iDreamPost
iDreamPost
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, అసలు జరగాల్సిన పని కన్న ప్రచారం పైనే ఎక్కువగా దృష్టి పెడతారన్నది తెలిసిన విషయమే. 9ఏళ్ళ ఆయన పాలనలో హైదరాబాద్ అభివృద్దిపైన ఆయన చేసుకున్న ప్రచారం చూసుకున్నా , గడచిన 5ఏళ్లలో అమరావతి రాజధాని పేరిట గ్రాఫిక్స్ చూపుతూ ఆయన సాగించిన ప్రచారం చూసుకున్నా చేసిన అభివృద్ది కొసరైతే చేసుకున్న ప్రచారం కొండంతగా సాగింది. ఈ ప్రచారంతో వ్యక్తిగతంగా ఆయనకు ఆయన పార్టీకు కాస్తా లాభం చేకూరినా, ఆ ప్రచారానికి ఆయన వాడిన ధనంతో పూర్తిగా నష్టపొయింది మాత్రం ప్రభుత్వ ఖజానానే.
గత చంద్రబాబు హయాంలో పోలవరం యాత్ర పేరున ఆయన సాగించిన ప్రచారానికి ఆర్టీసీపై సైతం ఇప్పుడు మోయలేని భారం పడినట్టు వార్తలు వస్తున్నాయి. గడచిన 5ఏళ్ళలో చంద్రబాబు అనుసరించిన విధానాలు , రాజధాని పేరిట ఆయన చూపిన గ్రాఫిక్స్ తో విసిగిపొయిన ప్రజలు ఆయన పాలనపై తీవ్ర వ్యతిరేకతను పెంచుకున్నారు. అయితే ప్రజలు నాడిని గ్రహించిన చంద్రబాబు ఎన్నికలు దగ్గరయ్యే సరికి తాను ఏదో చేస్తునట్టు ప్రజలకు చూపించి లబ్ది పొందేందుకు వేసిన పథకమే పోలవరం యాత్ర.
ప్రజల సొమ్ముతో తనకు తన పార్టీకి లబ్ది చేకూర్చడమే అసలు లక్ష్యంగా ప్రారంభం అయిన “పోలవరం చూసొద్దాం రండి” కార్యక్రమంతో జిల్లాల వారీగా రాష్ట్రంలో ఎంపిక చేసిన ప్రజలను ప్రతిష్టాత్మకమైన పోలవరాన్ని తానే మొత్తం పూర్తి చేసినట్టు పోలవరం చూసొద్దాం రండి అంటూ ప్రజలని ఆర్టీసీ బస్సులు పెట్టి మరీ తరలించారు. పూర్తి కాని పోలవరాన్ని ఎరగా వేసి ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నంతో పూర్తిగా నష్టపోయింది మాత్రం ఆర్టీసీనే.
ఇదే విషయం తాజాగా ఒంగోలు జయప్రకాష్ కాలనీకి చెందిన పోతు ఆంజనేయులు అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకుని సేకరించిన సమాచారంతో చంద్రబాబు ఆర్టీసికి పెట్టిపోయిన బకాయిల వ్యవహారం లెక్కలతో సహా బహిర్గతం అయింది. ఒక్క ఒంగోలు డిపొలోనే చంద్రబాబు ప్రజలను పోలవరానికి తరలించేందుకు 2018 ఏప్రిల్ 23వ తారీకు నుంచి 2019 ఫిబ్రవరీ 23వ తారీకు వరకు 10నెలల కాలంలో మొత్తం అల్ట్రా డీలక్స్ , ఎక్స్ ప్రెస్, సూపర్ లక్జరీ సర్వీసులను మొత్తం 3,81,314 కిలోమీటర్లు తిప్పినట్టు దీనికిగాను ప్రభుత్వం ఆర్టీసికి చెల్లించాల్సిన మోత్తం జీయస్టీ తో కలిపి 3 కోట్ల 83 లక్షలు బకాయి పడగా అందులో చంద్రబాబు చెల్లించింది మొత్తం 18 లక్షలు మాత్రమే. ఇంకా ఆర్టీసీకి చంద్రబాబు నిర్వాకం మూలానా ప్రభుత్వం పడ్డ బకాయి 3 కోట్ల 65 లక్షలు.
చంద్రబాబు పూర్తికాని పోలవరానికి చేసిన బకాయి ఒక్క ఒంగోలు డిపోలోనే ఈ మేరకు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 డిపోలలో ఇంకెంత మొత్తం బకాయి ఉన్నారో ఊహించడమే కష్టం. బాబు ప్రచారానికి దుర్వినియోగం అయిన ఈ మొత్తం ఇప్పుడు వై.యస్ జగన్ ప్రభుత్వంపై పడినట్లైంది. జగన్ సరైన సమయంలో ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయడం మూలానా నేడు ఆర్టిసీ ఉనికిలో ఉంది కానీ అదే ఏమాత్రం జాప్యం జరిగిన కార్మికులకు జీతాలు కూడా చెల్లించలేక, చరిత్ర కలిగిన ఆర్టీసి అప్పుల ఊబిలో కూరుకుని పోయి ఉండేదని ఆర్టీసీ అధికారులు చెబుతున్న మాట. ఏది ఏమైనా చంద్రబాబు ప్రచారంతో ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్ళిపోతే జగన్ ప్రభుత్వం ముందు చూపుతో కార్మికులకు భరోసాగా నిలిచారనే చెప్పాలి.