Idream media
Idream media
కరోనా వైరస్ సోకిన రోగులకు చికిత్సను అందించేందుకు కేవలం 48 గంటల్లో ఆసుపత్రిని సిద్ధం చేసి చైనా మరో ఫీట్ సాధించింది. అప్పటికే నిర్మాణం పూర్తైన భవనాన్ని 1000 పడకల డెబీ మౌంటెన్ రీజనల్ మెడికల్ సెంటర్‌గా తీర్చిదిద్దింది. 500 మంది నిర్మాణ కార్మికులు, పోలీసులు అకుంఠిత దీక్షతో ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. కరోనా వైరస్ కేంద్రమైన వూహాన్‌కు కొద్ది దూరంలోనే ఈ ఆసుపత్రిని సిద్ధం చేశారు. గత రాత్రి 10.30 నుంచి ఈ ఆసుపత్రి సేవలు అందించడం ఆరంభించింది.
వాస్తవానికి ఆసుపత్రి కోసమే ఈ భవనాన్ని నిర్మించినప్పటికీ, మే నెలలో సేవలు ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే కరోనా తీవ్రత దృష్ట్యా నిర్మాణ పనులను వేగిరం చేసిన ప్రభుత్వం కేవలం 48 గంటల్లో ఆసుపత్రిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చింది. ఇక కరోనా వైరస్ వ్యాప్తికి కేంద్రమైన వూహాన్ నగరంలో ఇంతకంటే భారీ ఆసుపత్రిని ప్రారంభించే క్రమంలో చైనా ప్రభుత్వం తలమునకలై ఉంది. సోమవారం నాటికి దీన్ని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
కాగా, ఇలా ఆఘమేఘాల మీద ఆసుపత్రులను సిద్ధం చేయడం చైనాకు కొత్తేమీ కాదు. 2003లో సార్స్ వైరస్ విజృంభించినప్పుడు కూడా అక్కడి ప్రభుత్వం బీజింగ్ నగరంలో కేవలం ఏడు రోజుల్లోనే సరికొత్త ఆసుపత్రిని రెడీ చేసింది. ముందుగా తయారు చేసి పెట్టిన నిర్మాణ విడిభాగాలతో ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేసింది. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు తాజాగా ఇదే విధానాన్ని ప్రభుత్వం అవలంబిస్తోంది.