iDreamPost
android-app
ios-app

రాజధాని పొంగలి పొంగుతోందా? మండుతోందా ?

  • Published Dec 31, 2019 | 7:51 AM Updated Updated Dec 31, 2019 | 7:51 AM
రాజధాని పొంగలి పొంగుతోందా? మండుతోందా ?

భూమిని నమ్ముకొని స్వేదాన్ని చిందించే రైతు కనుమరుగు అయ్యే రోజులు వచ్చాయా అంటే అవుననే అనిపిస్తోంది . రాజధాని ప్రాంత రైతు రైతుతత్వాన్ని , భూమి పై మమకారాన్ని కోల్పోతున్నారనుకొంటా .

నమ్మరా అయితే రాజధాని మందడం వెళ్లి చూద్దాం రండి . ఇదిగో ఇక్కడ గ్రామ మహిళలు గుమికూడి గ్రామ దేవతకు పొంగళ్ళు చేస్తున్నారు చూసారా .

వీరు పొంగళ్ళు పొంగిస్తుంది చూసి పల్లె తల్లులు అని మురిసిపోయి ప్రసాదానికి చేతులు చాపకండి .

ఆ పొంగళ్ళు పొంగుతోంది వానల్లు కురవాలి వరి చేలు పండాలి అని కాదు ,

తమ భూముల్లో సిరులు పండి తమ గాదెలు నిండాలని కాదు .

పిల్లా జెల్లా పాడి పంటా సల్లంగా ఉండాలని అస్సలు కాదు .

గ్రామంలో ఏ రోగాలు , రొస్టులూ రాకుండా కాపు కాయమని కాదు .

తమ భూములు ప్రభుత్వం ఆక్రమించుకోవాలని ,

పరిహారం కింద స్థలాలివ్వమని ,

తమని కూర్చోబెట్టి కవులు పరిహారమిమ్మని ,

పొలాలు చదును చేసి పంటలు లేకుండా చేయమని ,

ఆకాశహర్మ్యాలు కట్టి తమని కలల లోకంలో విహరింపచేయమని ,

పల్లె బతుకు ఛిద్రం చేసి పట్టణ వాసం ప్రసాదించమని,

అంతిమంగా తమకి గ్రామం వద్దు పగలగొట్టి పట్టణం చేయమని గ్రామదేవతకి పొంగళ్ళు పొంగించి నైవేద్యం పెట్టి వేడుకొంటున్నారు .

పొద్దున లేచినప్పటి నుండి పొద్దుపోయి నడుం వాల్చే వరకూ పాడి పంటల పనులే చేస్తూ వాటి అభివృద్ధి గురించి మాత్రమే ఆలోచించే రైతు కుటుంబాల మహిళలు ఇలా తమ భూముల్ని జీవం లేని కాంక్రీటు అరణ్యాలు చెయ్యమని ఘోషిస్తుంటే త్వరలో రైతు కనుమరుగు కానున్నాడా అనిపించక మానదు .

ఈ దుస్థితికి కారణం ఎవరు ?. ఈ విష సంస్కృతి ఆ పల్లెల్లో పెరగటానికి దోహద పడిన అంశాలేమిటి ?.

ఈ కోణంలో ఆలోచిస్తే తన తన అనుయాయుల స్వార్థం కోసం రైతు భూములతో చెలగాటమాడి , అసాధ్యాన్ని సుసాధ్యం అని నమ్మించి వారికి అలవిమాలిన ఆశలు కల్పించి భవిష్యత్ పట్ల అరచేతిలో వైకుంఠం చూపించి భూములు లాక్కున్న తర్వాత భవిష్యత్ ఆగమ్యగోచరం చేసి , ప్రశాంత పల్లె జీవనంలో విషపు చుక్కలు నింపి , ఐదేళ్ల విలువైన కాలాన్ని హరించి ఇవాళ వాళ్ళని త్రిశంఖు స్వర్గంలో నిలిపిన చంద్రబాబు ఎప్పటికీ క్షమార్హుడు కాదు .

ఏదేమైనా రైతుతత్వాన్ని కోల్పోయి భూమికి , పల్లెకు దూరమయ్యే ఈ మార్గంలో పయనిస్తున్న వ్యక్తులకు ఇతర రైతుల నుండి మద్దతు లభించకపోవడంలో ఆశ్చర్యం లేదు . ఈ కారణంతోనేనేమో రాజధాని ప్రాంత రైతుల ధర్నాలకు అదే జిల్లాల్లో పక్క నియోజక వర్గాల రైతుల మద్దతు కూడా లభించనిది .

రాజధాని ప్రాంత రైతులు ఇప్పటికైనా ఊహా లోకాల్లోంచి దిగిరావాలి . స్వార్ధ ప్రయోజనాల కోసం బినామీల ద్వారా తమని రెచ్చగొట్టి ఉద్యమాల పేరిట రోడ్డెక్కిస్తున్న నాయకుల ప్రయోజనాల కోసం మోసపోకుండా తమకంటూ రైతు కమిటీలు ఏర్పాటు చేసుకొని ప్రభుత్వంతో నేరుగా సంప్రదింపులు చేసుకోవాలి .

తామేమి నష్టపోయామో ప్రభుత్వానికి ప్రపంచానికి తెలియజేసి , ప్రభుత్వం తమకేమి ఇవ్వదలుచుకొంది తెలుసుకోవాలి . తర్వాత ప్రత్యామ్నాయాల గురించి చర్చించి ఫలితం పొందాలి . అది జరగని పక్షంలో న్యాయమైన డిమాండ్స్ కోసం ప్రభుత్వాన్ని నిలదీయొచ్చు , కోర్టు గుమ్మాలు ఎక్కొచ్చు , ఉద్యమాలూ , ప్రజాపోరాటాలు చేసి ఫలితం పొందొచ్చు .

అంతేకానీ వందల వేల ఎకరాలు భూములు కొని వాటి ధరలు పడిపోతాయని స్వప్రయోజనాల కోసం మీ రైతుల్లో బినామీలని కలిపేసి ఆడిస్తున్న నాటకంలో పావులుగా బలి కాకండి . మీ రైతుల ముసుగులో , లేదా మీకోసం పోరాటం అని చెప్పి సభ్యతా సంస్కారాలు లేకుండా ఉచ్ఛంనీచం ఎరగకుండా వారు బూతులు తిడితే , అల్లర్లు , దాడులు చేస్తే మీ సమస్యలు పరిస్కారం కాకపోగా మీరు మిగతా సమాజం దృష్టిలో దోషులుగా నిలబడటం ఖాయం .