iDreamPost
android-app
ios-app

చీరాలపై చంద్రబాబు పట్టుదల ఎందుకు? పాత స్నేహితుడిని ఓడించటం కోసమేనా?

చీరాలపై చంద్రబాబు పట్టుదల ఎందుకు? పాత స్నేహితుడిని ఓడించటం కోసమేనా?

రాష్ట్ర రాజకీయాల్లో ప్రకాశం జిల్లా చీరాల తీరు ఒకింత భిన్నమే. అక్కడ నిత్యం గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు సాగుతూ ఉంటుంది. ఇది అప్పుడప్పుడు శృతి మించి దాడులు, ప్రతిదాడులకూ దారితీస్తుంటుంది. తాజాగా పురపోరుకు తెరలేవడం… చంద్రబాబు చీరాలలో ఎలాగైనా గెలిచి, కరణం బలరామ్‌పై తన వ్యక్తిగత కోపాన్ని తీర్చుకోవాలని చూస్తుండటం సర్వత్రా ఆసక్తిగా మారింది. చీరాలపై టీడీపీ అధినేత ఇప్పటికే పలు వ్యూహాలను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వైఎస్సార్‌సీపీ ప్రజా సంక్షేమ పాలన జోరులో చంద్రబాబు పాచికలు ఏమేరకు పారతాయనేది తెలియాలంటే కొంతకాలం వేచిచూడాల్సిందే!

ప్రస్తుత చీరాల రాజకీయం చిత్రపటంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే కరణం బలరామ్, ఆమంచి కృష్ణమోహన్, యడం బాలాజీలు ముఖ్యపాత్రధారులుగా ఉన్నారు. పోతుల సునీత సైతం కీలకమే అయినప్పటికీ ఈవిడ స్థానం ఆ ముగ్గురి తర్వాతే.

Also Read:కోటరీని దాటని బాబు కుప్పం పర్యటన

ఆమంచి విషాయానికే వస్తే గత దశాబ్ద కాలంలో చీరాలలో ఈయనదే పెత్తనం. జెట్పీటీసీ, ఎంపీపీగా పనిచేసిన ఆమంచి… రోశయ్య అనుచరుడిగా 2009లో కాంగ్రెస్‌ టిక్కెట్టుపై గెలిచారు. 2014లో ప్రధాన పార్టీల నుంచి టిక్కెట్టు లభించకపోవడంతో అనూహ్యంగా స్వతంత్య్ర అభ్యర్థిగా(నవోదయ పార్టీ) గెలుపొందారు. అపట్లో కృష్ణమోహన్‌ గెలుపు వెనుక వైశ్య సామాజికవర్గ లాబీ పనిచేసిందనేది సుస్పష్టం. ఆమంచికి చీరాలలోని వైశ్య సామాజికవర్గ ప్రముఖులతో ఉన్న ఆర్ధిక లావాదేవీలు,పెట్టుబడుల కారణంగా పార్టీలకతీతంగా వారు ఆమంచికి గెలుపుకు కృషి చేశారు. 2014లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఆమంచి అప్పటి రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు సాహచర్యంతో టీడీపీలో చేరి చీరాలపై తన పట్టు నిలుపుకున్నారు. టీడీపీలోనూ క్రియాశీలకంగా వ్యవహరించారు.

కాపు సామాజికవర్గానికి చెందిన ఆమంచి 2017లో నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా అప్పటి రాష్ట్ర మంత్రి ఆదినారాయణరెడ్డితో కలసి గోస్పాడు మండల బాధ్యుడిగా వ్యవహరించారు. వైసీపీకి మంచి మెజారిటీ వస్తుందని భావించిన గోస్పాడు మండలంలో టీడీపీకి ఆధిక్యత రావటం వెనుక ఆమంచి కృషి ఉందని భావించిన చంద్రబాబు నిధుల విషయంలో ఆయనకు అధిక ప్రాముఖ్యత ఇచ్చారు. అయితే 2019 ఎన్నికలకు ముందు టీడీపీ ఓటమిని ముందస్తుగా పసిగట్టిన ఆమంచి ఎన్నికలకు రెండు నెలల ముందు అనూహ్యంగా వైఎస్సార్సీపీలో చేరడం చీరాల టిక్కెట్టు దక్కించుకోవడం చకచకా జరిగిపోయాయి.

Also Read:తిరుగులేని యోధుడు

2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ సునామి సృష్టించినా …ఆమంచి మాత్రం చీరాలలో ఓడిపోయారు. దీనికి వ్యక్తిగతంగా ఆమంచికి చీరాలలో పెరిగిన వ్యతిరేతతోపాటు ప్రత్యర్థులంతా కలసి ఆమంచిపై దండెత్తడమే కారణం. ప్రకాశం టీడీపీలో కీలక నేతైన కరణం బలరామ్‌ సొంత నియోజకవర్గం అద్దంకి అయినప్పటికీ చీరాలపై తొలి నుంచీ ఆయనకు రాజకీయ ఆసక్తులు ఉన్నాయి. ఆయన యువజన కాంగ్రెస్ నాయకుడిగా రాజకీయం మొదలు పెట్టింది కూడా చీరాల నుంచే. ఆయన మామగారి ఊరు చీరాలే.

గత ఎన్నికల్లో ఆమంచిని ఓడించాలన్న లక్ష్యంతో చంద్రబాబు బలవంతంగా కరణం బలరామ్‌ను చీరాలకు పంపిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో అప్పటి వరకు వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న యడం బాలజీ టిక్కెట్టు రాలేదనే కారణంతో పార్టీని వీడి టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో కరణం బలరామ్, యడం బాలాజీ, పోతుల సునీత, మాజీ మంత్రి పాలేటి రామారావులు అంతా కలసి ఆమంచికి ఓటమి రుచిచూపారు.

అయితే అనూహ్యంగా ఎన్నికల అనంతరం కరణం బలరామ్‌ కుమారుడు వెంకటేష్, పోతుల సునీతలు వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే కరణం బలరామ్‌ నేరుగా వైఎస్సార్‌సీపీలో చేరనప్పటికీ పరోక్షంగా వైసీపీ కి జైకొట్టారు. దీంతో ప్రస్తుతం చీరాల వైఎస్సార్‌సీపీలో కరణం, ఆమంచి, సునీత వర్గాలు ఆధిపత్యం కోసం పోరాడుతున్నాయి. కరణం కుమారుడు ఆమంచికి వార్నింగ్‌లు ఇవ్వడం, ఆమంచి కరణంపై జిల్లా పార్టీ ఇంఛార్జ్‌ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి ఫిర్యాదులు చేయడం వంటివి జరుగుతున్నాయి.

Also Read:కేటీఆర్ ,ది బెస్ట్ మినిస్ట‌ర్ అవార్డు విన్నర్

1978 నుంచి పార్టీలకు అతీతంగా స్నేహం ఉన్న కరణం బలరామ్‌ పార్టీ వీడటాన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు ప్రస్తుత పురపాలక ఎన్నికల ద్వారా ఆయనపై రాజకీయంగా కక్ష తీర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా చీరాల ఇంఛార్జ్‌ యడం బాలాజీ, పక్కనే ఉన్న పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుల ద్వారా చీరాలలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు.

అయితే వైఎస్సార్‌సీపీ సైతం చీరాల ఆధిపత్య పోరుపై దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. సజ్జల రామకృష్ణారెడ్డి గ్రామపంచాయతీ ఎన్నికల్లో కరణం, ఆమంచి వర్గాలు ఒకరిపై ఒకరు పోటీ పడటంపై ఇప్పటికే పోస్టుమార్టమ్‌ నిర్వహించారు. అంతేకాకుండా జరగబోయే పురపాలక ఎన్నికల్లో ఎటువంటి తప్పులు జరక్కూడదని తేల్చిచెప్పినట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో బలమైన నేతలు, సంక్షేమ పాలన అండదండలు పుష్కలంగా ఉన్న వైఎస్పార్‌సీపీని అడ్డుకొని చీరాలలో టీడీపీ జెండా ఎగరవేయడం చంద్రబాబుకు అసాధ్యమే కావొచ్చు…..!