్ష్యంతో ఉన్నారు. ఎన్నికల సమయానికి చీరాలలో బలమైన పునాదులు వేయాలని బలరాం యోచిస్తున్నట్లు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య జరుగుతున్న చీరాల రాజకీయానికి ఎప్పుడు ఎండ్‌ కార్డు పడుతుందో వేచి చూడాలి.