iDreamPost
iDreamPost
దేశంలో ఎక్కడ.. ఏ ఎన్నికలు జరిగినా ప్రత్యర్థి పార్టీవారు దొంగ ఓట్లు వేసేశారని, బయట ప్రాంతాల నుంచి బోగస్ ఓటర్లను రప్పించారని పరస్పరం ఆరోపణలు చేసుకోవడం, రచ్చ చేయడం అలవాటైపోయింది. ఇటువంటి వాటికి చెక్ పెట్టి దొంగ ఓట్లు వేసే అవకాశమే లేకుండా ఎన్నికల సంస్కరణలు తీసుకురావాలని, ఓటర్ కార్డులను ఆధార్ తో అనుసంధానం చేయాలన్న డిమాండ్ చాలా కాలం నుంచి ఉంది. భారత ఎన్నికల సంఘం కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి చాలా కాలమే అయ్యింది. ఎట్టకేలకు కేంద్రం ఎన్నికల సంస్కరణలకు ముందడుగు వేసింది. ఈసీ ప్రతిపాదన మేరకు ఎన్నికల సంస్కరణలకు వీలుగా ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించే ముసాయిదా బిల్లును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. దీన్ని ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆధార్ లింక్ తో పాటు మరో రెండు ముఖ్యమైన సవరణలు ఇందులో ప్రతిపాదించారు.
దొంగ నాటకాలకు.. ఆరోపణలకు వీలుండదు
ఎన్నికల్లో వీలున్న చోట్ల తానే దొంగ ఓట్లు వేయడం.. వీలు కాని చోట్ల, ప్రత్యర్థి గెలవడం ఖాయమని తేలిన చోట్ల దొంగ ఓట్లు వేయిస్తున్నారని ప్రచారం చేయడం.. ఉత్తుత్తి ఫిర్యాదులు, ధర్నాలు వంటి దుష్ట పన్నాగాలకు ముగింపు పలకడంతో పాటు దొంగ ఓట్లు వేసే అవకాశమే లేకుండా చేసేందుకు ఎన్నికల సంఘం ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం ప్రతిపాదనను తీసుకొచ్చింది. ఎన్నికల సంస్కరణల్లో భాగంగా దీన్ని చేర్చి చాలా ఏళ్ల క్రితమే కేంద్ర న్యాయశాఖకు పంపింది. ఆధార్ అనుసంధానం వల్ల లక్షలాది వలస జీవులు ఓటు వేయడానికి స్వగ్రామాలకు వెళ్లనవసరం లేకుండా ఉన్న ప్రాంతంలోనే ఓటు హక్కు వినియోగించుకునే వెసులుబాటు కల్పించవచ్చని సూచించింది. దీనివల్ల ఓటింగ్ శాతం కూడా పెరుగుతుందని పేర్కొంది. మరోవైపు తానే స్వయంగా ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అయితే ఓటర్-ఆధార్ అనుసంధానానికి 1950 ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయాల్సి ఉంటుందని.. అప్పటివరకు అనుసంధానం నిలిపివేయాలని సూచించింది.
Also Read : మూడు రాజధానుల ఆకాంక్ష.. భారీ ర్యాలీతో బలంగా చాటిన తిరుపతి
కేంద్రం కాలయాపన
కానీ కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంస్కరణలు తీసుకురావడంలో ఇన్నాళ్లు అలసత్వం ప్రదర్శించింది. ఆధార్-ఓటర్ ఐడీ అనుసంధానం వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయన్న సాకుతో కేంద్ర న్యాయశాఖ పరిశీలన పేరుతో కాలయాపన చేసింది. ఆధార్-ఓటర్ ఐడీ అనుసంధానం వల్ల ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ అయ్యే ప్రమాదముందని వాదిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు అన్ని ప్రభుత్వ పథకాలకు, ఫోన్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ అకౌంట్, పీఎఫ్ అకౌంట్, రేషన్.. ఇలా ప్రతిదానికీ ఆధార్ తో అనుసంధానం తప్పనిసరి చేశారు. వాటికి లేని అభ్యంతరం, చోరీ భయం ఓటర్ కార్డుతో అనుసంధానానికే ఎందుకు అన్న ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే ఎట్టకేలకు ఆధార్ అనుసంధానానికే కేంద్రం ముందుకు వచ్చి ముసాయిదా బిల్లు ఆమోదించడంపై హర్షం వ్యక్తం అవుతోంది.
ఇక ఏటా నాలుగుసార్లు ఓటర్ల నమోదు
ఓటర్ కార్డ్-ఆధార్ అనుసంధానంతోపాటు మరో రెండు సవరణలకు కేంద్రం ఆమోదించింది. దాని ప్రకారం ప్రస్తుతం ఏటా ఒకసారి మాత్రమే జరుగుతున్న ఓటరు నమోదు కార్యక్రమం ఇక నుంచి నాలుగుసార్లు జరగనుంది. ప్రతి ఏటా జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారికి ఓటర్లుగా నమోదయ్యే అవకాశం కల్పిస్తున్నారు. ఆ తర్వాత నుంచి డిసెంబర్ 31 మధ్య కాలంలో 18 ఏళ్లు నిండిన వారందరూ మళ్లీ జనవరి ఒకటో తేదీ వరకు వేచి ఉండాల్సి వస్తుంది. ఈ నిరీక్షణ లేకుండా జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలల్లో అప్పటికి వయసు అర్హత సాధించినవారికి ఓటర్లుగా నమోదయ్యే అవకాశం కల్పిస్తారు.
రక్షణ దళాల్లో పనిచేస్తున్న సర్వీసు ఓటర్ల విషయంలో ఉన్న అసమానతను కూడా తొలగిస్తూ సవరణ చేశారు. సైనిక దళాల్లో పనిచేస్తున్న పురుషులతోపాటు వారి భార్యలను సర్వీస్ ఓటర్లుగా గుర్తిస్తున్నారు. కానీ అదే రక్షణ దళాల్లో పని చేస్తున్న మహిళల భర్తలను మాత్రం సర్వీసు ఓటర్లుగా గుర్తించడం లేదు. దీన్ని సవరించి మహిళా సైనికుల భర్తలను కూడా సర్వీసు ఓటర్లుగా గుర్తించేలా సవరణ చేశారు.
Also Read : మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ విషయంలో మెచ్చుకోవాల్సిందే