Idream media
Idream media
కోర్టులలో దొంగ సాక్షులను ప్రవేశపెట్టి కేసుల నుంచి తమ క్లైంట్లను బయటపడేసేందుకు లాయర్లు చేసే ప్రయత్నాలను చాలా సినిమాల్లో మనం చూశాం. నిజజీవితంలో కూడా ఇలాంటివి చాలా జరిగాయి. జరుగుతూనే ఉంటాయి. ఇది కాస్త పక్కనపెడితే.. కొత్తగా ఫిర్యాదుదారులనే సృష్టించి కేసు నుంచి బయటపడాలని చూశాడు ఓ చీటర్. ఆ చీటర్ లాయరు కూడా కావడంతో ఈజీగా పనికానీయొచ్చు అనుకున్నాడు. ఆయన కంటే నాలుగు ఆకులు ఎక్కువ చదివిన న్యాయమూర్తి ఈ తతంగాన్ని కనిపెట్టి.. అందరినీ ఊచలు లెక్క పెట్టించాడు. ఫిర్యాదుదారులను సృష్టించడమేంటని అర్థం కావడం లేదా? చలో.. ఈ వివరాలు చదవండి అన్నీ తెలుస్తాయి.
విశాఖకు చెందిన ఆడారి రవికుమార్ న్యాయవాది వృత్తి కొనసాగిస్తున్నాడు. దాన్ని అడ్డుపెట్టుకొని ఎంతో మంది దగ్గర లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని మోసం చేశాడు. ఇవ్వమని అడిగిన వారిని బెదిరించేవాడు. ఈ నేపథ్యంలో అతనిపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అనేక చీటింగ్ కేసులు నమోదయ్యాయి. రౌడీ షీట్ కూడా ఉంది. ఈ కేసులకు సంబంధించి విశాఖ జిల్లా కోర్టులో చాలా రోజులుగా విచారణ జరుగుతోంది. అనేక వాయిదాలు నడుస్తున్నాయి.
దీంతో ఈ చీటింగ్ కేసుల నుంచి ఈజీగా బయటపడేందుకు మరో చీటింగ్ పథకం వేశాడు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా లోక్ అదాలత్ జరిగింది. ఎన్నో ఏళ్ల నుంచి పరిష్కారం కాని కేసులకు రాజీ మార్గం ద్వారా తక్షణ పరిష్కారం లభిస్తుంది ఇక్కడ. ఆ లోక్‌అదాలత్‌లో తన కేసును మార్చుకున్నాడు. ఈ చీటింగ్ కేసులలో రాజీ అయినట్లు చెప్పి.. నకిలీ ఫిర్యాదుదారులను న్యాయమూర్తి ముందు హాజరుపరిచాడు. అంతా అనుకున్నట్లే జరుగుతోందని లోలోపల సంతోషపడుతున్న సమయంలో జడ్జికి ఎందుకో అనుమానం వచ్చింది. జడ్జి అడిగే ప్రశ్నలకు నకిలీ ఫిర్యాదుదారులకు సరిగా సమాధానం చెప్పలేకపోయారు. దీంతో వెంటనే ఆ చీటింగ్ కేసులు రిజిస్ట్రర్ అయిన పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. ఆ స్టేషన్ కానిస్టేబుల్‌ను పిలిపించి సదరు కేసులో ఫిర్యాదుదారులు వీరా? కాదా? అని ఆరా తీశారు. అతను గమనించి అసలు ఫిర్యాదుదారులు వీరు కాదని న్యాయమూర్తికి చెప్పాడు. అంతే వెంటనే ఆ చీటింగ్ న్యాయవాది రవికుమార్‌ను, నకిలీ ఫిర్యాదుదారులను అరెస్టు చేయించారు. తానొకటి తలిస్తే దైవమొకటి తలిచింది అన్నట్లు ఊసూరుమంటూ కటకటాల్లోకి వెళ్తిపోయారు ఆ చీటింగ్ లాయర్ అండ్ కో.