iDreamPost
android-app
ios-app

చంద్రబాబుకు కనపడ్డ అంబాని జగన్‌ లాలూచి..

చంద్రబాబుకు కనపడ్డ అంబాని జగన్‌ లాలూచి..

పారిశ్రామిక దిగ్గజం ముకేష్‌ సన్నిహితుడు, ఆయన సంస్థల్లో కార్పొరేటర్‌ వ్యావహారాల విభాగం చైర్మన్‌ పరిమల్‌ నత్వానీకి వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సీటును కేటాయించడంతో సీఎం జగన్‌పై విమర్శలు చేసేందుకు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఒక అస్త్రం దొరికింది. గతంలో జరిగిన ఘటనలను ముడిపెడుతూ టీడీపీ అధినేత సీఎం జగన్‌ను టార్గెట్‌ చేస్తున్నారు. రాజ్యసభ సీటు కేటాయింపులో.. జగన్, అంబానీ లాలూచి పడ్డారని చంద్రబాబు విమర్శిస్తున్నారు.

హెలికాప్టర్‌ ప్రమాదంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రస్తావిస్తున్నారు. తన తండ్రిని చంపడంలో రిలయన్స్‌ హస్తం ఉందని, కుట్ర జరిగిందని అప్పట్లో జగన్‌ చెప్పారంటూ.. చంద్రబాబు చెప్పుకొస్తున్నారు. వైఎస్‌ చనిపోయిన సమయంలో రిలయన్స్‌ షాపులు, సెల్‌ టవర్లపై దాడులు చేయించారని చంద్రబాబు చెబుతున్నారు. ఆ దాడులకు సంబంధించి ఇంకా కొందరు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని పేర్కొంటున్నారు. మాట తప్పను.. మడమ తిప్పను.. అనే జగన్‌.. ఆ రోజు రిలయన్స్‌పై ఎందుకు అలా చేశారు.. ఈ రోజు ఇలా ఎలా చేశారని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. జనాన్ని ఫూల్స్‌ను చేయాలనుకుంటున్నారా..? అంటూ మండిపడుతున్నారు.

చంద్రబాబు చేస్తున్న విమర్శలను వైఎస్సార్‌సీపీ తిప్పికొడుతోంది. చంద్రబాబుకు ఈ విషయంలో మాట్లాడే అర్హత లేదని మంత్రి, రాజ్యసభ అభ్యర్థి మోపీదేవి వెంకటరమణ అంటున్నారు. రాజకీయాలను వ్యాపారంలా మార్చిన చంద్రబాబు.. తమను విమర్శించడం విడ్డూరంగా ఉందంటున్నారు.

ఏపీ నుంచి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలు వైఎస్సార్‌సీపీకి దక్కబోతున్నాయి. ఈ నెల 26 జరిగే రాజ్యసభ ఎన్నికలకు నిన్న సోమవారం వైఎస్సార్‌సీపీ తన అభ్యర్థులను ప్రకటించింది. మండలి రద్దుతో మంత్రిపదవులు కోల్పోతున్న మోపీదేవీ వెంకటరమణ, పిల్లి సుభాష్‌చంద్రబోష్, ఆ పార్టీ నేత ఆళ్ల ఆయోధ్య రామిరెడ్డితోపాటు నాలుగో అభ్యర్థిగా పరిమల్‌ నత్వానీని సీఎం జగన్‌ ప్రకటించారు. నత్వానీ అభ్యర్థిత్వం ఖరారు కావడంతో ప్రతిపక్ష, అధికార పార్టీల మధ్య విమర్శల పర్వం నడుస్తోంది.