Idream media
Idream media
తమ పార్టీ వారిని భగవంతుడే కాపాడాలని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావులు ప్రయాణిస్తున్న కారుపై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. దాడి జరిగిన వెంటనే చంద్రబాబు మీడియా ముందుకు వచ్చారు. అక్కడ ఏమి జరిగింది..? ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉందో.. ఫోన్‌లో మాట్లాడి తెలుసుకున్నారు. లౌడ్ స్పీకర్ పెట్టి బొండా ఉమా, బుద్ధా వెంకన్నల మాటలను వినిపించారు.
రాష్ట్రంలో నియంతృత్వం రాజ్యమేలుతోందని చంద్రబాబు మండిపడ్డారు. మాచర్లకు మా నేతలు బొండా ఉమా, బుద్ధా వెంకన్న వెళుతున్నారని గుంటూరు జిల్లా ఎస్పీకి కూడా చెప్పామని చంద్రబాబు పేర్కొన్నారు. గత చరిత్రను కూడా వివరించి భద్రతా చర్యలు తీసుకోవాలని చెప్పినా.. మా వారిపై దాడి జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. మా వాళ్లను ఆ భగవంతుడే కాపాడాలని వేడుకున్నారు. దాడులు జరుగుతున్న విషయంపై డీజీపీని కలిసేందుకు తమ పార్టీ నేత వర్ల రామయ్య వెళితే అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని ఆరోపించారు. మమ్మల్ని కాపాడంటూ డీజీపీ కాళ్లు పట్టుకోవాలా.. అంటూ తీవ్ర నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు.