iDreamPost
android-app
ios-app

మమతను ఓడించినట్లే అఖిలేష్‌ను కూడా బీజేపీ ఓడిస్తుందా?

మమతను ఓడించినట్లే అఖిలేష్‌ను కూడా బీజేపీ ఓడిస్తుందా?

బెంగాల్ గడ్డపై ఫలితం ఇవ్వని అదే పాచికను యూపీ ఎన్నికల్లో కూడా బీజేపీ ప్రయోగిస్తోంది. సమాజ్‌వాదీ అధినేత అఖిలేష్ యాదవ్‌ను తన నియోజకవర్గానికే పరిమితం చేయడానికి కాషాయదళం వ్యూహం రచిస్తోంది. అందులో భాగంగా మాజీ సీఎం అఖిలేష్‌పై కేంద్ర సహాయ మంత్రి,బలమైన దళిత నేత సత్యపాల్‌ సింగ్‌ బఘేల్‌ను పోటీకి నిలిపి కాక పుట్టించింది.

గతేడాది జరిగిన బెంగాల్ ఎన్నికల్లో సువేందు అధికారి సొంత ఖిల్లా నందిగ్రామ్‌లో సీఎం మమతా బెనర్జీ తల పడేలా బీజేపీ వ్యూహం పన్నింది. దీంతో సువేందు అధికారిని సవాల్ చేసేందుకు ఆ నియోజకవర్గంపై దీదీ ఎక్కువ దృష్టి సారించాల్సిన పరిస్థితిని కాషాయ దళం కల్పించింది.ఆ ఎన్నికల్లో బెంగాల్ అంతటా తృణమూల్ కాంగ్రెస్ ప్రభంజనం కొనసాగినప్పటికీ మమతా ఎమ్మెల్యేగా ఓటమిపాలైంది. నేడు యూపీ ఎన్నికలలోనూ అదే వ్యూహంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారంలో దూసుకుపోతున్న అఖిలేష్‌ను కట్టడి చేసేందుకు వ్యూహాత్మక అడుగు వేసింది. కర్హాల్‌ బరిలో అఖిలేష్‌ను ఢీ కొట్టడానికి బలమైన దళిత నేత, కేంద్ర మంత్రి బఘేల్‌ను రంగంలోకి కమలదళం దింపుతోంది. అయితే నందిగ్రామ్‌ సువేందు అధికారి సొంత నియోజకవర్గం కాగా కర్హాల్‌ అఖిలేష్ కంచుకోట. కాబట్టి కమలం ఆశలు నెరవేరుతాయా అంటే అది ప్రశ్నార్థకమే అని గట్టిగా వినిపిస్తోంది.

ఎస్సై నుండి రాజకీయ నేతగా.. 

కర్హాల్‌ స్థానంలో అఖిలేష్‌పై పోటీకి సై అంటున్న ఎస్‌పి సింగ్‌ బఘేల్‌ పోలీస్ శాఖలో ఎస్‌ఐగా తన కెరీర్‌ ప్రారంభించారు. 1989లో ముఖ్యమంత్రి అయిన ములాయం సింగ్ యాదవ్ వ్యక్తిగత భద్రతా అధికారిగా (PSO) పనిచేశారు. ఆ సమయంలో భద్రతా అధికారిగా బఘేల్‌ నిజాయితీ, ధైర్యంతో పని చేసి ములాయం అభిమానాన్ని చూరగొన్నారు. దీంతో సమాజ్‌వాదీపార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించిన ఎస్‌పి సింగ్‌ బఘేల్‌ 1998 ఎన్నికల్లో జలేసర్ స్థానం నుంచి లోక్‌సభకు తొలిసారి గెలుపొందారు.ఆ తర్వాత కూడా వరుసగా రెండుసార్లు 1999, 2004 ఎన్నికల్లో జలేసర్ నుండి సమాజ్‌వాదీ ఎంపీగా ఎన్నికయ్యారు. అనంతరం బీఎస్పీలో చేరిన అతనికి జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యత కట్టబెట్టి 2010లో మాయావతి రాజ్యసభకు పంపింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఫిరోజాబాద్ నుంచి ఎన్నికల బరిలో దిగిన బఘేల్‌ సమాజ్‌వాదీ అభ్యర్ధి చేతిలో ఓటమి పాలయ్యారు.

2014 సాధారణ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి కాషాయం కప్పుకున్నారు. కమలం పార్టీ ఆయనని బీజేపీ బ్యాక్‌వర్డ్‌ ఫ్రంట్‌ జాతీయ అధ్యక్షుడిగా నియమించింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్‌పి సింగ్‌ బఘేల్‌ తుండ్లా స్థానంలో గెలిచి యోగి ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా చేశారు. కానీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఆగ్రా నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం ఆయన మోడీ కేబినెట్‌లో న్యాయ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికలలో అఖిలేష్‌ ఆరంగేట్రం

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సోమవారం నామినేషన్‌ దాఖలుచేశారు. మెయిన్‌పురి జిల్లాలోని కర్హాల్‌ నుంచి ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఆరంగేట్రం చేస్తున్నారు.ఇక 2002 ఎన్నికలు మినహా 1993 నుంచి సమాజ్‌వాదీ ఓటమి ఎరుగని నియోజకవర్గం కర్హాల్‌.

సమాజ్‌వాదీ కంచుకోటగా పేరొందిన కర్హాల్‌ నియోజకవర్గంలో సుమారు 3.7 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో దాదాపు లక్షన్నర వరకూ యాదవ్ ఓటర్లే ఉంటారు. కర్హాల్ స్థానానికి మంగళవారంతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తుంది. మూడో దశలో ఫిబ్రవరి 20న పోలింగ్ జరగనుంది. 

ఇక సమాజ్‌వాదీ అధినేత అఖిలేష్‌కు పోటీగా దళిత వర్గానికి చెందిన ఎస్‌పి సింగ్‌ బఘేల్‌ను బీజేపీ రంగంలోకి దింపడంతో యూపీ రాజకీయాలు రంజుగా మారాయి.