Krishna Kowshik
Krishna Kowshik
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అత్యంత చర్చనీయాంశమైన విషయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్.. 14 రోజుల రిమాండుకు తరలించడం. శనివారం ఉదయం మొదలైన ఈ ప్రక్రియ ఆదివారం రాత్రి ఆయన జైలుకు తరలించడం వరకు కొనసాగింది. స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో రూ. 371 కోట్లను మింగేసిన కేసులో ప్రధాన సూత్రధారి చంద్రబాబు అని తేలిందని ఏపీ సీఐడీ డీజీ సంజయ్ వెల్లడించారు. ఈ కేసులోనే నంద్యాలలో చంద్రబాబును అరెస్టు చేసి గుంటూరు జిల్లాలోని కుంచనపల్లిలోని సిట్ కార్యాలయంలో రాత్రంతా విచారణ చేపట్టారు. ఆదివారం ఉదయం 5.58 నిమిషాలకు ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. చంద్రబాబు తరుపు న్యాయవాది, సీఐడి తరపు న్యాయవాదుల వాదనలు వినిపించారు. అయితే చివరకు కోర్టు సీఐడి తరుఫు న్యాయవాది వాదనతో ఏకీభవించి.. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆదివారం రాత్రి ఆయన్ను రాజమండ్రిలోని సెంట్రల్ జైలుకు తరలించారు.
ఇదిలా ఉంటే.. ఈ కేసులో సీఐడీ తరపున బలమైన వాదనలు వినిపించారు అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. సుప్రీంకోర్టు న్యాయవాది సిద్దార్థ్ లూద్రాకే చుక్కలు చూపించారు. రిమాండ్ రిపోర్టులో ఉన్న ప్రతి పాయింట్‌పై ఆర్గ్యుమెంట్ చేసి.. గెలిచారు. దీంతో అతడి పేరు అంతటా చర్చనీయాంశమైంది. సిద్ధార్థ్ లూద్రా సుప్రీంకోర్టు న్యాయవాదే అయినప్పటికీ.. ఆయన రోజుకు తన వాదనల నిమిత్తం సుమారు కోటి రూపాయలు వసూలు చేస్తుంటారు. ప్రత్యేకమైన సౌకర్యాలు ఉంటాయి. ఇక సుధాకర్ రెడ్డి విషయానికి వస్తే.. అడ్వకేట్ జనరల్ హోదాలో ప్రభుత్వ జీతంగా నెలకు రూ. 3 నుండి 5 లక్షల జీతం మాత్రమే అందుతుంది. అయితే పలు కేసుల్లో ప్రభుత్వం తరుఫున చాలా సార్లు వాదించిన సుధాకర్ రెడ్డి.. విఫలం అవుతూ వస్తున్నారు. అయితే ఈ స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో సుధాకర్ రెడ్డి బలమైన వాదనలు చేశారు. చంద్రబాబును రిమాండ్‌కు తరలించడంలో ఆయన వాదనలు సక్సెస్ అయ్యాయి. సీఐడీ చీఫ్ పక్కా ప్రణాళికతో సిద్ధం చేసిన రిమాండ్ రిపోర్టు, అందులోని అంశాలను ఆర్గ్యుమెంట్ చేయడంలో సిద్ధార్థ్ లూద్రా పై చేయి సాధించారు పొన్నవోలు. 409 సెక్షన్ ఈ కేసులో పెట్టడం సబబు కాదని, రిమాండ్ రిపోర్టును లుథ్రా వాదించారు.
అయితే ఈ సెక్షన్ చెల్లుబాటు అవుతుందని నిరూపించాడు పొన్నవల సుధాకర్ రెడ్డి. అవినీతి ఆరోపణకు ఆధారాలు లేవని లూద్రా వాదించగా.. సాక్ష్యాధారాలను చూపించారు సుధాకర్ రెడ్డి. అదే సందర్భంలో టైంకి కాకుండా 24 గంటల్లో కోర్టులో హాజరుపర్చాలన్న నిబంధనలకు విరుద్ధంగా సీఐడీ పోలీసులు ప్రవర్తించారని లూద్రా వాదన చేశారు. అయితే తాము సరైన సమయానికే కోర్టులో హాజరు పరిచామని చంద్రబాబు సంతకం చేసిన నోటీసును చూపించారు. గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదని చెప్పగా.. ఆర్థిక అక్రమాలకు పాల్పడిన కేసులో అవసరం లేదని కౌంటరిచ్చారు. లూద్రా చేస్తున్న వాదనకు ప్రతివాదన గట్టిగా చేయడంలో.. నూటికి నూరు శాతం విజయం సాధించారు సుధాకర్ రెడ్డి. ప్రతివాది తరుఫున లాయర్ లూద్రా ఆ విషయంలో తడబడ్డాడు. రిమాండ్‌లోని ప్రతి పాయింట్ పై పట్టు వదలని విక్రమార్కుడిలా సుధాకర్ రెడ్డి వాదనలు చేశారు. దీంతో కోర్టు అడ్వకేట్ జనరల్ వాదనలతో ఏకీభవించి.. చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ ను విధించింది. ఆయనను రిమాండుకు తరలించడంలో సుధాకర్ రెడ్డి వాదనలే కీలకంగా మారాయి. దీంతో ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.