iDreamPost
android-app
ios-app

ఉత్త‌రాంధ్ర‌.. ఉనికి కోసం ఏళ్లుగా పోరాటం : ‌రాజ‌ధాని రాక‌తో సంతోషం!

ఉత్త‌రాంధ్ర‌.. ఉనికి కోసం ఏళ్లుగా పోరాటం : ‌రాజ‌ధాని రాక‌తో సంతోషం!

ఉత్తరాంధ్ర దానికి మ‌రో పేరు కళింగాంధ్ర. ఎన్నో ఏళ్లుగా రాజ‌ధానుల‌కు దూరంగా.. అభివృద్ధికి అంద‌ని ప్రాంతంగా ఉండిపోయింది. ఉపాధి క‌రువై బ‌తుకుదెరువు కోసం ఎన్నో సంవ‌త్స‌రాలుగా ఆ ప్రాంతాల పెద్ద‌లు కుటుంబాల‌ను వ‌దిలి వ‌ల‌స‌లు పోతూనే ఉన్నారు. ఉత్తరాంధ్ర లో శ్రీ‌కాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు ఉన్నాయి. వాటిలోని శ్రీ‌కాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన అత్య‌ధిక మంది ఎక్కువ‌గా వ‌ల‌స‌లు వెళ్తూ ఉంటారు. ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో విశాఖప‌ట్నంలో మాత్రం అభివృద్ధి చాయ‌లు క‌నిపిస్తాయి. ఉత్త‌రాంధ్ర‌కు రాజ‌ధాని ఎప్పుడూ దూరంగానే ఉండేది. భాషా ప్ర‌యుక్త రాష్ట్రాల ఆవిర్భానికి ముందు.. త‌ర్వాత కూడా ఉత్త‌రాంధ్ర‌లో విశాఖ‌ప‌ట్ట‌ణం మినహా మిగిలిన ప్రాంతాల్లో పెద్ద‌గా మార్పులు క‌నిపించ‌వు. చక్కెర, జౌళి, జీడిపప్పు, పాలు/పాల ఉత్పత్తులకు సంబంధించి అనేక సహకార క‌ర్మాగారాలు ఉన్న‌ప్ప‌టికీ అంద‌రికీ ఉపాధి క‌ల్పించ‌లేక‌పోతున్నాయి.

అప్పుడు – ఇప్పుడు కూడా..

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిగా హైద‌రాబాద్ కొన‌సాగిన‌ప్పుడు.. ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల‌కు ఏ అవ‌స‌రం వ‌చ్చినా ఇక్క‌డ వ‌ర‌కూ రావ‌డం త‌ల‌కు మించిన భారంగా ఉండేది. అటూ.. ఇటూ ప్ర‌యాణ స‌మ‌య‌మే రెండు రోజుల‌కు పైగా ప‌ట్టేది. ప‌నుల నిమిత్తం హైద‌రాబాద్ కు వ‌చ్చేవారిలో కొంద‌రు నెల‌ల త‌ర‌బ‌డి ఇక్క‌డే ఉండిపోయే వారు. రాష్ట్రం విడిపోయే స‌మ‌యంలో అభివృద్ధి వికేంద్రీర‌ణ తెర‌పైకి వ‌చ్చిన‌ప్పుడు విశాఖ‌ప‌ట్టణానికి కూడా త‌గిన ప్రాధాన్యం వ‌స్తుంద‌ని ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లు భావించారు. కానీ.. అమ‌రావ‌తి రాజ‌ధానిగా టీడీపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఆ ప్రాంతం కూడా ఉత్త‌రాంధ్ర‌కు దూర‌మే. ప్ర‌యాణ సౌల‌భ్యం కూడా అంత‌గా లేదు. దీంతో వారికి మ‌ళ్లీ నిరుత్సాహం త‌ప్ప‌లేదు.

మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న‌తో..

జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన కొద్ది నెల‌ల త‌ర్వాత‌.. మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న తెర‌పైకి వ‌చ్చింది. దీనికి ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు కూడా ల‌భించింది. దీనిలో భాగంగా ఉత్త‌రాంధ్ర‌కు ప్ర‌ధాన కేంద్ర‌మైన విశాఖ‌ప‌ట్ట‌ణాన్ని పాల‌నా రాజ‌ధానిగా జ‌గ‌న్ ప్ర‌క‌టించ‌డంతో ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల ఆనందానికి అవ‌ధుల్లేవు. ఇన్నాళ్ల‌కు త‌మ‌కు చేరువ‌లో రాజ‌ధాని వ‌స్తుండ‌డంతో త‌మ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయ‌ని ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. అత్యంత విశాల‌మైన విశాఖ‌ప‌ట్ట‌ణం అన్ని విధాలుగానూ రాజ‌ధానికి అనువైన ప్రాంత‌మ‌ని చెబుతున్నారు.

చంద్ర‌బాబూ స‌హ‌క‌రించండి :

అభివృద్ధిని అడ్డుకోవ‌ద్ద‌ని ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లు తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడును కోరుతున్నారు. ఇన్నాళ్ల‌కు త‌మ ప్రాంతాల అభివృద్ధికి మార్గం సుగ‌మం అవుతోంద‌ని, ప్ర‌తిప‌క్ష నేత‌గా త‌మ‌రు కూడా స‌హ‌క‌రించాల‌ని వేడుకుంటున్నారు. మూడు రాజ‌ధానుల బిల్లును ఆమోదించ‌వ‌ద్దంటూ టీడీపీ వ‌ర్గాలు గ‌వ‌ర్న‌ర్ కు లేఖ‌లు మీద లేఖ‌లు రాశాయి. దీనిపై ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లు ఆవేద‌న, ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.