స్పందించిన కేంద్రం.. 1.70 ల‌క్ష‌ల‌ ఆర్థిక ప్యాకేజీ

కేంద్రం ప్ర‌భుత్వం స్పందించింది. ఆర్థిక ప్యాకేజీ ప్ర‌క‌టించింది. అందులో భాగంగా అత్య‌వ‌స‌ర స‌ర్వీసుల్లో ప‌నిచేస్తున్న వారంద‌రికీ రూ.50ల‌క్ష‌ల చొప్పున ఇన్సూరెన్స్ స‌దుపాయం క‌ల్పిస్తున్న‌ట్టు మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించారు. ఆషా వ‌ర్క‌ర్ల నుంచి పారా మెడిక‌ల్, వైద్య సిబ్బంది స‌హా అంద‌రికీ ఇది వ‌ర్తిస్తుంద‌ని వెల్ల‌డించారు. పారిశుద్య కార్మికులు స‌హా అంద‌రికీ అందిస్తామ‌న్నారు.

క‌రోనా నేప‌థ్యంలో కేంద్రం ప‌రిస్థితుల‌కు అనుగుణంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని మంత్రి తెలిపారు. దేశంలో ప్ర‌జ‌లంద‌రికీ త‌గిన ఆహార ధాన్యాలు, ఇత‌ర సంక్షేమ కార్య‌క్ర‌మాలు అందించేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని మంత్రి తెలిపారు. వ‌ల‌స కార్మికులు, ప‌ట్ట‌ణ‌పేద‌లు అంద‌రినీ ఆదుకుంటామ‌న్నారు. న‌గ‌దు బ‌దిలీ ద్వారా స‌హాయాన్ని అందిస్తామ‌న్నారు. ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ళ్యాణ్ అన్న యోజ‌న కింద దేశ జ‌నాభాలోని మూడింట రెండు వంతుల మందికి నెల‌కు 5కిలోల బియ్యం లేదా గోధుమ‌లు ఉచితంగా అందిస్తామ‌న్నారు. ఇప్ప‌టికే అందిస్తున్న దానికి తోడుగా రాబోయూ మూడు నెల‌ల పాటు ఇది ఉచితంగా అందిస్తామ‌న్నారు. 80 కోట్ల మంది పేద‌ల‌కు ఇది ల‌బ్ది చేకూరుతుంద‌న్నారు. అద‌నంగా మ‌రో కిలో ప‌ప్పు ధాన్యాలు అందిస్తామ‌న్నారు. రెండు విడ‌త‌ల్లో వాటిని అందిస్తామ‌ని మంత్రి తెలిపారు.

వివిధ వ‌ర్గాల‌కు ప్ర‌భుత్వం స‌హాయం ప్ర‌క‌టించింది. ఆ వివ‌రాల‌ను మంత్రి వెల్ల‌డిస్తూ పీఎం కిసాన్ యోజ‌న కింద కిసాన్ స‌మ్మాన్ నిధి కింద రైతుల‌కు ఏటా రూ.6వేల చొప్పున అందిస్తున్నాం. ప్ర‌స్తుతం దానిలో మొద‌టి విడ‌త‌గా 8.69 కోట్ల మంది రైతుల‌కు రూ.2వేల కోట్ల చొప్పున అందిస్తాం. ఏప్రిల్ మొద‌టి వారంలో అంద‌రికీ అకౌంట్ల‌లో నిధులు జ‌మ చేస్తాం. ఉపాధి హామీ కూలీల‌కు 5కోట్ల కుటుంబాల‌కు వేత‌నాలు పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నాం. రూ.202 కి రోజువారీ వేత‌నాలు పెంచాము. దానికి తోడుగా రూ.2వేల రూపాయ‌లు చొప్పున ఒక్కొక్క‌రికీ అందిస్తాం. నిరుపేద వృద్ధులు, విక‌లాంగులు, వితంతువుల‌కు ఒక్కొక్క‌రికీ రూ. 1000 చొప్పున అందిస్తాం. 3 కోట్ల మందికి ల‌బ్ది చేకూరుతుంది. ల‌బ్ధిదారుల‌కు నేరుగా న‌గ‌దు బ‌దిలీ జ‌రుగుతుంది. 20కోట్ల మ‌హిళా జ‌న‌ధ‌న్ అకౌంట్ల‌లో న‌ష్ట‌ప‌రిహారం కింద రూ. 500 చొప్పున రాబోయే మూడు నెల‌లకు రూ. 1500 జ‌త‌చేస్తాం. అంటూ వివ‌రించారు.

ఉజ్వ‌ల ప‌థ‌కం కింద నిరుపేద ల‌బ్దిదారులైన 8.3కోట్ల‌ కుటుంబాల‌కు నెల‌కు ఒక్కో సిలెండ‌ర్ చొప్పున ఉచితంగా అందించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు మంత్రి తెలిపారు. మ‌హిళా స్వ‌యం సంఘాల‌కు 7కోట్ల కుటుంబాల‌కు చెందిన 63ల‌క్ష‌ల గ్రూపుల‌కు 10ల‌క్ష‌ల రుణాలు చొప్పున అందించే ప‌థ‌కాన్ని రూ.20ల‌క్ష‌ల‌కు రెట్టింపు చేస్తున్న‌ట్టు ప్ర‌కటించారు. సంఘ‌టిత రంగంలో ఉన్న వారికి పీఎఫ్ ఖాతాదారులంద‌రికీ యజ‌మాని, ఉద్యోగి వాటా మొత్తం కేంద్ర‌మే చెల్లిస్తుంద‌ని తెలిపారు. ఈపీఎఫ్ వాటా దారుల‌కు స‌మ‌స్య రాకుండా 24శాతం వాటాను ప్ర‌భుత్వం భ‌రిస్తుంద‌ని వెల్ల‌డించారు. రాబోయే మూడు నెల‌ల పాటు అమ‌లు చేస్తామన్నారు.

పీఎఫ్ విధానాలు కూడా స‌వ‌రిస్తున్న‌ట్టు మంత్రి తెలిపారు. అందులో భాగంగా తిరిగి చెల్లించాల్సిన అవ‌స‌రం లేకుండా ఇప్ప‌టికే ఖాతాదారులు నిల్వ చేసిన దానిలో 75 శాతం వ‌ర‌కూ గానీ లేదా 3నెల‌ల వేత‌నాల‌కు స‌మాన‌మైన మొత్తంగానీ ఏది త‌క్కువ‌గా ఉంటే దానిని తీసుకునే అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ట్టు వెల్ల‌డించారు. భ‌వ‌న నిర్మాణ కార్మికుల కోసం వెల్ఫేర్ ఫండ్ నుంచి 31వేల కోట్ల రూపాయ‌ల నిధులు ఉన్నాయ‌ని, దాని నుంచి 3.5కోట్ల మంది రిజిస్ట‌ర్ అయిన కార్మికుల‌కు త‌గిన స‌హాయం అందించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు సూచిస్తున్నామ‌ని మంత్రి తెలిపారు. ఆరోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని మంత్రి హామీ ఇచ్చారు.

Show comments