iDreamPost
android-app
ios-app

వినోదం విస్మయం కలగలసిన సినిమా – Nostalgia

  • Published Sep 05, 2021 | 9:31 AM Updated Updated Sep 05, 2021 | 9:31 AM
వినోదం విస్మయం కలగలసిన సినిమా – Nostalgia

సాధారణంగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమాల్లో ఎంటర్ టైన్మెంట్ జొప్పించడం కష్టం. ఎందుకంటే సీరియస్ గా కథ నడుస్తున్నప్పుడు నవ్వించే ప్రయత్నం కొన్నిసార్లు రివర్స్ లో నవ్వుల పాలు చేయొచ్చు. అందుకే ఈ విషయంలో దర్శక రచయితలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రిస్కుకి ఎదురీది మరీ విజయం సాధించిన చిత్రంగా ‘చెట్టు కింద ప్లీడర్’ని చెప్పుకోవచ్చు. 1988లో మమ్ముట్టి హీరోగా మలయాళంలో ‘తంత్రం’ అనే సినిమా వచ్చింది. డైరెక్టర్ జోషి. ఇది సూపర్ హిట్ అయ్యింది. అదే సమయంలో మంచి కథ కోసం చూస్తున్నారు దర్శకుడు వంశీ. ‘లేడీస్ టైలర్’ తర్వాత ఆయనకి లాయర్ సుహాసిని, మహర్షి రూపంలో రెండు ఫ్లాపులు దక్కాయి.

Also Read: న్యాయవాది నల్లకోటు వదిలేస్తే – Nostalgia

శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ బాగానే ఆడింది కానీ ఇంకా పెద్ద రేంజ్ లో ఆశించారు ఆయన. అప్పుడు తంత్రం చూసి దీనికే కామెడీ ట్రీట్మెంట్ జోడిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చి చెట్టు కింద ప్లీడర్ స్క్రిప్ట్ కి శ్రీకారం చుట్టారు. సంభాషణల రచయిత తనికెళ్ళ భరణి సహాయంతో ముప్పాతిక భాగం వినోదాత్మకంగా పావు వంతు సీరియస్ గా సాగే థ్రిల్లర్ ని పక్కాగా సిద్ధం చేశారు. లేడీస్ టైలర్ తో పెద్ద బ్రేక్ అందుకున్న రాజేంద్ర ప్రసాద్ తప్ప ఈ క్యారెక్టర్ కు ఇంకెవరు వంశీ మనసులో లేరు. కిన్నెరను జోడిగా తీసుకుని గొల్లపూడి, శరత్ బాబు, దేవదాస్ కనకాల, ఊర్వశి, ప్రదీప్ శక్తి తదితరులను ఇతర తారాగణంగా ఎంచుకున్నారు.

Also Read: బంగారు బుల్లోడుతో నిప్పురవ్వ ఢీ – Nostalgia

ఇళయరాజా అద్భుతమైన పాటలు సిద్ధం చేశారు. ముఖ్యంగా చల్తీ కా నామ్ గాడి పాట రికార్డింగ్ టైంలోనే అక్కడి యూనిట్ సభ్యులు గెంతులు వేసినంత పని చేశారు. హరి అనుమోలు ఛాయాగ్రహణం బాధ్యతలు తీసుకున్నారు. ఆస్తి కోసం సవతి తండ్రి చేతిలో హత్యకు గురైన గోపాలకృష్ణ(శరత్ బాబు)భార్య సుజాత(ఊర్వశి)తన ఒక్కగానొక్క బిడ్డ కోసం ఆస్తులు కాపాడుకునే ప్రయత్నంలో అసలు కేసులే లేని లాయర్ బాలరాజు(రాజేంద్రప్రసాద్)సహాయం కోరుతుంది. ఇంత పెద్ద పద్మవ్యూహం నుంచి బాలరాజు ఆమెను ఎలా కాపాడాడు అనేదే కథ. 1989 జూన్ 2 విడుదలైన చెట్టు కింద ప్లీడర్ ఇక్కడా బంపర్ హిట్టు కొట్టింది. ఒక్క అసభ్య పదజాలం లేకుండా ముప్పై ఏళ్ళ తర్వాత చూసినా మనసారా నవ్వుకునేలా చేయడంలో ఈ సినిమాది ప్రత్యేక శైలి

Also Read: మహిళా చైతన్యానికి నిలువెత్తు ప్రతీక – Nostalgia