iDreamPost
iDreamPost
ఇటీవలే పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు అల్లు అర్జున్. అందరు సెలబ్రిటీలలాగే అల్లు అర్జున్ కూడా వరుసగా యాడ్స్ చేస్తున్నారు. కానీ గత కొంతకాలంగా బన్నీ చేసే యాడ్స్ అన్ని వరుస వివాదాలకు దారి తీస్తున్నాయి. ఇటీవల కాలంలో బన్నీ తీసిన ప్రతి యాడ్ వివాదానికి కారణం అవుతుంది. తాజాగా బన్నీ చేసిన మరో యాడ్ కూడా వివాదానికి కారణమవడంతో అతనిపై కేసు నమోదైంది.
కొన్ని రోజుల క్రితం రాపిడో సంస్థ బన్నీతో చేయించిన ప్రకటనలో సిటీ బస్సుల గురించి తక్కువ చేసి చూపించడంపై TSRTC ఎండీ సజ్జనార్ ఫైర్ అయి ఆ యాడ్స్ తొలగించకపోతే అల్లు అర్జున్, రాపిడో సంస్థపై కేసు వేస్తామని హెచ్చరించారు. దీంతో ఆ యాడ్స్ లోని సిటీ బస్సుల గురించి తీసిన షాట్ ని తొలిగించారు.
ఇటీవల బన్నీ యాక్ట్ చేసిన జొమాటో యాడ్ కూడా వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ యాడ్‌లో నటుడు సుబ్బరాజును బన్నీ కొట్టగా ఆ దెబ్బకు సుబ్బరాజు గాల్లో తేలిపోతాడు. ‘బన్నీ నన్ను త్వరగా కిందకు దించవా..’ అని సుబ్బరాజు అడిగితే ‘సౌత్ సినిమా కదా ఎక్కువ సేపు ఎగరాలి’ అని బన్నీ అంటాడు. దీంతో సౌత్ సినిమాలు, అందులో యాక్షన్ సీక్వెన్స్‌లపై అల్లు అర్జున్ కౌంటర్ వేసాడని పలువురు విమర్శించడంతో జొమాటో కూడా ఆ సన్నివేశాన్ని తొలిగించక తప్పలేదు.
తాజాగా బన్నీ శ్రీ చైతన్య విద్యాసంస్థల కోసం ఓ యాడ్ చేశాడు. ప్రస్తుతం ఆ యాడ్ వివాదానికి దారి తీస్తుంది. బన్నీ నటించిన శ్రీ చైతన్య విద్యాసంస్థల వ్యాపార ప్రకటన విద్యార్థులని తప్పుదోవ పట్టించేలా ఉందని, ఐఐటీ, ఎన్ఐటీ ర్యాంకుల విషయంలో తప్పుడు సమాచారం ఇస్తున్నారని బన్నీతో పాటు శ్రీ చైతన్య విద్యాసంస్థలపై కొత్త ఉపేందర్‌రెడ్డి అనే సామాజిక కార్యకర్త హైదరాబాద్‌లోని అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో బన్నీపై, శ్రీ చైతన్య సంస్థలపై కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇలా బన్నీ చేసే ప్రతి యాడ్ వివాదానికి దారి తీస్తుండటంతో అభిమానులు నిరాశకి గురవుతున్నారు.