iDreamPost
iDreamPost
కాలం మారుతోంది. ముఖ్యంగా కరోనా వచ్చాక ఎన్నో విషయాల్లో గణనీయమైన హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. సినిమా హాళ్లకు జనం మునుపటి స్థాయిలో వారాల తరబడి రారనేది అర్థమైపోయింది. అందుకే ప్రొడ్యూసర్లు కూడా ఓటిటి గ్యాప్ ని 25 రోజులకు మించకుండా చూసుకుంటున్నారు. హీరో సైతం తమ ఆలోచనా ధోరణిని మార్చుకుని కేవలం థియేటర్ అనే గిరి గీసుకోకుండా డిజిటల్ వైపు అడుగులు వేస్తున్నారు. కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిన నిర్మాత ముందు సేఫ్ అయ్యే మార్గం వెతుక్కుంటున్నారు. గత ఏడాది సూర్య ఆకాశం నీ హద్దురాని ప్రైమ్ కి ఇచ్చినప్పుడు రేగిన విమర్శలు వివాదాలు ఎన్నో. ఆయన దాన్ని లెక్క చేయకుండా ముందుకు వెళ్లారు
కట్ చేస్తే డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అయినప్పటికీ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది. కోట్లాది ప్రేక్షకులకు చేరువయ్యింది. అవార్డులు రివార్డులు వస్తూనే ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత నెట్ ఫ్లిక్స్ నవరసలో ఒక ఎపిసోడ్ చేయడం ద్వారా సూర్య తన ఉద్దేశం ఏంటో మళ్ళీ చెప్పకనే చెప్పాడు. వచ్చే నెల 2వ తేదీ రాబోతున్న జై భీమ్ కూడా ప్రైమ్ బాటనే ఎంచుకుంది. ఇది ప్రత్యేకంగా ఆ సంస్థ కోసం సూర్య నిర్మించిన సినిమా. థియేటర్ కోసమే ఉద్దేశించిన మరో మూడు సినిమాలు ఆల్రెడీ నిర్మాణంలో ఉన్నాయి. వాటి విడుదల విషయంలో సూర్య జోక్యం చేసుకోడు. అవి పెద్దతెరపైనే విడుదలవుతాయి.
ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఒకటుంది. వెంకటేష్ రానాలు ఓటిటికి వచ్చేశారు. ఊహకందని విధంగా బాలకృష్ణ ఒక టాక్ షో చేయడం ఇప్పటికే సెన్సేషన్ గా మారింది. నాగార్జున తన డెబ్యూ గురించి గతంలోనే హింట్ ఇచ్చారు. చిరంజీవిని కూడా ఒక బడా సంస్థ అడిగింది కానీ ప్రస్తుతానికి తిరస్కరించారట. సూర్య భార్య జ్యోతిక ప్రత్యేకంగా వెబ్ మూవీస్ ని సైన్ చేస్తున్నారు. ఇటీవలే వచ్చిన రక్త సంబంధం అందులో భాగంగా వచ్చిందే. ఇంకో రెండు మూడు ప్రొడక్షన్ స్టేజిలో ఉన్నాయి. ఇప్పుడు ఎందరు ఆ దారి పట్టినా ముందుగా అడుగు వేసింది మాత్రమే సూర్యనే. అందుకే కోలీవుడ్ ఫ్యాన్స్ జై భీమ్ కు బదులు జై సూర్య అంటున్నారు.
Also Read : Rashmi Rocket : రష్మి రాకెట్ సినిమా రిపోర్ట్