భారత్ లోకి 35 కిలోమీటర్లు చొచ్చుకొచ్చేసిన చైనా.. ఆక్రమణేనా ?

సరిహద్దుల ప్రాంతంలో రోజు రోజుకు ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. ఉద్దేశ్యపూర్వకంగానే చైనా సైనిక చర్యకు దిగుతోందని అందరికీ అర్ధమైపోతోంది. తాజగా జమ్మూ-కాశ్మీర్ లోయ లడ్డాఖ్ లోని గాల్వాన్, పాంగాంగ్, డెమ్ చోక్ ప్రాంతాల్లో 35 కిలోమీటర్ల భారత్ భూభాగంలోకి చొచ్చుకుని వచ్చేసింది. పై ప్రాంతంలో సుమారు 10 వేల డ్రాగన్ సైనికులు తిష్టవేశారు. దాంతో 35 కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనా ఆక్రమించేసిందా అనే టెన్షన్ మొదలైంది.

ఏప్రిల్ మూడో వారం నుండి పై ప్రాంతాల్లోని అన్నీ వైపుల నుండి భారత్ భూభాగంలోకి చైనా సైనికులు చొచ్చుకుని వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే మన భూభాగంలోకి డ్రాగన్ సైనికులు వచ్చేస్తున్నారో వీళ్ళని అడ్డుకునేందుకు భారత్ సైనికులు కూడా వీళ్ళకి ఎదురు నిలబడాల్సొస్తోంది. రెండు వైపుల సైనికులు ఎదురెదురు పడటంతో ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. 1962 తర్వాత చైనా సైనికులు భారత్ భూభాగంలోకి చొచ్చుకురావటం ఇదే మొదటిసారి.

వివాదంలో లేని భారత్ భూభాగంలోకి చైనా సైనికులు చొచ్చుకురావటం ఇదే మొదటిసారిగా మిలిటరీ ఉన్నతాధికారులు స్పష్టంగా చెప్పారు. తాజా చొరబాట్ల వెనుక డ్రాగన్ దేశానికి పెద్ద వ్యూహమే ఉంటుందనటంలో సందేహం లేదని కూడా మిలిటరీ ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. ఏప్రిల్ నెల నుండి చైనా సైనికులు రోజుకు కొన్ని మీటర్ల చొప్పున భారత్ లోకి చొచ్చుకుని వచ్చేస్తున్నారు. డ్రాగన్ సైన్యం ముందుకు వచ్చేకొద్దీ భారత్ సైనికులు వెనక్కు తగ్గాల్సొస్తోందని ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జమ్మూ-కాశ్మీర్ కు కేంద్రప్రభుత్వం స్వయంప్రతిపత్తి ఎత్తేసిన దగ్గర నుండి లోయ మొత్తం మీద సమస్య పెరిగిపోయింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతమంతా భారత్ దే అంటూ హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటన చేసిన దగ్గర నుండి పాకిస్ధాన్ లో ఆందోళన మొదలైంది. పాక్ ఆక్రమిత ప్రాంతాన్ని భారత్ ఎక్కడ తిరిగి స్వాధీనం చేసుకుంటోందో అన్న టెన్షన్ తోనే తనకు మద్దతుగా పాకిస్ధాన్ డ్రాగన్ దేశాన్ని రంగంలోకి దింపింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను గనుక భారత్ తిరిగి స్వాధీనం చేసుకుంటే చైనాకు కూడా ఇబ్బందే. అందుకనే ముందు జాగ్రత్తగా పాకిస్ధాన్ కు బదులు చైనానే సైనికులను రంగంలోకి దింపిందని మిలిటరీ భావిస్తోంది.

జమ్మూ-కాశ్మీర్ ప్రాంతంలో పాకిస్ధాన్ ఆక్రమించుకున్న భూభాంలో సుమారు 5180 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనాకు దారాదత్తం చేసింది. అలాగే చైనా-భారత్ మధ్య జరిగిన యుద్ధంలో డ్రాగన్ దేశం 38 వేల కిలోమీటర్ల ప్రాంతాన్ని ఆక్రమించేసింది. ఈ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతం నుండే చైనా 60 వేల కోట్ల డాలర్ల ఖర్చుతో చైనా-పాక్ ఆర్ధిక క్యారిడార్ ను నిర్మిస్తోంది. ఈ క్యారిడార్ నిర్మాణమన్నది ఆర్దికంగా బలోపేతం అయ్యేందుకు చైనాకు చాలా చాలా అవసరం. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను గనుక భారత్ తిరిగి స్వాధీనం చేసుకుంటే చైనా పెద్ద దెబ్బనే చెప్పాలి. అందుకనే భారత్ ను పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో ముందడుగు వేయకుండనే అడ్డుకునేందుకే చైనా ముందు జాగ్రత్తగా ఎదురుదాడులు చేస్తున్నట్లు అర్ధమైపోతోంది.

Show comments