Idream media
Idream media
కరోనా నాలుగో వేవ్ వచ్చే ప్రమాదం ఉందంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత ఏడాది చివరలో థర్ట్ వేవ్ దేశంలో విజృంభించింది. ఆ ప్రభావం తగ్గిన మూడు నెలలకే మళ్లీ నాలుగో వేవ్ వచ్చే సూచనలు కనిపిస్తుండడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. వివిధ దేశాల్లో కొత్త వేరియంట్లు పుడుతుండడం, విస్తృతంగా వ్యాప్తి చెందుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేస్తూ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఓ నోట్ జారీ చేసింది.
నాలుగో వేవ్ వచ్చే ప్రమాదం ఉందంటూ హెచ్చరించిన కేంద్రం.. రాకుండా అరికట్టేందుకు ఐదంచెల వ్యూహాన్ని అమలుచేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచనలు చేసింది. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్, వ్యాక్సినేషన్, కరోనా ప్రవర్తనను అంచనా వేయడం ద్వారా నాలుగో వేవ్‌ను అడ్డుకోవచ్చని సలహా ఇచ్చింది. వీటితోపాటు భౌతిక దూరం పాటించేలా చూడడం, మాస్క్‌లు ధరించేలా కరోనాపై మరింత అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టడం, కోవిడ్ ప్రోటోకాల్ తప్పనిసరిగా అమలు జరిగేలా చూడాలని కేంద్రం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది.
ప్రస్తుతం మనదేశంలో కరోనా కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి. రోజువారీ కేసులు మూడు వేల లోపు మాత్రమే నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,528 మంది వైరస్ బారినపడ్డారు. దేశంలో కోవిడ్ కేసులు తక్కువగా నమోదవుతున్నా.. చుట్టుపక్కల ఉన్న దేశాల్లో వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉంది. కొత్త వేరియంట్లు పుట్టి వణికిస్తున్నాయి. హాంకాంగ్, చైనా దేశాల్లో ఒమిక్రాన్ ఉప వేరియంట్ స్టెల్త్ ఒమిక్రాన్ విజృంభిస్తోంది. ఫలితంగా ఆ దేశాల్లోని పలు నగరాల్లో లాక్‌డౌన్లు అమలు చేస్తున్నారు. ఇక దక్షిణ కొరియాలో కోవిడ్ వ్యాప్తి తీవ్ర ఆందోళనకరమైన రీతిలో ఉంది. గడిచిన 24 గంటల్లో దక్షిణ కొరియాలో 6,21,328 కేసులు నమోదు కావడం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. అమెరికాలో ఒక్కరోజులో నమోదైన పది లక్షల కేసులు తర్వాత.. మళ్లీ భారీగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
ఇజ్రాయిల్‌లో ఒమిక్రాన్ ఉప వేరియంట్ బీఏ.1, బీఏ.2 కలయికతో కొత్త ఉప వేరియంట్ ఉద్భవించింది. విమానయానం చేస్తున్న ఇద్దరు యువకుల్లో ఇది కనిపించింది. దానికి ఇంకా పేరు పెట్టలేదు. ఇప్పటికే చైనాలో ఒమిక్రాన్ ఉప వేరియంట్ స్టెల్త్ ఒమిక్రాన్ విజృంభిస్తోంది. ఇలా ప్రపంచంలోని వివిధ దేశాల్లో కొత్త వేరియంట్లు పుట్టడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా కొత్త వేరియంట్ పుడితే జూన్‌లో నాలుగో వేవ్ వస్తుందని ఇప్పటికే ఐఐటీ ఖరగ్‌పూర్ అంచనా వేసింది. నాలుగో వేవ్ జూన్‌లో మొదలై ఆగస్టులో గరిష్ట స్థాయికి చేరుకుని అక్టోబర్‌లో ముగుస్తుందని ఐఐటీ ఖరగ్‌పూర్ అంచనా వేసింది. తాజాగా కేంద్రం కూడా నాలుగో వేవ్‌పై హెచ్చరికలు జారీ చేయడంతో మళ్లీ కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలతోపాటు ప్రజలు సిద్ధం కావాల్సిన పరిస్థితి నెలకొంది.