iDreamPost
android-app
ios-app

Polavaram, Estimations – పోలవరంలో మరో కొర్రీ, ఏకంగా రూ. 15వేల కోట్ల కోత అనివార్యమంటున్న మోదీ సర్కారు

  • Published Dec 12, 2021 | 5:28 AM Updated Updated Mar 11, 2022 | 10:32 PM
Polavaram, Estimations – పోలవరంలో మరో కొర్రీ, ఏకంగా రూ. 15వేల కోట్ల కోత అనివార్యమంటున్న మోదీ సర్కారు

విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిది. ప్రాజెక్టు అంటే కేవలం ఆనకట్ట మాత్రమే కాదు..ఆ కట్ట మూలంగా నీటమునిగే ప్రజల పునరావాసం కూడా అనేది ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పునరావాసం కూడా ప్రాజెక్టు నిర్మాణంలో భాగమేనని తేల్చిచెప్పింది. కానీ కేంద్రం మాత్రం దానికి భిన్నంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కోసమే కనీసంగా రూ. 29వేల కోట్లు వెచ్చించాల్సి ఉంది. అందులో ఇప్పటి వరకూ పూర్తిచేసింది 10 శాతం కూడా లేదు.

కేంద్రం మాత్రం ప్రాజెక్టు కోసం కేటాయించాల్సిన మొత్తాన్ని మాత్రం పెంచడానికి ససేమీరా అంటోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే పలుమార్లు పార్లమెంట్ లోపలా, వెలుపలా పలుమార్లు కేంద్రాన్ని విన్నవించారు. సవరించిన అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కనీసంగా రూ. 55,548 కోట్లు అవసరమంటూ కేంద్ర సాంకేతిక సలహా మండలి ఆమోదించింది. ఆ తర్వాత అంచనాల సవరణ కమిటీ దానిని రూ. 47,275 కోట్లకు పరిమితం చేసింది. అంటే దాదాపుగా 7వేల కోట్లకు పైబడి కోత వేసింది. అందులో తాగునీటి అవసరాలకు సంబంధించిన మరో రూ. 7,214 కోట్లను కేంద్రం కోత వేస్తోంది. అంటే దాదాపుగా రూ. 15వేల కోట్లకు పైబడి కేంద్రం కొర్రీలు వేసి నిధులు కేటాయించేందుకు ససేమీరా అంటోంది.

విద్యుత్ కేంద్రం నిర్మాణం కోసం రూ. 4565 కోట్లు అవసరం అవుతాయి. కానీ వాటిని మాత్రం ఏపీ ప్రభుత్వం అడగడం లేదు. అయినప్పటికీ బహుళార్థ సాధక ప్రాజెక్టుగా విభజనచట్టంలో జాతీయహోదా ఇచ్చినప్పటికీ ఇప్పుడు దానికి భిన్నంగా కేంద్రం వ్యవహరిస్తోంది. కేవలం మిగిలిన రూ. 35,950 కోట్లకు మాత్రమే పెట్టుబడుల అనుమతికి సానుకూలత వ్యక్తం చేస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. నిజానికి ఇప్పటికే 2013 నాటి అంచనాలను సవరించాల్సి ఉంది. పెరిగిన వ్యయానికి అనుగుణంగా కేటాయింపులు చేయాల్సి ఉంటుంది. కానీ దానికి భిన్నంగా అంచనాల సవరణకు కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ నుంచి అనుమతి లభించడం లేదు. ఈలోగా వివిధ కారణాలు చూపుతూ కోతలు మాత్రం విధిస్తున్నారు. చివరకు పునరావాసంలో కూడా 5వేల కోట్ల మొత్తాన్ని కత్తరించే ప్రయత్నం చేస్తుండడం విస్మయకరంగా మారింది.

Also Read : ఏపీ ఎన్నికల్లో పోలవరం-యూపీ ఎన్నికల్లో కెన్-బెత్వా

పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడిగా అంతా భావిస్తున్న దశలో మోదీ సర్కారు మాత్రం దానిని పూర్తి చేయడానికి సంసిద్ధంగా లేదనే సంకేతాలు ఇస్తోంది. నిధులు కేటాయించడానికి కుంటి సాకులతో జాప్యం చేస్తుందనే అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో పోలవరం నిధులను ఏటీఎంలా చేసుకుని అవినీతి చేశారని ఆరోపించిన పీఎం మోదీ ఆ విషయంలో చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అవసరమైన నిధుల విషయంలో మాత్రం నీళ్లు నములుతున్నారు. ఉత్తరాంధ్రకు తాగు, సాగు నీటి అవసరాలు తీర్చే పోలవరం విషయంలో కేంద్రం తీరు ఏపీకి తీరని అన్యాయం చేసేలా ఉందనే అభిప్రాయాన్ని బలపరుస్తున్నారు.