iDreamPost
iDreamPost
కరోనా మహమ్మారి విరుచుకుపడుతుంటే కొందరు మాత్రం రాజకీయాలకు కొదవేముంది అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కష్టకాలంలోనూ తమ ధోరణిలో సాగుతున్నారు. అలాంటి వారి జాబితా తీస్తే చంద్రబాబు ముందుపీఠిన నిలుస్తారు. ఆయన వ్యవహారం అందుకు తగ్గట్టుగానే ఉంది. గత నెలరోజుల్లో చంద్రబాబు తీరు ఆ విషయాన్ని చాటుతోంది. ప్రజలంతా లాక్ డౌన్ లో ఇరుక్కున్నా చంద్రబాబు చలించడం లేదు. కనీసం మానవత్వంతో ఆదుకుందామనే స్పృహ ఆయనకు లేదు. పైగా కరోనా సమయంలో కూడా హెరిటేజ్ పాల ధర పెంచి లాభాలు పెంచుకునే ప్రయత్నం చేసిందనే విమర్శ ఆయన సొంత సంస్థలపై ఉంది.
ఏపీలో టీడీపీ అధికారంలో ఉండగా ఎన్టీఆర్ ట్రస్ పేరుతో భారీగా భూములు రాయించుకున్నారు. విలువైన స్థలాలను సుమారు 10 నగరాల్లో టీడీపీకి కేటాయించారు. అందులో మంగళగిరిలో ప్రస్తుతం ఉన్న రాష్ట్ర కార్యాలయం నుంచి విశాఖ, శ్రీకాకుళం, కాకినాడ, ఒంగోలు, కడప సహా పలు చోట్ల ఉన్నాయి. సేవా కార్యక్రమాల పేరుతో ఎన్టీఆర్ ట్రస్ట్ కి ఈ ఆస్తులను కట్టబెట్టడంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం తీవ్రంగా శ్రమించింది. వివిధ రకాల భూములను అప్పగించడమే పనిగా సాగింది. అలాంటి ఎన్టీఆర్ ట్రస్ట్ ఇంత కష్టకాలంలో ఎందుకు పట్టనట్టు ఉందనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ప్రజలంతా సమస్యల్లో ఉంటే వారిని ఆదుకునేందుకు కదలాల్సిన వారంతా సేవ చేస్తుంటే చంద్రబాబు , ఆయన సొంత సంస్థ ఎన్టీఆర్ ట్రస్ట్ మాత్రం ఉలుకూ పలుకూ కనిపించడం లేదు.
చంద్రబాబు, ఆయన కుటుంబ సంస్థ హెరిటేజ్ నుంచి మాత్రం కొద్దిమేరకు సహాయం ప్రకటించి చేతులు దులుపుకున్నారు. హైదరాబాద్ లో ని సొంత ఇంటి నుంచే రాజకీయ కార్యకలాపాలు నడుపుతున్నా చంద్రబాబు సేవా కార్యక్రమాలపై మాత్రం మనసు మళ్లించలేదు. పైగా సేవ చేస్తున్న వారిని నిందించే పనికి పూనుకున్నారు. కొందరు నేతల మీద దృష్టి పెట్టి దుమ్మెత్తిపోసేందుకు సాహసించారు.
చివరకు చంద్రబాబు ఏం చేశారనే ప్రశ్నలు ఉదయించడంతో ఆయన ఆలశ్యంగా మేల్కొని, ఓ ప్రకటన చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో టీడీపీ శ్రేణులంతా మాస్కులు పంచాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈనెల 24న చంద్రబాబు ఇచ్చిన పిలుపుతో 25 వ తేదీ నాటికే మొత్తం రెండున్నర లక్షల మాస్కులు పంచేసినట్టు తాజాగా మరో ప్రకటన చేశారు. ప్రకటనలు బాగానే ఉన్నాయి..గానీ అసలు ఎక్కడ పంచారు అనేది అంతుబట్టకుండా ఉంది. అయినా బాబు చెప్పడంతోనే మాస్కులు పంపిణీ అయిపోయిందనే రీతిలో ఆడంబరంగా చెప్పుకోవడానికి మాత్రం సంకోచించలేదు. అసలు ఎవరికి పంచారు..ఎక్కడ పంచారు అనేది ఏపీలో ప్రజలెవరికీ అంతుబట్టకపోయినా ప్రచారంతో వారందరినీ నమ్మించవచ్చనే ధీమా టీడీపీ నేతల్లో ఉన్నట్టు కనిపిస్తోంది. ఎంతైనా ఈ విషయంలో బాబుని మించిన వాళ్లు భూమి మీదే ఎవరూ ఉండరేమో అనే అనుమానం కలగమానదు. కరోనా వేళ కూడా ఆయన కనికరం లేకుండా సాగిస్తున్న ప్రచార మాయాజాలం దానికి ప్రధాన కారణం.