iDreamPost
iDreamPost
కాలగర్భం అన్నీ తనలో దాచుకొన్నా సమయం వచ్చినప్పుడు తనలో దాగి ఉన్న చెత్త అంతా వెళ్లగక్కుతుంది . దశాబ్దాల తరబడి మనం సముద్రంలో వేసిన చెత్త అంతా సునామీ వచ్చినప్పుడు తిరిగి భూమ్మీదకు నెట్టివేయడం అందరూ చూసే ఉంటారు . ఇప్పుడు సునామీ బాబుని చుట్టుముట్టినట్టుంది ….
చంద్రబాబు దురదృష్టం ఏంటంటే ఈ రోజు ఆయన ఏ అంశం పై సానుకూల వ్యాఖ్య చేస్తున్నారో గతంలో ఖచ్చితంగా దానికి వ్యతిరేక వ్యాఖ్య చేసి ఉంటారు . ఈ రోజు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న దాని పై గతంలో సానుకూలత చూపించి ఉంటారు . ఈ ఇసుక తక్కెడ పేడ తక్కెడ వ్యవహారాలతో విసిగి వేసారిన జనం గత ఎన్నికల్లో పక్కన పెట్టినా ఆయన తీరు మారలేదు . ఎన్నికల్లో తీర్పిచ్చిన జనం తర్వాత బాబుని మర్చిపోయినా ఆయన ద్వంద్వ వైఖరితో ఇక్కట్లు పడ్డ , రేవు దాటాక బోడి మల్లయ్య తరహా వ్యాఖ్యలతో భంగపడ్డ బీజేపీ , ఇతర రాజకీయ పక్షాలు మాత్రం అన్నీ గుర్తుంచుకొని వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తున్నాయి .
2018 లో బీజేపీతో తెగతెంపులు చేసుకొని కాంగ్రెస్ పంచన చేరిన టీడీపీ అధినేత చంద్రబాబు దేశంలో ఏ విపక్షం చేయనన్ని ఆరోపణలు బీజేపీ పై మోడీ పై చేశారు . మరీ ముఖ్యంగా రాజకీయ పరిధి దాటి మోడీ పై , మోడీ వ్యక్తిగత జీవితం పై నాకు భార్యాబిడ్డలు ఉన్నారు నీకెవరున్నారు , యశోదా బెన్ కి అన్యాయం చేసారు లాంటి సంచలన ఆరోపణలు చేశారు బాబు . ఈ క్రమంలోనే రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు పెద్ద కుంభకోణం అని ఆ ఒప్పందం ద్వారా దేశాన్ని చీట్ చేసిన విషయం తర్వాత కాలంలో అయినా బయట పడుతుందని ట్విట్టర్ ద్వారా ఆరోపించారు …
కాలం గిర్రున తిరిగింది , బాబు అంచనాలు తప్పి బీజేపీ అధికారంలోకి వచ్చింది . ఇటు రాష్ట్రంలో టీడీపీ చరిత్ర ఎరగని ఓటమి చవిచూసింది . వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను ఒక్కొక్కటిగా వెలికి తీయనారంభించింది . అమరావతి భూ అక్రమాల నుండి కార్మిక శాఖ మెడిసిన్ కొనుగోలులో అవినీతి వరకూ బయట పడుతున్న కుంభకోణాలతో సతమతమవుతున్న బాబుకి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అండతో గట్టెక్కవచ్చన్న ఆశ ఉదయించింది . వెంటనే బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు ప్రారంభించారు . అయితే ఆరునూరైనా ఈ సారి బాబుని దరిచేరనివ్వరాదని కేంద్రరాష్ట్ర బీజేపీ వర్గాలు కంకణం కట్టుకొన్నట్టు వున్నాయి . బీజేపీతో సానుకూలత కోసం బాబు చేసే ప్రతి ప్రయత్నానికి బాబు గతంలో చేసిన తీవ్ర వ్యతిరేక వ్యాఖ్యలు , వ్యవహరించిన తీరుని ఎత్తిచూపుతూ విమర్శలు చేయనారంభించారు సోము వీర్రాజు , జీవిఎల్ , విష్ణువర్ధన్ రెడ్డి లాంటి బిజెపి నేతలు .
ఈ క్రమంలో నిన్న వైమానిక దినోత్సవం సందర్భంగా ట్వీట్ చేసిన బాబు రాఫెల్ యుద్ధ విమానాలను అమ్ములపొదిలో చేర్చుకొని భారత వైమానిక దళం బలోపేతం అయ్యిందని పొగడ్తల వర్షం కురిపించారు . దీని పై స్పందించిన బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి నాడు ఓట్ల కోసం , మిత్రపక్షం మెప్పు కోసం స్వార్ధ రాజకీయాల్లో భాగంగా రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు పై విమర్శలు చేసిన బాబు ఈ రోజు అధికారం పోయేసరికి యూ టర్న్ తీసుకొని రాఫెల్ యుద్ధ విమానాల్ని , కేంద్రాన్ని పొగుడుతున్నారు అంటూ వ్యాఖ్యానించారు .
మరో వైపు నిన్న జగనన్న విద్యా కానుక పధకం ప్రారంభోత్సవంలో భాగంగా స్కూల్స్ ప్రారంభానికి ముందే విద్యార్థులకు అవసరమైన బుక్స్ , స్టేషనరీ , యూనిఫామ్ , బెల్ట్ షూస్ వంటివి విద్యా సంవత్సరానికి సరిపోను 43 లక్షల మంది విద్యార్థులకు ఒకేసారి అందించే కార్యక్రమం చేపట్టగా ఈ పథకంలో భాగంగా అందించిన వస్తువులతో నాడు చంద్రబాబు అందించిన సంక్రాంతి కానుక , క్రిస్మస్ కానుక అంటూ అందించిన మూడు కిలోల వంట సామాగ్రిని పోల్చి ఎన్నికల కోసం ఓటర్లకు పప్పుబెల్లాల తాయిలాలు పంచటం కాదు బాబూ నాణ్యమైన విద్య , వైద్యం ప్రజలందరికీ అందించే ఇలాంటి శాశ్వత కార్యక్రమాలు చూసి ప్రజాపాలన ఎలా చేయాలో నేర్చుకో అంటూ బాబుకి హితవు పలుకుతూ పలువురు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడం టీడీపీని , బాబుని చికాకు పెట్టి ఉండవచ్చు .
ఏదేమైనా నాడు బాబు అవకాశవాదంతో ఆయా పార్టీలతో వ్యవహరించిన తీరు , చేసిన వ్యాఖ్యలు నేడు ఆయన పాలిట శరాఘాతాలుగా మారాయని చెప్పొచ్చు . సంక్షోభంలో అవకాశాలు వెతుక్కొంటా అని చెప్పుకునే టీడీపీ అధినేత అన్ని వైపుల నుండి వస్తున్న ఈ విమర్శల దాడిని ఎలా ఎదుర్కొంటారో చూడాలి ..