iDreamPost
android-app
ios-app

జేడీ లక్ష్మీనారాయణ.. బ్యాక్‌ టూ పెవిలియన్‌

జేడీ లక్ష్మీనారాయణ.. బ్యాక్‌ టూ పెవిలియన్‌

సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ మరో సరికొత్త అవతారం ఎత్తారు. కౌలు రైతుగా మారి, పదెకరాలు సాగు చేసేందుకు సిద్ధమయ్యారు. కౌలు రైతుల సమస్యలు తెలుసుకునేందుకే తాను కౌలు రైతుగా మారానంటూ చెప్పుకొస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో జేడీ కౌలు రైతుగా వ్యవసాయం చే యబోతున్నారు. ఉగాది రోజున తాను కౌలుకు తీసుకున్న పొలంలో ఏరువాక సాగించారు జేడీ లక్ష్మీనారాయణ.

జేడీ లక్ష్మీ నారాయణగా సుపరిచితమైన ఆయన వైఎస్‌ జగన్‌పై కాంగ్రెస్, టీడీపీ నేతలు శంకరరావు, ఎర్రాన్నాయుడులు చేసిన ఫిర్యాదులపై దర్యాప్తులో అత్యుత్సాహం చూపి అందరి దృష్టిని ఆకర్షించారు. కారణాలు ఏమైనా.. ఉద్యోగానికి ముందుగా వదిలేసిన ఆయన ప్రజా జీవితంలోకి వచ్చారు. రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పిన జేడీ.. అంతకు ముందుగా రైతు సమస్యలపై అధ్యయనం పేరుతో రాష్ట్రంలో పర్యటించారు.

రైతులతో సమావేశాలు నిర్వహిస్తూ, పంట పొలాల వెంట తిరుగుతూ కొన్ని నెలల పాటు జేడీ లక్ష్మీనారాయణ హల్‌ చల్‌ చేశారు. రాజకీయాల్లోకి వచ్చి రైతుల కోసం పని చేస్తానని చెప్పారు. వ్యవసాయ శాఖ మంత్రి అవ్వాలనుకుంటున్నానని కూడా చెప్పుకొచ్చారు.

Also Read : ఎన్నికలు ఏవైనా సరే.. వారి ప్రస్తావన గ్యారెంటీ

సొంతంగా పార్టీ పెడతారని, ఆమ్‌ఆద్మీ పార్టీని ఏపీలో విస్తరిస్తారని కొద్ది రోజులు ప్రచారం సాగింది. ఆ తర్వాత బీజేపీ, టీడీపీ.. ఏదో ఒక పార్టీలో చేరతారనే ఊహాగానాలు నడిచాయి. చివరకు 2019 ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరారు జేడీ లక్ష్మీ నారాయణ. వ్యవసాయంలో సమస్యలపై అధ్యయనం చేస్తూ.. వ్యవసాయ మంత్రి అయి రైతులకు సేవ చేయాలని చెప్పిన జేడీ లక్ష్మీ నారాయణ.. లోక్‌సభకు పోటీ చేశారు. మాటలకు, చేతలకు పొంతన లేకపోవడంతో విశాఖ లోక్‌సభ ఓటర్లు జేడీని మూడో స్థానంలో కూర్చొబెట్టారు.

సాధారణ ఎన్నికలు ముగిసిన ఏడాది తర్వాత.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యవహార శైలి నచ్చకపోవడంతో బయటకు వచ్చారు. సినిమాలు చేయబోనని చెప్పిన పవన్‌.. ఆ మాటపై నిలబడకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నానని చెప్పారు. జనసేన పార్టీకి రాజీనామా చేసిన తర్వాత దాదాపు ఏడాదిపాటు కనిపించని జేడీ లక్ష్మీ నారాయణ.. నిన్న ఉగాది రోజున ప్రత్యక్షమయ్యారు. ఈ సారి కౌలు రైతుల సమస్యలపై అధ్యయం చేస్తానని చెబుతున్నారు.

గతంలో వ్యవసాయంలో సవాళ్లు, రైతుల సమస్యలపై అధ్యయం సాగించి, జనసేన తరఫున పోటీ చేసిన జేడీ.. ఈ సారి కౌలు రైతు అవతారం ఎత్తారు. మరి ఈ పయనం ఎప్పుటి వరకు సాగుతుంది..? ఏ పార్టీ వద్ద ఆగుతుంది..? రాబోయే ఎన్నికల్లో ఆయన భాగస్వామ్యం ఎలా ఉండబోతోంది..?అనేది భవిష్యత్‌లో తేలుతుంది.

Also Read : పావలా కోడికి.. ముప్పావలా మసాలా..