iDreamPost
android-app
ios-app

బీసీ లంటే బాబుకి అంత అలుసు

  • Published Sep 21, 2020 | 4:36 AM Updated Updated Sep 21, 2020 | 4:36 AM
బీసీ లంటే బాబుకి అంత అలుసు

ఆంధ్రప్రదేశ్ లో అధికారం కోల్పోయిన తర్వాత అనేక మంది చంద్రబాబుకి మొఖం చాటేస్తున్నారు. టీడీపీ టికెట్ పై గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఝలక్ ఇస్తున్నారు. చంద్రబాబు, ఆయన తనయుడిని నమ్ముకుంటే భవష్యత్ లేదనే బెంగతో అనేక మంది దూరమవుతున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే నలుగురు జగన్ ని కలిశారు. మరో ముగ్గురు బాబుకి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.

తొలుత గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో ఈ ప్రస్థానం ప్రారంభమయ్యింది. ఆ తర్వాత గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాల గిరి, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కూడా వంశీ బాటల సాగిపోయారు. చంద్రబాబుని తీవ్రంగా విమర్శించారు. చివరకు రాజ్యసభ ఎన్నికల్లో తమ ఓట్లను చెల్లనివిగా చేసుకుని షాకిచ్చారు. అనగాని సత్యప్రసాద్ లాంటి వారు ఓటింగ్ దూరంగా ఉండి అనుమానాలు రేకేత్తించగా, ఓటింగ్ కి వచ్చిన రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఓటు కూడా చెల్లని జాబితాలో చేరడం అప్పట్లో సందేహాలకు తావిచ్చింది.

ఈ పరంపరలో చంద్రబాబు ఎక్కడా నోరు మెదిపిన దాఖలాలు లేవు. బాబుని విమర్శించిన ఎమ్మెల్యేలపై స్పందన లేదు. కనీసం గన్నవరం వంటి చోట్ల ఇప్పటికీ ఇన్ఛార్జ్ ని కూడా నియమించలేకపోయారు. కానీ తాజాగా బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కుమారులు జగన్ పార్టీ కండువా కప్పుకోగానే చంద్రబాబు ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. వ్యక్తిగత స్వార్థం కోసమే పార్టీని వీడారంటూ చంద్రబాబు ఉక్రోశం వ్యక్తం చేశారు. ఇంతకుముందు కరణం బలారం, వల్లభనేని వంశీ వంటి వారు నేరుగా చంద్రబాబు ని తిట్టినా పట్టించుకోని టీడీపీ అధినేత ఇప్పుడు నేరుగా బీసీ ఎమ్మెల్యే మీద దాడికి యత్నించడం వెనుక మతలబు ఏమిటన్నది పలువురు ప్రశ్నిస్తున్నారు.

టీడీపీ పాలనలో బీసీలను తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్న చంద్రబాబు ఇప్పుడు బాబు దగ్గర భవిష్యత్ లేదని నిర్ణయించుకోవడం తప్పు అన్నట్టుగా వ్యాఖ్యానిస్తున్నారని, బీసీ లంటే చంద్రబాబుకి అలుసు అని విమర్శలు వస్తున్నాయి. తన సొంత సామాజికవర్గ నేతలు పార్టీ మారినా తప్పు లేదు గానీ, బీసీలు తనను వీడి వెళ్లడం సహించలేకపోతున్నారని అభిప్రాయపడుతున్నారు. కమ్మ నేతలు బాబుని కాదన్నప్పుడు నోరు మెదపకుండా ఇప్పుడు బీసీ ఎమ్మెల్యే మీద విరుచుకుపడే ప్రయత్నం చేయడం ద్వారా చంద్రబాబు నైజం బయటపడుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. పైగా ఎమ్మెల్యేని 100 కోట్లకు కొనుగోలు చేశారంటూ అవమానించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు. అలా అనుకుంటే ఇంతకుముందు ముగ్గురు ఎమ్మెల్యేలకు ఎంత ఇచ్చారో చంద్రబాబు లెక్కలు చెప్పగలరా అని నిలదీస్తున్నారు.